logo

ఆయుష్మాన్‌ అమలుకు అడుగులు

ఆరోగ్యశ్రీ తరహాలోనే కేంద్ర ప్రభ్వుత్వం కొన్ని నెలల కిందట ఆయుష్మాన్‌ భారత్‌ను తీసుకొచ్చింది. ఇటీవలే ఈ పథకాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 05 Feb 2023 05:43 IST

సీఎస్‌సీ, మీసేవ కేంద్రాల్లో వివరాల నమోదుకు ఆదేశాలు

కోయిలదిన్నెలో వివరాలు నమోదు చేస్తున్న సీఎస్‌సీ ప్రతినిధులు

న్యూస్‌టుడే, గద్వాల న్యూటౌన్‌: ఆరోగ్యశ్రీ తరహాలోనే కేంద్ర ప్రభ్వుత్వం కొన్ని నెలల కిందట ఆయుష్మాన్‌ భారత్‌ను తీసుకొచ్చింది. ఇటీవలే ఈ పథకాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దారిద్య్రరేఖకు దిగువనున్న ప్రజలందరికీ దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించనున్నారు. దీనికి సంబంధించి వివిరాల నమోదును వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో సీఎస్‌సీ (కామన్‌ సర్వీస్‌ సెంటర్‌), కొన్ని ఎంపిక చేసిన మీసేవ కేంద్రాల ద్వారా లబ్ధిదారుల నమోదు చేపట్టాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు జిల్లాలోని కేంద్రాలకు లక్ష్యాలను నిర్దేశించారు. ఇంటింటికీ వెళ్లి నమోదు చేసుకునేలా చర్యలు చేపడుతున్నారు.

మార్చి 31 నాటికి పూర్తి..

రాష్ట్రంలో ఆయుష్మాన్‌ భారత్‌ అమలుతో ఆరోగ్యశ్రీ పీఎంజేఏవై (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన)లో విలీనమైంది. ఆయుష్మాన్‌ పథకం ద్వారా లబ్ధిదారులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రణాళికలు రూపొందించారు. క్షేత్ర స్థాయిలో తెల్లరేషన్‌కార్డు కలిగిన వారి వివరాలను ప్రస్తుతం నమోదు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి జిల్లావ్యాప్తంగా ఉన్న 170 సీఎస్‌సీ, మీసేవ కేంద్రాలకు గ్రామాల వారీగా జాబితా అందించారు. ఇలా మొదటి విడతగా మొత్తం 94,500 మందికి సంబంధించిన వివరాలు వారి వద్ద ఉన్నాయి. వాటి ఆధారంగా సంబంధిత వెబ్‌సైట్లో లబ్ధిదారుల ఈ కేవైసీ చేపడుతున్నారు. ఆధార్‌, రేషన్‌కార్డు, చరవాణి తదితర అంశాలు అందులో పొందుపర్చాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మార్చి 31 నాటికి పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇవి పూర్తయితే మళ్లీ రెండో విడత ఇతరుల వివరాలు వస్తాయి.

* నమోదు పూర్తయితే ఆయుష్మాన్‌ భారత్‌ కార్డు పోస్టు ద్వారా ఇంటికి రానుంది. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.2 లక్షల వరకు వైద్య ఖర్చులు చెల్లించగా.. ఆయుష్మాన్‌ భారత్‌ కింద రూ.5 లక్షల వరకు పొందుతారు. అలాగే ఏ రాష్ట్రంలోనైనా ఇది అమల్లో ఉండడంతో మెరుగైన వైద్యం అందే అవకాశముంది. జిల్లాలో మెరుగైన వైద్య సేవలు లేకపోవడంతో చాలా మంది ప్రజలు పక్కనున్న ఏపీ రాష్ట్రంలోని కర్నూలు, కర్నాటక రాష్ట్రంలోని రాయచూరుకు వెళుతుంటారు. ఇక్కడ ఆరోగ్యశ్రీ సేవలు పనిచేయక ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆయుష్మాన్‌ సేవలు అందుబాటులోకి రావడంతో జిల్లా వాసులకు ప్రయోజనం చేకూరనుంది.

* జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అభా (ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌) కార్డు నమోదు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏఎన్‌ఎమ్‌, ఆశ కార్యకర్తలు నమోదు ప్రారంభించారు. ఇప్పటి వరకు 30 శాతం మేర వివరాలు నమోదు చేశారు. కంటి వెలుగు కార్యక్రమం అమలుతో దీనికి బ్రేక్‌ పడింది. ఆధార్‌ కార్డు ద్వారా నమోదు చేస్తుండటంతో భవిష్యత్తులో వ్యక్తికి సంబంధించి సమస్త ఆరోగ్య వివరాలు ఇందులో ఒక్క క్లిక్‌తో కనిపించనున్నాయి. కంటి వెలుగు ముగిసిన వెంటనే వేగంగా పూర్తి చేయనున్నట్లుగా జిల్లా ప్రోగ్రాం అధికారి డా.మారుతీ నందన్‌ తెలిపారు.


అందరి వివరాలు నమోదు..
- శ్రీకాంత్‌, ఈ-జిల్లా మేనేజర్‌, గద్వాల

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో రేషన్‌కార్డు ఉన్న వారందరి వివరాలు నమోదు చేస్తాం. మొదటి విడతగా వచ్చిన వారి వివారాలు పూర్తి కాగానే.. రెండో విడత వస్తాయి. ఆధార్‌ ఆధారంగా నమోదు ఉంటుంది. వివరాలు అప్‌డేట్‌ లేకుంటే సమస్య వస్తుంది. వాటిని సరిచూసుకోవాలి. అందరి వివరాలు తప్పనిసరిగా నమోదు చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని