logo

ఆగని ఇసుక అక్రమ రవాణా

అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఒక ట్రాక్టర్‌కు రోజుకు ఒక అనుమతి తీసుకొని 10 ట్రిప్పులు తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.

Published : 05 Feb 2023 05:43 IST

పగలు ట్రాక్టర్లు, రాత్రిళ్లు టిప్పర్లు
అధికారుల అండతో యథేచ్ఛగా తరలింపు

కృష్ణా తీరం నుంచి రామాపురం మీదుగా వస్తున్న ట్రాక్టర్లు

న్యూస్‌టుడే, పెబ్బేరు: అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఒక ట్రాక్టర్‌కు రోజుకు ఒక అనుమతి తీసుకొని 10 ట్రిప్పులు తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. పగలు ట్రాక్టర్లతో కృష్ణానది తీరం నుంచి ప్రకృతి సంపదను తరలించి భారీగా నిల్వలు చేసి రాత్రిళ్లు పొక్లెయిన్‌తో టిప్పర్లకు లోడు చేస్తున్నారు. అనంతరం పట్టణాలు, నగరాలకు తరలిస్తున్నారు. అది కూడా ఊకచెట్టువాగు పేరుతో అనుమతి తీసుకొని కృష్ణానది తీరం నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. ఈ తరహా దందా పెబ్బేరు సమీపంలోని రామాపురం, రంగాపురం గ్రామాల శివారులోని కృష్ణా తీరం నుంచి సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న రవాణాతో ప్రభుత్వ ఖజానాకు గండిపడుతోంది. అధికారులు మామూళ్లకు అలవాటు పడి దందాదారులకు తెరచాటుగా సహకరిస్తుండడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి నష్టం కలుగుతోంది. రాత్రి, పగలు తేడా లేకుండా సాగుతున్న ఈ వ్యవహారంతో రెవెన్యూ, పోలీసు అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రతీ ట్రాక్టర్‌కూ ఓ లెక్కుంది..

రెవెన్యూ కార్యాలయంలో ఇసుక కోసం అనుమతి కోరుతూ ఆఫ్‌లైన్‌లో ఒక ట్రాక్టర్‌కు రోజుకు రూ.2 వేలు రుసుంగా చెల్లించి పత్రం తీసుకుంటున్నారు. ఆ ఒక్క అనుమతి చూపించి రోజుకు ఎన్ని ట్రిప్పులైనా తరలించుకోవచ్చనేలా దందా సాగుతోంది. రామాపురం, రంగాపురం శివార్లలో భారీగా ఇసుక నిల్వలు ఉన్నా దాడులు చేయకపోవడంతో రెవెన్యూ అధికారులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు గ్రామాల ట్రాక్టర్ల యజమానులు నిల్వలు చేస్తుంటే రాత్రిళ్లు జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన వ్యాపారులు పొక్లెయిన్‌ సాయంతో టిప్పర్లకు లోడ్‌చేసి వనపర్తి, గద్వాల, జడ్చర్ల పట్టణాలతో పాటు హైదరాబాద్‌ నగరానికి కూడ తరలిస్తున్నారు. రాత్రిళ్లు నడిచే టిప్పర్లకు ఓ పోలీసు ఉన్నతాధికారి అండ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టిప్పర్ల వ్యవహారంపై ప్రతక్షంగా ఫొటోలు, వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో కొందరు వైరల్‌ చేస్తున్నా పోలీసులు స్పందించడం లేదు. ఈ రెండు గ్రామాలకు సంబంధించి రోజుకు 100 ట్రాక్టర్లు, రాత్రిపూట టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుకను రవాణా చేస్తుంటే పోలీసులు మాత్రం నెలకొక ట్రాక్టర్‌ను పట్టుకొని కేసు నమోదుచేసి మమ అనిపిస్తున్నారు.

రంగాపూర్‌ సమీపంలో ఇసుకను దించుతున్న ట్రాక్టరు


చర్యలు తీసుకుంటాం..
- పద్మావతి, ఆర్డీవో, వనపర్తి

పెబ్బేరులోని కృష్ణానదీ తీరం నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాపై ఇప్పటికే దృష్టి పెట్టాం. అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. రామాపురం, రంగాపురం గ్రామాల శివార్లలో ఇప్పటికే నిల్వలున్న ప్రాంతాలకు వెళ్లాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించాను. వారితో ముందుగా పరిశీలన చేయిస్తాం. ఎక్కడెక్కడ నిల్వలు చేశారో గుర్తించి ఆయా వ్యక్తుల నుంచి వివరణ కోరుతాం. అనుమతి ఎక్కడ ఉంటే అక్కడి నుంచే ఇసుక తరలించేలా చూడాలని అధికారులకు సూచిస్తాం. దందాకు అడ్డుకట్ట వేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని