logo

మొండి రోగం.. వైద్యం చేయించుకోలేని దైన్యం

మాయ రోగం ఒళ్లంతా ఆవహించింది. వైద్యానికి చిల్లిగవ్వ లేదు. నా అన్నవారూ లేరు. అర్ధాకలితో దయనీయ జీవనం సాగిస్తున్నారు.

Published : 07 Feb 2023 05:17 IST

చర్మవాధితో బాధపడుతున్న దశరథ్‌

మహబూబ్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే :  మాయ రోగం ఒళ్లంతా ఆవహించింది. వైద్యానికి చిల్లిగవ్వ లేదు. నా అన్నవారూ లేరు. అర్ధాకలితో దయనీయ జీవనం సాగిస్తున్నారు. ధన్వాడ మండలం కొండాపూర్‌కు చెందిన మేదరి దశరథం. ఇతని తల్లిదండ్రులు చనిపోయారు. ఊర్లో సొంతిల్లు లేక మహబూబ్‌నగర్‌కు వచ్చిన ఇతను సొరియాసిస్‌ బారిన పడ్డారు. వైద్యానికి నెలకు రూ.3 వేలు నుంచి రూ.4 వేలు వరకు వెచ్చించాలి. రైల్వే స్టేషను వద్ద నివాసం ఏర్పాటు చేసుకున్న ఇతని పరిస్థితిని ఓఆటో అతను చూసి తన ఆటోలో పడుకోమని చెప్పారు. పగటిపూట ఆటో నడుపుదామంటే తన పరిస్థితి చూసి ఎవరూ ఆటోలో ఎక్కేందుకు ధైర్యం చేయడం లేదని, రాత్రి వేళ రైల్వేస్టేషను నుంచి కిరాయిలు చేస్తూ యాభయో వందో వస్తే దాంతోనే జీవితం వెల్లదీస్తున్నానని దశరథం ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెలా వైద్యానికయ్యే ఖర్చులకు ఆసరా పింఛను ఇప్పించాలని కోరుతున్నారు. తన పరిస్థితిని చూసి సామాజిక కార్యకర్త ఆనంద్‌ తనకు తెలిసిన వారితో మందులకు డబ్బు సాయం చేస్తున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషను వద్ద ఆటోలో కాలం వెల్లదీస్తున్నానని, అద్దెకు ఇల్లు ఇచ్చి ఆసరా పింఛను ఇవ్వాలని కలెక్టర్‌ను వేడుకునేందుకు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు.


భూమి కోసం అంధుడి ఆరాటం

  ఎస్‌.రాములు

తండ్రి పేరిట ఉన్న భూమిని తన పేరిట అమలు చేయాలంటూ పది రోజులుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని నవాబుపేట మండలం చౌడూరుకు చెందిన అంధుడు ఎస్‌.రాములు తన బాధను వెల్లడించారు. తండ్రి చిన్న పెంటయ్య పేరిట సర్వే నంబరు 106లో 2.10 ఎకరాల ఇనాం భూమి ఉందని, దీనిని తన పేరిట ధరణిలో అమలు చేయాలని కోరారు. తహసీల్దారుకు పలు సార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో కుటుంబ సభ్యుల సాయంతో సోమవారం ప్రజావాణికి వచ్చి తన సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.


గోపమణికి.. కొండంత కష్టం

దివ్యాంగురాలైన గోపమణి రాజీవ్‌ గృహకల్ప సముదాయంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. ఈమె తల్లిదండ్రులు లేరు. ఉన్న ఒక్క తమ్ముడూ పట్టించుకోవడంలేదని ఆమె తెలిపారు. ఇంటి అద్దె, ఇతర అవసరాలకు తనకు అందుతున్న పింఛను సరిపోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబజారులో కూరగాయలు విక్రయించి జీవనోపాధి పొందుదామని అనుకుంటే అధికారుల అనుమతి కావాలంటూ అక్కడివారు ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. కలెక్టర్‌తో తన సమస్య చెప్పుకొనేందుకు సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు.


అంగన్‌వాడీ పోస్టు మంజూరు చేయాలని వేడుకోలు

మైబమ్మ, ఆంజనేయులు దివ్యాంగ దంపతులు. వీరిది మహబూబ్‌నగర్‌ మండలం బోయపల్లి. ఇద్దరు ఆడపిల్లలు సంతానం. వికలాంగుల పింఛనే కుటుంబానికి ఆధారం. ఆంజనేయులు మహబూబ్‌నగర్‌ రైతుబజారులో కూరగాయలు అమ్మేవారు. ఆరోగ్యం సహకరించక ఇంటివద్ద ఉంటున్నారు. గ్రామంలోని అంగన్‌వాడీ టీచర్‌ పోస్టును రోస్టర్‌ పాయింట్‌ ప్రకారం అంధ మహిళకు కేటాయించారు. గ్రామంలో అంధ మహిళలు ఎవరూ లేకపోవడంతో మైబమ్మ దరఖాస్తు చేసుకున్నారు. జీవో నెం.99ను పరిగణనలోకి తీసుకుని అంగన్‌వాడీ టీచర్‌ పోస్టును మంజూరు చేయాలని భర్త, పిల్లలతో కలిసి ప్రజావాణికి వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని