logo

గుట్టుగా గర్భవిచ్ఛిత్తి..!

మూడేళ్ల క్రితం పెబ్బేరులో ఓ ఆసుపత్రి వారు ఓ మహిళకు గర్భవిచ్ఛిత్తి శస్త్రచికిత్స చేస్తుండగా.. సమాచారం అందుకున్న వైద్యశాఖ అధికారులు వెళ్లి, ఆ ఆసుపత్రిని సీజ్‌ చేశారు.

Published : 07 Feb 2023 05:17 IST

అనుమతులు లేకున్నా చేస్తున్న కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు
వనపర్తి, వనపర్తి న్యూటౌన్‌ - న్యూస్‌టుడే

ఇటీవల ఓ ప్రైవేటు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న బాధితులు  

మూడేళ్ల క్రితం పెబ్బేరులో ఓ ఆసుపత్రి వారు ఓ మహిళకు గర్భవిచ్ఛిత్తి శస్త్రచికిత్స చేస్తుండగా.. సమాచారం అందుకున్న వైద్యశాఖ అధికారులు వెళ్లి, ఆ ఆసుపత్రిని సీజ్‌ చేశారు.

ఈనెల 4న వనపర్తి జిల్లా కేంద్రంలో గర్భవిచ్ఛిత్తి చేసిన అనంతరం ఓ మహిళ చికిత్స పొందుతూ మృతిచెందింది.

జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రుల పనితీరు, అందిస్తున్న సేవలపై వైద్యాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో గర్భ విచ్ఛిత్తికి అడ్డూ, అదుపూ లేకుండా పోతోందనే ఆరోపణలున్నాయి. వివిధ కారణాలతో మహిళలు గర్భ విచ్ఛిత్తి కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే.. వారు నిరాకరిస్తున్నారు. దీంతో వారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భ విచ్ఛిత్తి చేయరాదని, చేస్తే చట్ట ప్రకారం వైద్యులు శిక్షార్హులవుతారని స్పష్టంగా ఉన్నా.. కొందరు ప్రైవేటు వైద్యులు బాధితుల నుంచి అందినకాడికి రాబట్టుకొని, గుట్టుగా ఈ శస్త్రచికిత్సలు చేస్తున్నారు.  

జిల్లాలో రెండు దవాఖానాలకే అనుమతి

జిల్లాలో 28 ప్రైవేటు ఆసుపత్రులున్నాయి. వీటిలో వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న రెండు ఆసుపత్రులకు మాత్రమే గర్భవిచ్ఛిత్తి శస్త్రచికిత్సలు చేయడానికి అనుమతులున్నాయి. మిగతా వాటికి   లేకున్నా యథేచ్ఛగా నిర్వహిస్తూ బాధితులను దోచుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్సలు వికటించి, మహిళల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోంది. రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ మహిళకు గర్భవిచ్ఛిత్తి శస్త్రచికిత్స చేయగా, అది వికటించి ఆమె మృతిచెందింది. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగినా అధికారులు పట్టించుకోకపోవడంతో ఇలాంటివి  పునరావృతమవుతున్నాయి. రోగి తాలూకు బాధితులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తే కేసు నుంచి తప్పించుకునేందుకు వారికి నష్టపరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు.

* కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు డబ్బుకు కక్కుర్తిపడి ఇలాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గర్భం దాల్చిన వారు గ్రామాల్లో ఆర్‌ఎంపీలు, పీఎంపీలను ఆశ్రయిస్తున్నారు. కొన్ని సందర్భాలలో ప్రాణాల మీదికి తెచ్చుకొంటున్నారు. గర్భంతో ఉన్న మహిళ స్కానింగ్‌లో ఆడపిల్ల అని నిర్ధారించుకున్న తర్వాత.. పిండంలో జన్యుపరంగా లోపాలు ఉండడం, వెన్నుపూస, కపాలం ఏర్పడకపోవడం, గుండెలో రంధ్రాలు ఉండడం, ఇతర జన్యుపరమైన వ్యాధులుంటే గర్భవిచ్ఛిత్తిని గైనకాలజిస్టు, చిన్నపిల్లల వైద్యుడు, రేడియాలజిస్టుల సూచనలతో చేస్తారు.  శస్త్రచికిత్స చేసిన వారిని నిరంతరం వైద్యులు పర్యవేక్షణ చేయాలి. వీటన్నింటిని ఆసుపత్రుల నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. ఒక్కో కేసుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల దాకా వసూలు చేస్తున్నారని తెలుస్తోంది.  వివిధ పరీక్షల అవసరం లేకున్నా మందులు, వైద్యుల ఫీజులు తదితరాల పేరుతో అధిక మొత్తం వసూలు చేస్తున్నారు. అయితే ఎవరికీ  రసీదులివ్వడం లేదు.

నిబంధనలు ప్రచారానికే..

లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమనే విషయం ప్రచారానికే పరిమితమైంది. భ్రూణ హత్యల నియంత్రణలో వైద్యారోగ్యశాఖ అధికారులు ఏమీ పట్టనట్టుగా వ్యహరిస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు ప్రాంతాల్లోని కొన్ని దవాఖానాలు ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.  లింగనిర్ధారణ పరీక్షలు నేరమని తెలిసినా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, స్కానింగ్‌ కేంద్రాల తీరు మారడం లేదు.  


ఫిర్యాదు చేస్తే చర్యలు

గర్భం దాల్చిన వారిలోని పిండాన్ని పరీక్షించి, అవసరమైతేనే.. అదీ అనుమతులున్న ఆసుపత్రిలోనే గర్భవిచ్ఛిత్తి చేయాలి. ఇతర ఆసుపత్రుల్లో చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. మాకు ఫిర్యాదు చేస్తే సదరు ఆసుపత్రులను మూయిస్తాం. ఈనెల 4న జరిగిన సంఘటనపై విచారణ జరుపుతున్నాం.

రవిశంకర్‌, డీఎంహెచ్‌వో, వనపర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని