logo

అంగన్‌వాడీల్లో ఆధార్‌ నమోదు అంతంతే

అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల కచ్చితమైన లెక్క తేల్చేందుకు, పోషకాహారం పక్కదారి పట్టకుండా, నిధుల ఖర్చులో పారదర్శకతకు ఆధార్‌ నమోదును చేపట్టాలని ప్రభుత్వం భావించింది.

Published : 21 Mar 2023 02:07 IST

పర్యవేక్షకులు లేక జిల్లాలో 15 శాతమే..

గట్టు మండలం పెంచికలపాడులో ఆధార్‌ వివరాలు నమోదు చేస్తున్న సూపర్‌వైజర్‌ నాగరాణి

గద్వాల న్యూటౌన్‌, న్యూస్‌టుడే : అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల కచ్చితమైన లెక్క తేల్చేందుకు, పోషకాహారం పక్కదారి పట్టకుండా, నిధుల ఖర్చులో పారదర్శకతకు ఆధార్‌ నమోదును చేపట్టాలని ప్రభుత్వం భావించింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ తమ పర్యవేక్షకుల ద్వారా ఆధార్‌ నమోదుకు 2020 అక్టోబరులో శ్రీకారం చుట్టింది. మొదట్లో మూడు ప్రాజెక్టుల్లో ముగ్గురు సూపర్‌వైజర్ల ద్వారా నమోదు ప్రారంభించింది. ప్రస్తుతం ఇద్దరు అందుబాటులో లేరు. జిల్లాలో కొన్ని నెలలుగా ఒకరే నమోదు చేపడుతున్నారు. రెండున్నరేళ్లు గడిచినా 15 శాతం కూడా నమోదు పూర్తి కాలేదు.

* సూపర్‌వైజర్లకు ట్యాబ్‌, ఆధార్‌ నమోదు కిట్‌ అందజేశారు. వారు కేంద్రాలకు వెళ్లి ప్రతి రోజూ 20 నుంచి 45 మంది చిన్నారుల వివరాలు నమోదు చేయాలి. ఇప్పటి వరకు కేవలం 5 వేల లోపు చిన్నారుల నమోదు మాత్రమే పూర్తి చేశారు.

* గట్టు మండలంలో సూపర్‌వైజర్‌ నాగరాణి మాత్రమే మొదటి నుంచి నమోదు కొనసాగిస్తున్నారు. మానవపాడు, గద్వాల ప్రాజెక్టుల పరిధిలో ఆధార్‌ నమోదు చేసే సూపర్‌వైజర్లు లేరు. పర్యవేక్షకులు లేక చిన్నారులకు సంబంధించిన పక్కా లెక్కలు తేలడం లేదు.

* కేంద్రాల్లో నమోదైన చిన్నారుల పేర్లు, వారు బడికి వెళ్లినా కొందరు తొలగించడం లేదు. బడికి వెళ్లే సమయంలో ఆధార్‌ తప్పనిసరి కావడంతో తల్లిదండ్రులు సొంతంగా డబ్బు వెచ్చించి మండల కేంద్రాలకు వెళ్లి నమోదు చేయించేందుకు ప్రయాస పడాల్సి వస్తోంది.

జిల్లాలోని మండలాలు 12
పురపాలికల సంఘాలు 4
అంగన్‌వాడీ కేంద్రాలు 713
ఆరేళ్లలోపు చిన్నారులు 40,700
కేంద్రాలకు వచ్చే వారు 20,300
ఇంటి వద్ద ఉండే మూడేళ్లలోపు వారు 20,400


త్వరలోనే నమోదు ప్రక్రియ

అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని చిన్నారులందరికీ వందశాతం ఆధార్‌ నమోదు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. జిల్లాలో ప్రస్తుతం ఒక సూపర్‌వైజర్‌ ద్వారా నమోదు జరుగుతోంది. మానవపాడు, గద్వాల ప్రాజెక్టుల సూపర్‌వైజర్లకు కొన్ని నెలల క్రితమే సంబంధిత పరీక్ష, శిక్షణ పూర్తయ్యింది. వారికి త్వరలోనే ఆధార్‌ కిట్లు వస్తాయి. అవి రాగానే నమోదు చేసేలా చర్యలు తీసుకుంటాం.

ముషాహిదాబేగం, డీడబ్ల్యూవో, గద్వాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని