logo

పాలమూరుకు వరాలు గుప్పించేనా..!

శాసనసభలో ఈ నెల 6న ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్‌పై పాలమూరు వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు, విద్య, వైద్యం, వ్యవసాయంతోపాటు ఇతర రంగాలకు నిధులు వచ్చే అవకాశాలున్నాయని స్థానికులు భావిస్తున్నారు.

Published : 05 Feb 2023 05:49 IST

ఇప్పటికీ నెరవేరని గత హామీలు
రేపు రాష్ట్ర బడ్జెట్‌

పాలమూరు విశ్వవిద్యాలయం

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: శాసనసభలో ఈ నెల 6న ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్‌పై పాలమూరు వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు, విద్య, వైద్యం, వ్యవసాయంతోపాటు ఇతర రంగాలకు నిధులు వచ్చే అవకాశాలున్నాయని స్థానికులు భావిస్తున్నారు. 2018 ఎన్నికల సమయంలో పూర్వ మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 13 స్థానాలను తెరాస కైవసం చేసుకుంది. ఎన్నికల సందర్భంగా పలు హామీలను ముఖ్యమంత్రి ఇచ్చారు. అందులో కొన్ని నెరవేరగా మరికొన్ని అలాగే ఉన్నాయి. వాటికి కూడా ఈ బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

గూటికి చేరేదెన్నడో..

పాలమూరు జిల్లాలకు 20,123 రెండు పడక గదుల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో 8వేల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మిగతావి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. నిధుల కొరతతో వీటి నిర్మాణం నత్తనడకన చేపడుతున్నారు. కొన్నిచోట్ల పునాది, పిల్లర్ల దశలోనే ఆగిపోయాయి. ఇవి పూర్తి కావాలంటే ఉమ్మడి జిల్లాకు బడ్జెట్‌లో సుమారు రూ.700 కోట్లు అవసరం. నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో అసలు ఇళ్ల నిర్మాణం పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

‘మన ఊరు-మన బడి’కి..

‘మన ఊరు-మన బడి’కి గత బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు జరిపిన 20శాతం పాఠశాలల్లో కూడా పనులు పూర్తి  కాలేదు. ఉమ్మడి జిల్లాలో మొదటి విడతలో 1,099 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో 200 పాఠశాలల పనులు పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పనులన్నీ పూర్తి కావాలంటే అదనంగా మరో రూ.400కోట్లు అవసరం ఉంటాయి.

అమలుకు నోచుకోని..

నారాయణపేట జిల్లాలోని జయమ్మ, ఊట్కూరు జలాశయాలను ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేరలేదు. వీటి కోసం సుమారు రూ.25 కోట్లు అవసరం. దేవరకద్ర నియోజకవర్గంలో పర్థిపూర్‌ ఎత్తిపోతల పథకం ఏర్పాటు కూడా ప్రతిపాదనల దశలోనే ఉంది. ప్రతి జిల్లా కేంద్రంలో ఇంజినీరింగ్‌ కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు. వనపర్తి మినహా ఎక్కడా మంజూరు కాలేదు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి, కొల్లాపూర్‌లో పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు అమలుకు నోచుకోలేదు. హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై ట్రామాకేర్‌ సెంటర్‌కు ప్రత్యేక నిధులు అవసరం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 4 వేల మంది యువకులు ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటికోసం బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు అవసరం. పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులు, వంతెన పనులకు సుమారు రూ.200 కోట్లు అవసరం.


పీయూకు నిధులొచ్చేనా..

పాలమూరు యూనివర్సిటీకి ఏటా కేటాయిస్తున్న నిధులు అధ్యాపకులు, సిబ్బంది జీతభత్యాలకు కూడా సరిపోవడం లేదు. అరకొర నిధులతో యూనివర్సిటీలో విద్యార్థులకు మౌలిక వసతులతో సహా కొత్త కోర్సులు ప్రవేశ పెట్టలేకపోతున్నారు. 2020-21లో రూ.7.36 కోట్లు, 2021-22లో రూ.7.58 కోట్లు, 2022-23లో రూ.9.85 కోట్లు కేటాయించారు. ఈ సారి రూ.84 కోట్లు కావాలని వర్సిటీ అధికారులు ప్రతిపాదనలు పంపించారు.


సాగునీటి ప్రాజెక్టులపైనే ఆశలు..

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలో ఉన్న ఉదండాపూర్‌ జలాశయం

కేసీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 ఆగస్టులో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. సంవత్సరంలో ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని ప్రకటించారు. తర్వాత పనులు అనుకున్నంత వేగంగా జరగలేదు. 2020-21లో రూ.368 కోట్లు, 2021-22లో రూ.960 కోట్లు, 2022-23లో రూ.1,400 కోట్లను కేటాయించారు. ఈ పనులు పూర్తి కావాలంటే పెద్ద ఎత్తున నిధులు అవసరం. ఈ ప్రాజెక్టుకు 2015లో రూ.35,200 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించగా ప్రస్తుతం ప్రాజెక్టు అంచనా విలువ రూ.52 వేల కోట్లకు చేరింది. ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపు భారీగా అవసరం. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టుల అదనపు ఆయకట్టుకు మరో రూ.2 వేల కోట్లు అవసరం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని