logo

పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో పెరిగిన వేగం

జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొలిక్కి వస్తోంది. ఖాళీలు, పదోన్నతుల తాత్కాలిక జాబితాను జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

Published : 05 Feb 2023 05:43 IST

ఆన్‌లైన్‌లో తాత్కాలిక జాబితా పొందుపరుస్తున్న డీఈవో యాదయ్య, ఎస్‌వో అబ్దుల్‌ హక్‌ తదితరులు

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం: జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొలిక్కి వస్తోంది. ఖాళీలు, పదోన్నతుల తాత్కాలిక జాబితాను జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. స్పౌజ్‌ కేటగిరీ కింద 88 మంది, సచివాలయ ఉత్తర్వులతో మరికొందరు జిల్లాకు రావడంతో జాబితా తయారీకి ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి. మరో వైపు సీనియారిటీ విషయంలో అభ్యంతరాలు తలెత్తడంతో వాటిని పరిష్కరించి వెల్లడించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అన్ని విభాగాల సీనియారిటీ జాబితాల రూపకల్పన ముగింపు దశకు చేరుకోవడంతో జీహెచ్‌ఎంల తాత్కాలిక జాబితాను శనివారం రాత్రి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు.

1,766 దరఖాస్తులు : బదిలీలకు జిల్లా నుంచి 1,766 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్పౌజ్‌ కేటగిరీ కింద 88 మంది రావడంతో ఖాళీలు తగ్గాయి. పదోన్నతులకు కోత పడింది. అయిదేళ్లు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు బదిలీకి అర్హులుగా నిలుస్తున్నారు. వీరిలో పదవీ విరమణకు మూడేళ్లలోపు సర్వీసు గల వారు వద్దని అనుకుంటున్నారు. దీర్ఘకాలికంగా పని చేస్తున్న వారికి స్థాన చలనం తప్పదు.

* ప్రభుత్వ, స్థానిక సంస్థల యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో అన్ని విభాగాల్లో మొత్తం 425 ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 770 మంది దీర్ఘకాలికంగా పని చేస్తున్నారు. వీరిలో మూడేళ్ల లోపు సర్వీసు ఉన్న వారు అన్ని కేటగిరీల్లో కలిపి 69 మంది ఉండగా.. 11 మంది జీహెచ్‌ఎంలు బదిలీకి దూరంగా ఉన్నారు.

పదోన్నతులు వరించే అవకాశాలు ఇలా.. : ఎస్జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతికి ఎదురుచూస్తున్న వారికి ఈసారి నిరాశే మిగలనుంది. ఈ పోస్టులు తక్కువ సంఖ్యలో ఉండటమే ఇందుకు కారణం. ఖాళీల్లో 70 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతుల ప్రక్రియ మల్టీజోన్‌ పరిధిలో జరగనుండగా, పండిట్లు, పీఈటీలకు అప్‌గ్రేడేషన్‌ సమస్యలతో ఈసారి పదోన్నతులు లేవు.

ఉర్దూ మాధ్యమంలో..

ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం-1, బయోసైన్స్‌-1, మ్యాథ్స్‌-2, ఫిజిక్స్‌-1, సోషల్‌-2 పదోన్నతులు వరించే అవకాశాలు ఉన్నాయి. పదోన్నతులు, బదిలీల అనంతరం ఏర్పడే ఖాళీల ఆధారంగా మరింత స్పష్టత వస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని