logo

వికటించిన గర్భవిచ్ఛిత్తి

నాలుగు నెలల గర్భాన్ని తొలగించుకోవాలని ప్రయత్నించిన యువతి అనూహ్యంగా మృత్యువాతపడింది. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె మృతిచెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

Published : 05 Feb 2023 05:43 IST

నాలుగు నెలల గర్భిణి మృతి

వనపర్తి, న్యూస్‌టుడే : నాలుగు నెలల గర్భాన్ని తొలగించుకోవాలని ప్రయత్నించిన యువతి అనూహ్యంగా మృత్యువాతపడింది. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె మృతిచెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వీరికి ఐద్వా మహిళలు మద్దతుగా నిలవడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. యువతి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గోపాల్‌పేట మండలం ఏదుల గ్రామానికి చెందిన నాగరాజు, శోభ (23) హైదరాబాద్‌లో ఉపాధి పొందుతున్నారు. వీరికి రెండేళ్లు, 11 నెలల వయసున్న కొడుకులు ఉన్నారు. ఇక పిల్లలు వద్దనుకుని వనపర్తిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిని రెండు నెలల క్రితం ఆశ్రయించారు. అప్పటికే ఇద్దరు కొడుకులు ఉన్నారని, మూడో సంతానం వద్దని ఆసుపత్రిలో చెప్పారు. అప్పట్లో వైద్యులు పరీక్షించి మందులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో మూడు రోజుల కిందట అదే ఆసుపత్రికి వచ్చారు. నాలుగు నెలల గర్భాన్ని తొలగించడానికి మందులు ఉండవని, శస్త్రచికిత్స చేయాల్సిందేనని వైద్యులు చెప్పడంతో దంపతులు అందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం రాత్రి శస్త్రచికిత్స చేయగా అధిక రక్తస్రావంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లి శనివారం తెల్లవారుజామున మృతిచెందింది. సక్రమంగా వైద్యం అందకపోవడంతోనే తన కుమార్తె చనిపోయిందని తల్లిదండ్రులు, బంధువులతో కలిసి ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించారు. వీరికి మద్దతుగా ఐద్వా ప్రతినిధులూ ధర్నాలో పాల్గొన్నారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రిని మూసివేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు రంగ్రప్రవేశం చేసి ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఐద్వా ప్రతినిధులు బాధితులతో కలిసి పట్టణ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న బంధువులు, ఐద్వా నేతలు

గుండెపోటుతోనే మృతి.. : గర్భిణి మృతిపై ఆసుపత్రి నిర్వాహకుడు ప్రవీణ్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా గర్భవిచ్ఛిత్తి కోసం ముందుగానే మాత్రలు వేసుకుని ఆస్పత్రికి  వచ్చారని చెప్పారు. ఆ సమయంలో రక్తస్రావం అవుతుండడంతో ఆసుపత్రి వైద్యుడు పరీక్షించి పరిశీలనలో ఉంచారని వివరించారు. ఈలోగా ఫిట్స్‌ లేదా గుండెపోటుతో ఆమె అకస్మాత్తుగా మృతిచెందినట్లు గుర్తించామన్నారు. ఇందులో ఆస్పత్రి వైద్యుడి నిర్లక్షమేమీ లేదని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని