logo

నేర వార్తలు

మోటారుకు అడ్డొచ్చిన చెత్తను తొలగించేందుకు కాల్వలోకి దిగిన ఓ వ్యక్తి బురదలో ఇరుక్కొని ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్‌ ఖాదర్‌ కథనం ప్రకారం..

Published : 05 Feb 2023 05:18 IST

కేఎల్‌ఐ కాల్వలో మునిగి వ్యక్తి మృతి

తిమ్మాజిపేట, న్యూస్‌టుడే : మోటారుకు అడ్డొచ్చిన చెత్తను తొలగించేందుకు కాల్వలోకి దిగిన ఓ వ్యక్తి బురదలో ఇరుక్కొని ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్‌ ఖాదర్‌ కథనం ప్రకారం.. ఆవంచ గ్రామానికి చెందిన కౌలురైతు అమ్మపల్లి నర్సింహ (60) ఈ నెల 3న శుక్రవారం సాయంత్రం పొలంలో పనిచేసేందుకు వెళ్లాడు. రాత్రి పొద్దుపోయినా తిరిగి రాలేదు. కుటుంబికులు వెళ్లి వెదికారు. రాత్రి మోటారున్న కాల్వ వద్దకు వెళ్లి పరిశీలించగా ఒడ్డుపై తుండుగుడ్డ, చెప్పులు, కర్ర ఉండటాన్ని గుర్తించారు. శనివారం ఉదయం కాల్వ పొడుగునా మూడు కిలోమీటర్లమేర గాలించారు. మధ్యాహ్నం మోటారున్న ప్రాంతంలో కొద్దిదూరంలోనే శవమైతేలాడు. మృతదేహాన్ని జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు. నర్సింహకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ తెలిపారు.


విద్యుదాఘాతంతో రైతు మృత్యువాత

లింగాల, న్యూస్‌టుడే : నాగర్‌కర్నూల్‌ జిల్లా అప్పాయిపల్లికి చెందిన పుట్ట నిరంజన్‌(38) శనివారం వేరుశనగ పంటకు స్ప్రింక్లర్ల ద్వార తడి పెట్టడానికి వెళ్లాడు. స్టాటర్‌ ఆన్‌ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు తీగ చేతికి తాకటంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన ఇరుగు పొరుగు రైతులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య మల్లమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి అన్న మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్‌ వివరించారు. అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


అదృశ్యమైన వ్యక్తి మృతి

మక్తల్‌ గ్రామీణం, న్యూస్‌టుడే :  మక్తల్‌ మండలం భగవాన్‌పల్లికి చెందిన పెద్ద బోయ ఆశన్న (59) పదిహేను రోజుల కిందట గ్రామంలో ఉర్సు సందర్భంగా మద్యం తాగి ఇంట్లో గొడవ పడి వెళ్లిపోయి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పరిసర గ్రామాలు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ముష్టిపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారుడు గిరి చేపలు పట్ట్టేందుకు వాగు వద్దకు వెళ్లగా.. మృతదేహం నీటిపై తెలుతూ కనిపించింది. పోలీసులు వచ్చి పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మక్తల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహంబోయ ఆశన్నదిగా గుర్తించారు. ప్రమాదవశాత్తు వాగులో పడి ఉంటాడని, అతను మృతి చెంది కూడా పది రోజులకు పైగా అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. భార్య అమ్మక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పర్వతాలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని