logo

గౌతం అదానీపై న్యాయ విచారణ జరిపించాలి

అతి తక్కువ సమయంలోనే ప్రపంచ శ్రీమంతుల్లో మూడోస్థానంలో నిలిచిన గౌతం అదానీ సంస్థల అవకతవకలపై సుప్రీంకోర్టులో న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ (ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడం నర్సయ్య డిమాండ్‌ చేశారు.

Published : 06 Feb 2023 06:23 IST

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడం నర్సయ్య, నాయకులు రంగారావు తదితరులు

పాతబస్టాండ్‌ (నారాయణపేట), న్యూస్‌టుడే : అతి తక్కువ సమయంలోనే ప్రపంచ శ్రీమంతుల్లో మూడోస్థానంలో నిలిచిన గౌతం అదానీ సంస్థల అవకతవకలపై సుప్రీంకోర్టులో న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ (ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడం నర్సయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం పేట జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అదానీ సంస్థ కంపెనీల షేర్ల విలువలను కృత్రిమంగా పెంచుతున్నారని, సంస్థ పద్దుల్లోనూ అవకతవకలు ఉన్నాయంటూ అమెరికా పరిశోధన సంస్థ ఆరోపించిందన్నారు. స్టాక్‌ మార్కెట్ మరింత పతనం కావడానికి ప్రధాని నరేంద్రమోదీ కారణమన్నారు. బ్యాంకర్లను మోసం చేసి దేశం విడిచి పోయినవారందరూ ఆయన శిష్యులేనని ఆరోపించారు. ఎన్నికల సమయంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దేశంలో, రాష్ట్రంలో దళితులు, మైనార్టీలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడుతున వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. జీవో 69 అమలుతోనే పేట జిల్లాకు తాగు, సాగునీరు అందుతుందని చెప్పారు. దీని సాధనకు ఎన్నో  ఉద్యమాలు చేసినా రాష్ట్రం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. పేటలో మైనార్టీలకు అందించిన స్థలంలోనే రెండు పడక గదుల ఇళ్లు నిర్మించాలని లేదా రూ.3 లక్షలు అందించి ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా  వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగ పరిధిలో పనిచేయాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు కృష్ణ, హన్మేెష్‌, రాము, కాశీనాథ్‌, నాయకులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు