logo

వడగళ్లతో అన్నదాతల్లో గుబులు

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వడగళ్ల వానలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండు రోజుల క్రితం అక్కడక్కడ కురిసిన వర్షంతో వరి రైతులకు ఊరట లభించింది.

Published : 19 Mar 2023 04:18 IST

నవాబ్‌పేట : కొల్లూరులో వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న టమాట తోట..

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ వ్యవసాయం: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో వడగళ్ల వానలు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండు రోజుల క్రితం అక్కడక్కడ కురిసిన వర్షంతో వరి రైతులకు ఊరట లభించింది. శనివారం తెల్లవారుజామున కురిసిన వడగళ్లతో మాత్రం మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలంలో అత్యధికంగా వర్షం కురిసింది. గండీడ్‌, హన్వాడ, బాలానగర్‌ మండలాల్లో వడగళ్లు పడటంతో మామిడి కాయలు నేలరాలాయి. ఇటుక బట్టీలు కూడా దెబ్బతిన్నాయి. నారాయణపేట, గద్వాల, బల్మూర్‌, వనపర్తి మండలాల్లోనూ మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. బలమైన ఈదురు గాలులు రావటంతో బాలానగర్‌ మండలంలోని పెద్దరేవల్లి, కేతిరెడ్డిపల్లి, నేరళ్లపల్లి గ్రామాల్లోని మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయని ఉద్యాన అధికారి హిమబిందు తెలిపారు.

బాలానగర్‌ : పెద్దరేవల్లి సమీపంలో రాలిన మామిడి కాయలు

ఎక్వాయపల్లి గ్రామ శివారులో సుమారు 30 ఎకరాల్లో కూరగాయల పంటలకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. వడగళ్లతో నవాబ్‌పేట మండలంలోని కొల్లూరు, కేశరావుపల్లి, పోమాల్‌, కామారం, పల్లెగడ్డ, గురుకుంట, అమ్మాపూర్‌, జంగమయ్యపల్లి గ్రామాల్లో కూరగాయల తోటలు, మామిడితోటలు దెబ్బతిన్నాయి. పంటనష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఏవో కృష్ణకిశోర్‌ తెలిపారు. రాజాపూర్‌ మండలంలో భారీగా వర్షం కురిసింది. అక్కడక్కడ చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది. పెబ్బేరు, తాడూరు, ధన్వాడ తదితర మండలాల్లో ఉల్లికి నష్టం వాటిల్లింది. నారాయణపేటతో పాటు పలు మండలాల్లో ఉల్లిని తెంచటంతో వర్షానికి తడిసింది. రైతులు తడిసిన ఉల్లిని ఆరబెట్టారు. శుక్ర, శనివారాల్లో రైతులు మార్కెట్లకు ఉల్లి, ఇతర పంటలను పెద్దగా తీసుకురాలేదు.

రాజాపూర్‌ : చొక్కంపేట గ్రామంలో పడిన వడగళ్లు

మహబూబ్‌నగర్‌లో అత్యధికం : అత్యధికంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో 8.6 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. గండీడ్‌లో 38.7, బాలానగర్‌ మండలంలో 24.8, హన్వాడ మండలంలో 20.6 మి.మీ, కోస్గిలో 10.0 మి.మీ., మహమ్మదాబాద్‌లో 17.3, నవాబుపేటలో 15.8 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లాలో 1.3 మి.మీ వర్షం కురిసింది. ఇతర జిల్లాలో పెద్దగా వర్షాలు కురవలేదు. రైతులు వర్షాలు తగ్గిన తర్వాతే ఉల్లిని తవ్వాలని మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి.వెంకటేశ్‌ చెబుతున్నారు. ఇప్పటికే తవ్వితే ఇళ్లు, షెడ్లలో కుప్పలాగా పోయకుండా ఆరబెట్టుకోవాలని సూచించారు. పైర్లు దెబ్బతింటే కార్బండిజమ్‌, మంకోజెబ్‌ను లేదా ఎం-45 మందును పొలాలకు పిచికారీ చేయాలన్నారు. ఇలా చేస్తే కొనలు ఎర్రగా మారవని తెలిపారు. పొలాల్లో నీరు నిల్వకుండా చూడాలన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని