logo

చిన్నోనిపల్లి చింత తీరేనా!

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామస్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా దీనిని 2005లో ముంపు గ్రామంగా ప్రకటించారు.

Published : 21 Mar 2023 02:07 IST

అసంపూర్తిగా ఆర్‌అండ్‌ఆర్‌ పునరావాస కేంద్రం పనులు
ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌ - గట్టు, న్యూస్‌టుడే

కేంద్రంలో సగంలో వదిలేసిన పాఠశాల భవనం

జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామస్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా దీనిని 2005లో ముంపు గ్రామంగా ప్రకటించారు. ఇక్కడ మొత్తం 362 కుటుంబాలుండగా 2006లో పరిహారం ప్రకటించారు. అప్పట్లో ఎకరాకు సాగును బట్టి రూ.75-90 వేల వరకు పరిహారం అందించారు. ఇంటి స్థలం విలువకు పరిహారం ఇచ్చారు. గ్రామం చుట్టూ జలాశయం కట్ట నిర్మించారు. వీరికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో భాగంగా 2013లో ఎర్రగుట్ట వద్ద 50 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. పదేళ్లు గడుస్తున్నా ఇప్పటికి ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు. అసలు ఈ స్థలం నివాసానికి అనుకూలంగానే లేదని గ్రామస్థులు చెబుతున్నారు. ముంపు గ్రామానికి చెందిన ప్రజలు కూడా పునరావాసం కోసం ఎదురూ చూసి విసిగిపోయారు. ప్రస్తుతం కొందరు ముంపు గ్రామంగా తమ ప్రాంతాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరికొందరు పరిహారం పెంచి ఇవ్వాలని, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో మౌలిక వసతులు కల్పించాలని, రెండు పడక గదులు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమయంలో కట్టకు సంబంధించిన గండి పూడ్చే పనులు చేపట్టడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

మౌలిక వసతుల కోసం నిధులు.. : ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో భాగంగా పునరావాస కేంద్రంలో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది.  ఈ ప్రాంతంలో ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి రూ.47.70 లక్షలు, మంచినీటి సరఫరా కోసం ట్యాంకులు, పైపులైన్లకు రూ.68.50 లక్షలు, డ్రైనేజీ, రోడ్ల కోసం రూ.3 కోట్లు మంజూరు చేసింది. గ్రామపంచాయతీ భవనానికి రూ.22.50 లక్షలు, బస్‌ షెల్టర్‌కు రూ.4.10 లక్షలు, సామాజిక భవనానికి రూ.14.70 లక్షలు, అంగన్‌వాడీ కేంద్రానికి రూ.10.20 లక్షలు కేటాయించింది. ఈ నిధులన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. కేవలం ప్రభుత్వ పాఠశాల భవనాన్ని పిల్లర్ల దశలోనే నిర్మించి వదిలేశారు. డ్రైనేజీ పనులు చేసినా అవీ ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయి. ప్రస్తుతం ఈ పెండింగ్‌ పనులన్నీ చేపట్టాలంటే మళ్లీ అంచనా వ్యయం పెంచాల్సి ఉంటుంది. పునరావాస కేంద్రం వద్దకు ఉత్తనూరు, లింగపురం, మిట్లదొడ్డి, బోయలగూడెం నుంచి రోడ్డు ఏర్పాటు చేయడానికి రూ.13.90 కోట్లు కేటాయించారు. ఈ రోడ్డు పనులు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. ప్రస్తుతం చిన్నోనిపలికి చెందిన కట్ట గండి పూడుస్తుండడంతో తామంతా ఎక్కడికి వెళ్లలని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో గ్రామస్థులకు కేటాయించిన పునరావాస కేంద్ర స్థలం

అప్పుడే పూర్తి చేసి ఉంటే.. : పునరావాస కేంద్రంలో ఇళ్లను నిర్మించుకోవడానికి ప్రభుత్వం ముంపు బాధితులకు డబ్బు ఇచ్చింది. కానీ అక్కడ ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు. ముంపు గ్రామానికి చెందిన కట్ట పనులు పూర్తి చేయలేదు. ఈ పరిస్థితుల్లో గ్రామస్థులు 17 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నారు. అప్పట్లోనే ప్రభుత్వం ఆర్‌ఆండ్‌ఆర్‌ ప్యాకేజీలో భాగంగా పునరావస కేంద్రం ఏర్పాటు చేసి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి తలెత్తేదికాదు. ఈ జలాశయం పనులను రద్దు చేయాలని 423 రోజులుగా దీక్షలు చేస్తుంటే తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలాశయం పరిధిలోకి చిన్నోనిపల్లి పూర్తిగా ముంపునకు గురికానుంది. చాగదోన, బోయలగూడెం, ఇందువాసి, లింగాపురం గ్రామాల రైతులకు చెందిన వ్యవసాయ భూములు మునిగిపోనున్నాయి.

డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం : ముంపు గామ్రాల రైతులకు అందించాల్సిన పరిహారం పూర్తిగా ఇచ్చాం. ఇంకా ఏమైనా డిమాండ్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి. ఆ డిమాండ్లను ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసకెళ్తాం. రైతులను అరెస్టు చేయలేదు. శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని కేవలం అదుపులోకి మాత్రమే తీసుకున్నాం. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో భాగంగా పునరావాస కేంద్రంలో మౌలిక వసతులు కల్పిస్తాం.

రాములు, ఆర్డీవో, గద్వాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని