logo

అద్దె పరికరాలకు ఆదరణ కరవు

మండల మహిళా సమాఖ్యలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో చేపట్టిన వ్యవసాయ అద్దె పరికరాల పథకానికి ఆదరణ కొరవడింది.

Published : 07 Feb 2023 05:17 IST

న్యూస్‌టుడే, నారాయణపేట న్యూటౌన్‌

ధన్వాడ : షెడ్డులో నిలిపిన ట్రాక్టర్‌

మండల మహిళా సమాఖ్యలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో చేపట్టిన వ్యవసాయ అద్దె పరికరాల పథకానికి ఆదరణ కొరవడింది. మహిళలు వ్యాపార రంగంలో రాణిస్తూ ఆర్థికంగా బలోపేతం కావాలన్న ఉద్దేశంతో గత కలెక్టర్‌ హరిచందన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రూ.25 లక్షలు గ్రాంటు మంజూరు చేయించారు. వాటితో ట్రాక్టర్‌, వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేశారు. ధన్వాడ మహిళా సమాఖ్యకు వాటి నిర్వహణను అప్పగించారు. సరైన దిశా నిర్దేశం లేకపోవడంతో మొదటి నుంచి కూడా అద్దె పరికరాలు ఎవరూ తీసుకోవడం లేదు. దీంతో రెండేళ్లుగా నష్టాలే కనిపిస్తున్నాయి.

రెండేళ్ల కిందట ప్రారంభం..

రెండేళ్ల కిందట ధన్వాడ మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో వ్యవసాయ అద్దె పరికరాల పథకాన్ని ప్రారంభించారు. మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న రైతు కుటుంబాల వారికి బహిరంగ మార్కెట్ కన్నా తక్కువ ధరకు పరికరాలు అద్దెకు ఇస్తూ.. వ్యవసాయ పరంగా తోడ్పాటు అందించాలని, సాధారణ రైతులకు మార్కెట్‌ ధర ప్రకారం ఇవ్వాలన్నది ముఖ్య ఉద్దేశం. డీఆర్‌డీఏ ద్వారా మొత్తం 13 రకాల పరికరాలకు కొనుగోలు చేశారు. వీటిలో ట్రాక్టర్‌, ట్రాలీ, నాగళ్లు, టిల్లర్లు, ధాన్యం అరబోతకు సంబంధించిన ప్లాస్టిక్‌ కవర్లు తదితరాలు ఉన్నాయి. వీరికి సరైన మార్గనిర్దేశం లేకపోవడంతో వ్యాపారం ఏమాత్రం లేక నిర్వహణ ఖర్చు భారంగా మారింది. మొదట్లో వ్యవసాయ పరికరాలను పెట్టుకోవడానికి స్థలం లేక ఇబ్బందులు పడ్డారు ఎవరూ సహకారం అందించక పోవడంతో కొన్ని నెలల పాటు ఐకేపీˆ కార్యాలయంలోనే పరికరాలు ఉంచారు. పక్కనే నిరుపయోగంగా ఉన్న గృహ నిర్మాణ శాఖ మోడల్‌ గదిని కేటాయించాలని అధికారులను కోరినా పట్టించుకోలేదు. ప్రస్తుతం మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఓ రేకుల షెడ్డు వేసుకొని, అందులో ట్రాక్టర్‌ను ఉంచుతున్నారు.

రూ.1.63 లక్షలు బకాయిలు..

వ్యవసాయ పరికరాల నిర్వహణకు మండల మహిళా సమాఖ్య సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండేళ్లలో పరికరాల అద్దె లావాదేవీలు రూ.5,93,980 జరగ్గా.. అందులో రూ.1.63 లక్షలు అద్దె బకాయిలు ఉన్నాయి. ట్రాక్టర్‌ను నిరుపయోగంగా పెట్టడం ఎందుకని గ్రామ పంచాయతీ వారికి అద్దెకు ఇస్తే.. ఇప్పటి వరకు రూ.60 వేలు అద్దె బకాయిలు పేరుకుపోయాయి. ఇక రైతుల నుంచి కూడా పరికరాలు అద్దెకు తీసుకెళ్లినదాంట్లో రూ.1.03 లక్షలు బకాయిలు రావాల్సి ఉంది. నిర్వహణ ఖర్చే రూ.4,07,279 కావడం, ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలో కేవలం రూ.23,701 మాత్రమే ఉండటంతో మహిళా సమాఖ్య సభ్యులు కూడా వ్యవసాయ పరికరాల అద్దెలపై ఆసక్తి చూపడం లేదు. 

పెట్టేల్లోనే భద్రంగా..

మహిళా సమాఖ్య కొనుగోలు చేసిన పలు పరికరాల్లో కొన్ని ఇప్పటి వరకు పెట్టెల్లోనే భద్రంగా ఉన్నాయి. కనీసం చెక్క పెట్టెల్లోంచి కూడా వాటిని తీయలేదు. రూ.6 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన పవర్‌ టిల్లర్లను ఇప్పటి వరకు చెక్క పెట్టెల్లోంచి బయట తీయలేదు. వీటి స్థానంలో వేరే పరికరాలు కొనుగోలు చేస్తామని చెబుతున్నా ఇంతవరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు