logo

రుణాలిప్పిస్తామంటూ భారీ మోసం

పెద్దఎత్తున రుణం ఇప్పిస్తామని నమ్మించి, మోసం చేసిన బృందంలోని ఒకరిని వనపర్తి పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండుకు పంపారు.

Published : 07 Feb 2023 05:17 IST

రూ.25 లక్షల మేర రాబట్టుకున్న వైనం
బృందంలోని ఒకరి అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న సీసీఎస్‌ సీఐ శ్రీనివాసాచారి. వెనుక నిందితుడు (ముసుగులో)

వనపర్తి న్యూటౌన్‌, న్యూస్‌టుడే: పెద్దఎత్తున రుణం ఇప్పిస్తామని నమ్మించి, మోసం చేసిన బృందంలోని ఒకరిని వనపర్తి పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండుకు పంపారు. సీసీఎస్‌ సీఐ శ్రీనివాసాచారి సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన  వివరాలు ఇలా ఉన్నాయి.. జిల్లా కేంద్రానికి చెందిన సొహైల్‌కు స్థానికంగా ఓ ట్రాక్టరు షోరూమ్‌ ఉంది. విడి పరికరాల కోసం తరచూ ఆయన బెంగళూరు వెళ్లే క్రమంలో అక్కడ బర్కతుల్లా అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వ్యాపారాన్ని పెంచుకునేందుకు రూ.25 కోట్ల వరకు రుణం ఇప్పిస్తానని బర్కతుల్లా నమ్మబలికాడు. అక్కడే అజిత్‌, పురుషోత్తం, వినోద్‌కుమార్‌, రాజశేఖర్‌, నాగరాజుల అనే వ్యక్తులను సొహైల్‌కు పరిచయం చేశాడు. తమ ‘ఏపీఎం క్యాపిటల్‌ ఇండియా’ అంతర్జాతీయ సంస్థ అని నమ్మబలికి, రూ.25 కోట్ల రుణం కావాలంటే రూ.25 లక్షల వడ్డీని తొలుత చెల్లించాలని చెప్పడంతో బాధితుడు ఆమేరకు డీడీ ద్వారా చెల్లించాడు. ఈ బృంద సభ్యుడైన నాగరాజు.. పొదిలి సుధాకర్‌ అనే వ్యక్తితో వనపర్తికి వచ్చి సొహైల్‌ను కలిశాడు. రుణం ఇచ్చేందుకు ఇతర ఖర్చులకుగాను రూ.5 లక్షలివ్వాలని చెప్పి, ఆమేరకు ఖాళీ చెక్కు, ఇతర ధ్రువపత్రాలు తీసుకుని వెళ్లాడు. రుణం విషయమై ఎంతకూ వారి నుంచి స్పందన లేకపోవడంతో సొహైల్‌ బెంగళూరు వెళ్లి విచారించగా.. ‘ఏపీఎం’ సంస్థను ఎత్తేశారని తెలిసి, తాను మోసపోయినట్టు గుర్తించి, వనపర్తి పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశారు. చెక్కు, ధ్రువపత్రాలు తీసుకెళ్లిన వారిలో ఒకడైన సుధాకర్‌ అలియాస్‌ శివనాయుడు(37) సోమవారం పెబ్బేరు వద్ద జాతీయ రహదారిపై టీ తాగుతుండగా గుర్తించి, వనపర్తి పోలీసులు అరెస్టు చేశారు. నేర చరిత్ర ఉన్న సుధాకర్‌ గతంలో తాను సహాయ దర్శకుడినని చెప్పి సినిమాపరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చేశాడు. చిత్తూరు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాన్ని చేపట్టి నిధులు దొరికేలా బాబాలతో పూజ చేయిస్తానంటూ మోసంచేసిన కేసులో జైలుకూ వెళ్లొచ్చాడు. ఇతనిది ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా.  అతని నుంచి రూ.2,98,000 నగదును స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించినట్టు సీసీఎస్‌ సీఐ శ్రీనివాసాచారి తెలిపారు. ఈ సమావేశంలో కొత్తకోట సీఐ శ్రీనివాసరెడ్డి, పట్టణ ఎస్సై యుగంధర్‌రెడ్డి, సీసీఎస్‌ ఎస్సై హృషికేశ్‌, ఏఎస్‌ఐ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ కేసు ఛేదనలో ఎస్సై యుగంధర్‌రెడ్డి, హృషికేశ్‌, సీసీఎస్‌ హెడ్‌కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌, తిరుపతిరెడ్డి, సమరసింహారెడ్డిలను అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని