logo

కక్షిదారులకు నాణ్యమైన సేవలు

న్యాయవాదులు, న్యాయమూర్తులు కక్షిదారులకు నాణ్యమైన సేవలందించి ఆదర్శంగా నిలవాలని హైకోర్టు న్యాయమూర్తి, వనపర్తి జిల్లా న్యాయస్థానం కార్యనిర్వహణ న్యాయమూర్తి జస్టిస్‌ సూరేపల్లి నంద సూచించారు.

Published : 05 Feb 2023 05:43 IST

హైకోర్టు జస్టిస్‌ సూరేపల్లి నంద సూచన

సమావేశంలో మాట్లాడుతున్న జస్టిస్‌ సూరేపల్లి నంద

వనపర్తి పట్టణం, న్యూస్‌టుడే : న్యాయవాదులు, న్యాయమూర్తులు కక్షిదారులకు నాణ్యమైన సేవలందించి ఆదర్శంగా నిలవాలని హైకోర్టు న్యాయమూర్తి, వనపర్తి జిల్లా న్యాయస్థానం కార్యనిర్వహణ న్యాయమూర్తి జస్టిస్‌ సూరేపల్లి నంద సూచించారు. చట్టాలపై ప్రజల్లో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి చైతన్యం పెరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. శనివారం వనపర్తి న్యాయస్థానం ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో న్యాయశాస్త్రం అభ్యసించినవారిలో అత్యధికులు పాలనా వ్యవస్థలో భాగస్వాములయ్యారని గుర్తుచేశారు. స్వాతంత్య్రాన్ని సముపార్జించిన మహాత్మాగాంధీతో పాటు ఉద్యమంలో పాల్గొన్న మదన్‌మోహన్‌, లాలాలజపతిరాయ్‌, సురేంద్రనాథ్‌బెనర్జీ, మోతీలాల్‌నెహ్రూ తదితరులు న్యాయవాదులేనన్నారు. తొలి ప్రధాని నెహ్రూతో పాటు భారత రాజ్యాంగ రచయిత డాక్టర్‌ బీఆర్‌అంబేడ్కర్‌ సైతం న్యాయశాస్త్రం చదివినవారేనన్నారు. లోక్‌ అదాలత్‌ల ద్వారా ప్రజలకు న్యాయ సేవలందుతున్నాయని, మధ్యవర్తిత్వం ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించడం, చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరిచారు.

తీర్పుల్లో జాప్యం..

జస్టిస్‌ డాక్టర్‌ డి.నాగార్జున మాట్లాడుతూ న్యాయస్థానాల్లో కేసులు పెరగడం, న్యాయమూర్తుల నియామకం లేకపోవడం తదితర కారణాలతో తీర్పుల్లో జాప్యం జరుగుతోందన్నారు. అయితే ప్రభుత్వాలు న్యాయవ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నాయని, ఇది శుభపరిణామమన్నారు. న్యాయవాదులు, న్యాయమూర్తులు కేసుల పరిష్కారంలో బాధ్యతాయుతమైన పాత్రపోషించి స్ఫూర్తిగా నిలవాలన్నారు. కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ మాట్లాడుతూ కోర్టుల్లో కక్షిదారులకు అవసరమయ్యే వసతులను ప్రణాళికాబద్ధంగా కల్పించడం, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు జిల్లా కోర్టు వద్ద సీసీ రహదారి, మహిళా న్యాయవాదుల వసతిగది, న్యాయ సేవల సహాయ కేంద్రం ప్రారంభించారు. ఓ దివ్యాంగుడికి మూడుచక్రాల సైకిల్‌ పంపిణీచేశారు. అనంతరం వనపర్తి, గద్వాల న్యాయమూర్తులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి హుజేబ్‌ అహ్మద్‌ఖాన్‌, న్యాయమూర్తులు రజని, రవికుమార్‌, శిరీష, జేసీ వేణుగోపాల్‌, ఆర్డీవో పద్మావతి, న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.భరత్‌కుమార్‌, కె.విజయభాస్కర్‌, పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని