logo

కుదరని ముహూర్తం

జిల్లా కేంద్రంలో నిర్మించాలని భావిస్తున్న ఉప రిజిస్ట్రార్‌ కార్యాలయ భవన నిర్మాణానికి సరైన ముహూర్తం కుదరడం లేదు.

Updated : 04 Feb 2023 06:25 IST

నాలుగోసారీ నిలిచిన నిర్మాణం
సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ భవనానికి అడ్డంకులు
న్యూస్‌టుడే, వనపర్తి

గుట్టల మధ్య వేసిన శంకుస్థాపన శిలాఫలకం

జిల్లా కేంద్రంలో నిర్మించాలని భావిస్తున్న ఉప రిజిస్ట్రార్‌ కార్యాలయ భవన నిర్మాణానికి సరైన ముహూర్తం కుదరడం లేదు. పట్టణ పరిసరాల్లో భవన నిర్మాణానికి స్థలాన్ని సేకరించాలని ప్రయత్నించి కొన్ని ప్రాంతాలను ఎంపికచేసి శంకుస్థాపన శిలాఫలకాలు వేసినా నిర్మాణానికి నోచుకోలేదు. అనుమతులు వచ్చాయి.. నిధులు మంజూరయ్యాయి.. స్థలాన్ని ఎంపికచేశాం.. ఇక అన్నీ పూర్తయ్యాయి.. ఇక నిర్మాణమే తరువాయి అనుకుంటున్న సమయంలో ఏదో ఒక ఉపద్రవం అడ్డొచి ఆగిపోతోంది. జిల్లా కేంద్రం నుంచి మూడువైపులా ఎంపిక చేసిన స్థలాలు ఆయా ప్రాంతాల్లోని స్థిరాస్తి వ్యాపారుల వెంచర్లకు అనుకూలంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా వనపర్తి-కొత్తకోట రోడ్డు నాగవరం శివారులోనూ అదే దృశ్యం పునరావృతమైంది.

ఎందుకీ మార్పుచేర్పులు..

ప్రభుత్వానికి ఆదాయం, పురపాలక సంఘానికి సెస్సును అందించే ప్రధాన వనరైన రిజిస్ట్రేషను శాఖ కార్యాలయాన్ని అందరికీ అనువైన ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. దాదాపు 50 ఏళ్ల కిందటే వనపర్తిలో సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయం ఏర్పాటుచేసి అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. మొదటి నుంచి కొత్తకోట రోడ్డులోనే కార్యాలయం కొనసాగుతోంది. అయితే ప్రస్తుత అవసరాలకు అది సరిపోవడం లేదు. ఇరుకుగా మారడంతో అదే ప్రాంతంలోని వివేకానంద చౌరస్తా సమీపంలో మొదటి అంతస్తులో అద్దె భవనంలో ఏర్పాటుచేశారు. ఇక్కడికొచ్చాక వినియోగదారులకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఎగువ అంతస్తులో ఉండడంతో వృద్ధులు, మహిళలు కార్యాలయానికి వచ్చి సంతకాలు చేయడానికి అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఇది పాత భవనం కావడంతో ఈ మధ్యనే మరమ్మతులు చేయించి ప్రస్తుతం అందులోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. భవనాన్ని సొంత స్థలంలోకి మార్చాలనే ఉద్దేశంతో ముందుగా పాన్‌గల్‌రోడ్డులోని ఓ స్థలాన్ని ఇవ్వడానికి దాత ముందుకొచ్చినా ఆయన మరో పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ప్రతిపాదన దశలోనే ఆగిపోయింది.

* అనంతరం అదే మార్గంలో కొంత దూరంలో ఓ ప్రైవేటు వెంచర్‌ నిర్వాహకులు స్థలం ఇవ్వడానికి ముందుకొచ్చారు. అక్కడా కుదరలేదు.
* చివరకు గోపాల్‌పేటరోడ్డులో ఓ వెంచర్‌కు సమీపంలో స్థలాన్ని ఎంపికచేసి శంకుస్థాపన కూడా చేశారు. అయితే రోడ్డు సౌకర్యం లేదని, సమీపంలోంచి విద్యుత్తు హై ఓల్టేజీ తీగలు వెళుతున్నాయనే అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వెనక్కితగ్గారు.
* నాలుగోసారి కొత్తకోటరోడ్డులోని ఓ వెంచరు సమీపంలోని గుట్టల మధ్య కార్యాలయ భవన నిర్మాణాన్ని చేపడుతుండడంతో పురపాలక సంఘంలోని అధికార పార్టీ కౌన్సిలర్లే అభ్యంతరాలు లేవనెత్తారు. ఆ ప్రాంతంలో వద్దంటే వద్దంటూ పట్టుబట్టారు. పురపాలక పెద్దలు, భారాస పార్టీ పెద్దలు సముదాయించినా ససేమిరా అనడంతో పాటు పుర ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌పై అవిశ్వాసం ప్రతిపాదించే వరకు వివాదం సాగింది. చివరకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచన మేరకు గురువారం జరిపిన చర్చలు కొలిక్కి వచ్చాయి. ఆ ప్రాంతంలో కాకుండా మెజార్టీ సభ్యులు, పట్టణ ప్రజలు కోరుకునే చోటే భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయానికి వచ్చారు.

అవిశ్వాస అస్త్రంతో..

రిజిస్ట్రేషను శాఖ భవన నిర్మాణాన్ని కొత్తకోటరోడ్డులోని వెంచర్‌ సమీపంలోంచి మార్చాలని, ఇదే విషయమై అసంతృప్తి వ్యక్తంచేస్తూ పుర వైస్‌ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని అధికార పార్టీ కౌన్సిలర్లే ప్రతిపాదించారు. శంకస్థాపన చేసే క్రమంలోనే ఉపాధ్యక్షుడి వార్డులో అభివృద్ధి పనులకు రూ.2 కోట్లు మంజూరవడంతో స్వపక్ష కౌన్సిలర్లు కినుక వహించారు. మధ్యలో ఆగినట్లే ఆగి ఆ తరవాత పనులు ప్రారంభం కావడంతో కౌన్సిలర్లు ఇతర పార్టీల వారితో చేతులు ఈసారి ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌పై అవిశ్వాస అస్త్రం సంధించాలని ప్రతిపాదించారు. పట్టణ పెద్దలు కౌన్సిలర్లను బుజ్జగించినా ససేమిరా అనడంతో మంత్రి దృష్టికి విషయం చేరింది. చివరకు ఆయన సూచనతో అంతా సద్దుమణిగింది. అనువైన స్థలాన్ని సూచించాలని మంత్రి కౌన్సిలర్లను కోరడంతో అవిశ్వాసాన్ని వీడి అంతా ఏకతాటిపైకి వచ్చారు. ప్రస్తుతం ఉన్న ఆర్టీఏ కార్యాలయం, లింగిరెడ్డికుంటలోని పుర కాంప్లెక్సు, నాగవరం వద్ద ప్రభుత్వ స్థలం, పాత కలెక్టరేట్‌ వద్ద పంచాయతీ రాజ్‌ శాఖ కార్యాలయ భవనం ఇలా పలు ప్రాంతాలు తెరపైకి వస్తున్నాయి. శాసనసభ సమావేశాల అనంతరం మంత్రి వనపర్తి వచ్చాక ఎంపిక అంశం కొలిక్కిరానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని