logo

పర్యావరణంపై కాలుష్య పంజా

పాలమూరు జిల్లాల్లో ఇటుక బట్టీల నిర్వహణ పర్యావరణంపై పెను ప్రభావం చూపుతోంది. ఇష్టారాజ్యంగా ఎలాంటి అనుమతులు లేకుండా వీటిని ఏర్పాటు చేస్తుండటంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది.

Published : 06 Feb 2023 06:18 IST

ఇటుక బట్టీలతో వాహనదారుల ఇబ్బందులు
యథేచ్ఛగా కలప, నల్లమట్టి తరలింపు

రహదారి పక్కనే ఇటుక బట్టీ

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: పాలమూరు జిల్లాల్లో ఇటుక బట్టీల నిర్వహణ పర్యావరణంపై పెను ప్రభావం చూపుతోంది. ఇష్టారాజ్యంగా ఎలాంటి అనుమతులు లేకుండా వీటిని ఏర్పాటు చేస్తుండటంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. ఉమ్మడి జిల్లాలో సుమారు వెయ్యి ఇటుక బట్టీలు ఉన్నాయి. కొన్ని అటవీ ప్రాంతాల సమీపంలో, మరికొన్ని ప్రధాన రహదారికి ఆనుకుని ఇటుక బట్టీలను నెలకొల్పుతున్నారు. వీటి నుంచి వచ్చే దుమ్ము, ధూళితో మనిషి ఊపిరితిత్తులపై ప్రభావం పడుతోంది. మరోవైపు అటవీ ప్రాంతాల్లో కలపను యథేచ్ఛగా నరికి తీసుకొచ్చి ఇక్కడ వినియోగిస్తున్నారు. చెరువుల్లోని నల్లమట్టిని కొల్లగొట్టేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. అధికారులు వీటి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాన రహదారులపై.. : నారాయణపేట జిల్లాలో ప్రధాన రహదారి వెంట ఎక్కడ చూసినా ఇటుక బట్టీలే దర్శనమిస్తాయి.  వనపర్తి జిల్లాలోనూ కొత్తకోట-ఆత్మకూరు దారిలో పెద్ద ఎత్తున ఇవి ఉన్నాయి. గద్వాల, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోనూ కొన్ని చోట్ల ప్రధాన రహదారికి ఆనుకుని బట్టీలు పెట్టారు. ట్రాక్టర్లలో ఇటుక త్వరగా తరలించవచ్చన్న ఉద్దేశంతో రోడ్డుకు ఆనుకోని ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ప్రధాన రోడ్ల పక్కనే ఇటుకల తయారీతో వస్తున్న దుమ్ము, ధూళి గాలిలో వ్యాపించి రోడ్లపైనే వెళ్లే వాహనదారులకు అసౌకర్యంగా మారుతోంది. వాహనదారులు ఈ ప్రాంతాల మీదుగా రాకపోలకు సాగించేందుకు నానా  అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారికి 800మీటర్ల దూరంలో బట్టీలను ఏర్పాటు చేయాలి. రెండు ఇటుక బట్టీల మధ్య దూరం కిలో మీటర్‌కుపైగా ఉండాలి. ఇలాంటివేవీ ఉమ్మడి జిల్లాలో చాలా బట్టీల్లో అమలు కావడం లేదు.

కలప అక్రమ రవాణా.. : బట్టీలో ఇటుకలను కాల్చడానికి పెద్ద ఎత్తున కలప అవసరం. బొగ్గు ధరలు ఎక్కువగా ఉండడంతో నిర్వాహకులు కలపపైనే ఆధారపడుతున్నారు. ఇటుక వ్యాపారులు కలపను అక్రమంగా తరలిస్తున్నారు.  అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న బట్టీల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. నిర్వాహకులు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన కూలీల ద్వారా చెట్లను, మొక్కలను నరికిస్తున్నారు. కొందరు సామిల్‌ యజమానులు కూడా ఇటుక బట్టీలకు అక్రమంగా కలపను అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

చెరువుల్లో నల్లమట్టి తరలిస్తూ.. : ఇటుకల తయారీకి చెరువుల్లో ఉండే నల్లమట్టి కీలకం. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించి ఈ మట్టిని తరలించుకోవాలి. ఈ నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. గతంలో మక్తల్‌లో పెద్ద చెరువు నుంచి నల్లమట్టిని తీసి ఇటుకబట్టీల వ్యాపారం ద్వారా భారీగా సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనూ ఓ ప్రజాప్రతినిధి అండతో నల్లమట్టి యథేచ్ఛగా కొల్లగొట్టి ప్రాజెక్టులతోపాటు ఇటుకబట్టీ వ్యాపారులకు అందించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల, దేవరకద్ర, వనపర్తి నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున నల్లమట్టిని తరలిస్తున్నారు. గద్వాల శివారు గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రస్తుతం వేసవి ప్రారంభం అవుతుండడంతో మళ్లీ చెరువుల్లోని నల్లమట్టిపై బట్టీ నిర్వాహకుల కన్ను పడింది. దీనిపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్‌(ఈఈ) సంగీతను ‘ఈనాడు’ వివరణ కోరగా ఇటుక బట్టీల్లో కాలుష్యంపై తమకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. సాధారంగా అక్కడ పీసీబీ అధికారులు తనిఖీలు చేసిన ఘటనలు లేవని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు