సాగుకు కోత.. సంక్షేమానికి చేయూత
సంక్షేమ పథకాలే కొనసాగింపుగా కొనసాగిన 2023-24 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ పాలమూరు ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. దళితబంధు, రెండు పడక గదుల ఇళ్లు, రెండో విడత గొర్రెల పంపిణీ, రైతులకు రుణమాఫీ, ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటు, కొత్తవారికి ఆసరా పింఛన్లు వంటి పథకాలు ప్రజలకు చేరువయ్యేవే.
గత బడ్జెట్‌లో కంటే పాలమూరు ప్రాజెక్టులకు నిధులు తక్కువే
పీయూకు ఈసారి మొండిచేయి
ఈనాడు డిజిటల్, మహబూబ్‌నగర్:
సంక్షేమ పథకాలే కొనసాగింపుగా కొనసాగిన 2023-24 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ పాలమూరు ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. దళితబంధు, రెండు పడక గదుల ఇళ్లు, రెండో విడత గొర్రెల పంపిణీ, రైతులకు రుణమాఫీ, ఆహార శుద్ధి కేంద్రాల ఏర్పాటు, కొత్తవారికి ఆసరా పింఛన్లు వంటి పథకాలు ప్రజలకు చేరువయ్యేవే. మరోవైపు సాగునీటి ప్రాజెక్టులకు అనుకున్న స్థాయిలో నిధులు రాలేదు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు 60 శాతం పూర్తయ్యాయని, పర్యావరణ అనుమతులు పూర్తయితే ఈ ఏడాది పనులు పూర్తి చేస్తామని విత్తమంత్రి హామీ ఇచ్చారు. కానీ ఆ పనులకు అనుగుణంగా నిధుల కేటాయింపుల్లేవు. ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులదీ అదే పరిస్థితి. జలవనరులశాఖ ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులు రాలేదు. మహబూబ్‌నగర్‌లో ఐటీ టవర్‌ను ఈ ఏడాది ప్రారంభిస్తామని ప్రకటించారు. పాలమూరు-యూనివర్సిటీకి ఈ సారి మొండిచెయ్యి ఎదురయ్యింది. రహదారులకు మాత్రం మహర్దశ పట్టనుంది. ఉమ్మడి జిల్లాలకు ఇంజినీరింగ్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల హామీ నెరవేరలేదు.
ఈ ఏడాది ఐటీ టవర్ ప్రారంభం..
ఈ ఏడాది మహబూబ్‌నగర్‌లో ఐటీ టవర్ భవనాన్ని ప్రారంభిస్తామని ఆర్థికమంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. మహబూబ్‌నగర్ శివారులోని దివిటిపల్లిలో 371ఎకరాల్లో ఐటీ అండ్ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేశారు. అందులో ఐదెకరాల్లో ఐటీ టవర్ భవన నిర్మాణాన్ని ఇటీవలే పూర్తి చేశారు. ప్రభుత్వం సేకరించిన మిగతా 370 ఎకరాల్లో మౌలిక వసతులకు ప్రత్యేక నిధులు అవసరం. టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని మౌలిక వసతులతో అభివృద్ధి చేయాల్సి ఉంది. దీని కోసం నిధులు అవసరం. బడ్జెట్‌లో ప్రత్యేక ప్రస్తావన లేదు.
ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ
ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని మంత్రి ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 800 మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నారు. పాలమూరు జిల్లాల్లో 4,429 ఉద్యోగాలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అత్యధికంగా నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి 1,257 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. రాష్ట్రంలోనే తక్కువ ఉద్యోగ ఖాళీలు వనపర్తి జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ మొత్తం 556 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అర్హులందరికీ¨ ఆసరా పింఛన్లు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 4,51,919 మంది ఆసరా పింఛనుదారులున్నారు. వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, బీడీ, చేనేత కార్మికులు, బోదకాలు బాధితులకు నెలకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 అందిస్తున్నారు. ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్లు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. పాలమూరు జిల్లాల్లో 72,136 మంది దరఖాస్తు చేసుకున్నారు. బడ్జెట్‌లో కొత్తగా వారికి ఆసరా పింఛను ఇస్తామని ప్రకటించడంతో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి వీరికి నెల రూ.2,016 చొప్పున పింఛను అందించనున్నారు.
గర్భిణులకు పోషకాహారం...
ప్రభుత్వం గర్భిణులందరికీ న్యూట్రిషన్ ఆహారం అందిస్తామని బడ్జెట్‌లో ప్రకటించింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. బడ్జెట్‌లో అన్ని జిల్లాలు అమలు చేస్తామని ప్రకటించడంతో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లోనూ పోషకాహారం అందించనున్నారు. ఉమ్మడి జిల్లాలో సగటున మొత్తం 54వేల మంది గర్భిణులకు పోషకాహారం అందనుంది. చిన్నారులకు బాలామృతం కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. దీని ద్వారా ఉమ్మడి జిల్లాలో 2.32 లక్షల మంది చిన్నారులకు బాలామృతం అందనుంది.
రెండో విడత గొర్రెల పంపిణీకి
రెండో విడత గొర్రెల పంపిణీని కొనసాగిస్తామని ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 71 వేల మంది లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ మంజూరు కావాలంటే ఉమ్మడి జిల్లాకు సుమారు రూ.934 కోట్ల నిధులు అవసరం.
దళితబంధు లబ్ధిదారులు
ఈ ఏడాది దళితబంధు కోసం నిధుల కేటాయింపులు భారీగా ఉన్నాయి. పూర్వ మహబూబ్‌నగర్‌లోని 13 నియోజకవర్గాల్లో 14,300 మందికి దళితబంధు అందించనున్నారు. ఒక్కో నియోజకవర్గానికి 1,100 మంది చొప్పున దళితబంధు యూనిట్లను పంపిణీ కోసం ఉమ్మడి జిల్లాకు రూ.143 కోట్లు అవసరం.
పీయూకు నిధుల కేటాయింపు
పాలమూరు యూనివర్సిటీకి ఈ ఏడాది కూడా ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.10.91 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయింపులున్నాయి. విద్యార్థుల వసతి గృహాలు, అకాడమిక్ భవన నిర్మాణం, కామన్ రీసెర్చ్ ఫెసిలిటీస్ భవనంతోపాటు క్యాంపస్‌లో పలు అభివృద్ధి పనులకు రూ.84కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. బడ్జెట్‌లో కేటాయించిన నిధులు రూ.10.91కోట్లు యూనివర్సిటీ అధ్యాపకులు, సిబ్బంది జీతభత్యాలకే సరిపోతాయి. అదనంగా ఏమైనా నిధుల కేటాయింపు ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే.
సొంత స్థలం ఉంటే రూ.3 లక్షలు..
ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లను వేగవంతం చేయడానికి ఈ బడ్జెట్‌లో రూ.12వేల కోట్లను కేటాయించింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 21 వేల రెండు పడక గదుల ఇళ్లు మంజూరు కాగా 8వేలు మాత్రమే పూర్తి చేసింది. మిగతావి పూర్తి చేయాలంటే మరో రూ.700కోట్లు అవసరం. బడ్జెట్‌లో సాధారణ కేటాయింపులు ఉండడంతో మిగతా ఇళ్లు పూర్తి కావడానికి నిధుల ఏ మేరకు వస్తాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు సొంత స్థలం ఉన్న వారికి రూ.3లక్షల అందిస్తామని విత్తమంత్రి ప్రకటించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,800 మందికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.3లక్షల సాయం అందే అవకాశాలున్నాయి.
ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ
ఈ బడ్జెట్‌లో రుణమాఫీ కోసం రూ.6,385 కోట్లు కేటాయించారు. ఉమ్మడి జిల్లాలో రుణమాఫీ కోసం మొత్తం 5.49 లక్షల మంది రైతులు ఎదురుచూస్తున్నారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగాలంటే ఉమ్మడి జిల్లాకు రూ.2,734 కోట్లు అవసరం అవుతాయి. ఆ స్థాయిలో నిధుల కేటాయింపు ఉండకపోవడంతో రూ.50 వేలు, రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులకు ఊరట లభించే అవకాశాలున్నాయి.
నిధుల కేటాయింపులు తగ్గాయి..
ప్రాజెక్టులకు గత బడ్జెట్‌లో కంటే ఈసారి నిధులు కేటాయింపులు తగ్గాయి. గతేడాది రూ.1,629.33 కోట్లు కేటాయించగా రూ.1,145.91 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఏడాది రూ.1,584 కోట్లను ప్రాజెక్టులకు కేటాయించారు. ఏడేళ్లుగా పాలమూరు-రంగారెడ్డి పనులు ముందుకు సాగడం లేదు. ఈ పనులు పూర్తి కావాలంటే భారీగా నిధులు అవసరం. బడ్జెట్‌లో కేటాయించిన నిధులు ఏ మాత్రం సరిపోవు. ఉమ్మడి జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం పరిధిలో 6.39లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. అదనపు ఆయకట్టు పెండింగ్ పనులు పూర్తయితే 8.77లక్షల ఎకరాలకు సాగునీటికి ఆస్కారం ఉంది. ఆన్‌గోయింగ్ ప్రాజెక్టు పరిధిలో కాల్వల మరమ్మతులు, భూసేకరణ, పరిహారం వంటి సమస్యలను పరిష్కరించాలి. దీనికోసం రూ.1,800 కోట్లు ప్రతిపాదనలు పంపించారు. దానికి అనుగుణంగా నిధులు రాలేదు. కల్వకుర్తికి ఆశించిన స్థాయిలో నిధుల కేటాయింపులున్నాయి. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా మూడు జలాశయాల నిర్మాణాలకు మరో రూ.350కోట్లు అవసరం. ఈ బడ్జెట్‌లో రూ.10కోట్లు కేటాయించారు.
ఉమ్మడి జిల్లాలో ఇదీ పరిస్థితి..
గత రెండేళ్లుగా కురిసిన వర్షాలకు ఉమ్మడి జిల్లాలో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్లు ధ్వంసమయ్యాయి. సుమారు 600 కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. అక్కడక్కడ తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా మళ్లీ ధ్వంసమవుతున్నాయి. వీటికోసం సుమారు రూ.100కోట్ల నిధులు అవసరం. కల్వర్టులు, వంతెనలు నిర్మించాల్సి ఉంది. నిధులు లేక పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ సారి బడ్జెట్‌లో ఆర్ అండ్ బీ శాఖకు మరమ్మతుల కోసం రూ.2,500 కోట్లు కేటాయించడంతో ఈ రోడ్ల పనులు వేగవంతం కానున్నాయి. పంచాయతీ రాజ్ శాఖకు మరమ్మతుల కోసం రూ.2వేల కోట్లు కేటాయించడంతో గ్రామీణ రహదారులు బాగుపడనున్నాయి. కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పడిన తండాలకు రోడ్లు రానున్నాయి.
ఆహార శుద్ధి కేంద్రాలకు పచ్చజెండా
ఆహారశుద్ధి కేంద్రాల కోసం ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలోని హన్వాడ, నాగర్‌కర్నూల్ జిల్లాలో సర్వారెడ్డిపల్లిలో స్థల సేకరణ చేసి టీఎస్‌ఐఐసీకి అప్పగించారు. వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో గుర్తించిన స్థలాల వివాదంలో ఉండటంతో వీటిపై స్పష్టత రావాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో మామిడి, వేరుశనగ, సీతాఫలం, జొన్నలు, రాగులు, సజ్జలు సంబంధించిన ఆహార శుద్ధి కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే వనపర్తిలో వేరుశనగ, దామరగిద్ద, నవాబుపేటల్లో సీతాఫలంకు సంబంధించిన ఆహారశుద్ధి కేంద్రాలను మహిళా సంఘాలు నిర్వహిస్తున్నాయి. జిల్లాల్లో వరి, కంది, పత్తి సాగు అధికంగా ఉన్న నేపథ్యంలో వీటికి సంబంధించిన పరిశ్రమలు, మిల్లుల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుంది. బడ్జెట్‌లో రూ.4వేల కోట్లు దీనికి కేటాయించడంతో ఉమ్మడి జిల్లాకు ఎంతో లబ్ధి చేకూరనుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Bandi Sanjay: నాకెలాంటి నోటీసూ అందలేదు.. నేను ఇవాళ రాలేను: సిట్‌కు బండి సంజయ్ లేఖ
-
India News
Amritpal Singh: అమృత్‌పాల్ ఉత్తరాఖండ్‌లో ఉన్నాడా..? నేపాల్ సరిహద్దుల్లో పోస్టర్లు..
-
Sports News
Shashi Tharoor: సంజూను జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదు?: శశిథరూర్
-
Movies News
Ajith Kumar: హీరో అజిత్ ఇంట విషాదం
-
Politics News
kotamreddy giridhar reddy: నెల్లూరు టు మంగళగిరి.. కార్లతో గిరిధర్‌రెడ్డి భారీ ర్యాలీ
-
Movies News
Keerthy Suresh: ‘మహానటి’ని అంగీకరించినందుకు ట్రోల్స్ ఎదుర్కొన్నా: కీర్తిసురేశ్