logo

కూలీల నమోదు ఇక సులభతరం

ఉపాధి హమీ కూలీల హాజరు నమోదుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జనవరి నుంచి ఎన్‌ఎంఎంఎస్‌ (నేషనల్‌ మోబైల్‌ మానిటరింగ్‌ సిస్టం) యాప్‌ను ప్రవేశ పెట్టారు.

Published : 21 Mar 2023 02:07 IST

క్షేత్రసహాయకులకు సీయూజీ సిమ్‌ కార్డులు
న్యూస్‌టుడే, గద్వాల

ధరూరు మండలంలో పనులు చేస్తున్న ఉపాధి కూలీలు

ఉపాధి హమీ కూలీల హాజరు నమోదుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జనవరి నుంచి ఎన్‌ఎంఎంఎస్‌ (నేషనల్‌ మోబైల్‌ మానిటరింగ్‌ సిస్టం) యాప్‌ను ప్రవేశ పెట్టారు. అంతకు ముందు హాజరు చేతితో మస్టర్లలో నమోదు చేసే వారు. ప్రస్తుతం అమల్లో ఉన్న హాజరు విధానం కూలీలను ఇబ్బందులు గురి చేస్తోంది. నిత్యం నెట్‌వర్క్‌ సతాయించటంతో హాజరు నమోదు కావడం లేదు. రోజంతా శ్రమించే శ్రామికులకు డబ్బు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ యాప్‌ వల్ల నష్టపోతున్నామని వారు పలుమార్లు అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. స్పందించిన ప్రభుత్వం హాజరు నమోదు కోసం క్షేత్ర సహాయకులకు కొత్తగా సీయూజీ (కామన్‌ యూజర్‌ గ్రూప్‌) సిమ్‌ కార్డులు అందజేయాలని నిర్ణయించింది. వీటిని త్వరలోనే ఉమ్మడి జిల్లాలోని 1,127 మంది క్షేత్ర సహాయకులకు అందజేయనున్నారు.

అక్రమాలకు అడ్డుకట్ట : యాప్‌ వచ్చిన తర్వాత ఉపాధిలో అక్రమాలకు అడ్డుకట్ట పడింది. పనికి కూలీ వస్తే తప్ప హాజరు నమోదు చేయటం కుదరదు. గతంలో పనులకు రాకున్నా వచ్చినట్లు నమోదు చేసి.. ఉపాధి సిబ్బంది కూలీలతో కుమ్మక్కై సొమ్ము కాజేసిన సందర్భాలున్నాయి. సామాజిక తనిఖీల్లో బట్టబయలైనా వసూలు అంతంత మాత్రమే. కొత్తయాప్‌ విధానంతో అక్రమాలను ప్రాథమిక దశలోనే అడ్డుకట్ట వేసేందుకు సాధ్యమైంది. ఈ విధానంలో ఒక కూలీకి సంబంధించి హాజరు రెండు పూటలు నమోదు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే సొమ్ము వారి చేతికి అందుతుంది.

నెట్‌వర్క్‌ సమస్యతో ఇబ్బంది : కొత్తగా అమలు చేస్తున్న యాప్‌లో నెట్‌వర్క్‌ సమస్యతో కూలీల హాజరు నమోదులో త్రీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని క్షేత్రసహాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం వేసవి కాబట్టి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పనులు చేస్తున్నారు. వర్క్‌ ఐడీ కింద 20 మంది కూలీలకు మించితే బృంద చిత్రం నమోదు చేయాల్సి ఉండేది. ఇందులో కూడా మార్పులు చేశారు. ప్రస్తుతం ఒక వర్క్‌ ఐడీ కింద ఒక కూలీ పని చేసినా ఫొటో తీసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా కూలీ హాజరు ముందే నమోదు చేయాలి. అనంతరం నాలుగు గంటల విరామం తర్వాతే రెండో హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో రోజుకు 20 వేల మంది లోపే ఉపాధి కూలీలు పనులు చేస్తున్నారు. ఏప్రిల్‌లో వీరి సంఖ్య రోజుకు లక్ష వరకు ఉంటుంది. అలాంటి సమయంలో నమోదు ప్రక్రియ మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకు గాను క్షేత్ర సహాయకులకు కామన్‌ యూజర్‌ గ్రూప్‌ సిమ్‌ కార్డులు అందించనున్నారు. దీనిలో నెలకు 30 జీబీ వరకు డాటా అందించనున్నారు.

త్వరలో అందజేయనున్నాం.. : నెట్‌వర్క్‌ సమస్య ఉంది. కూలీల హాజరు నమోదు కాకపోతే వారికి సొమ్ము అందదు. పనులు చేసినా డబ్బు అందకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల నమోదు సవ్యంగా జరగాలంటే సీయూజీ సిమ్‌ కార్డులు ద్వారా సాధ్యమవుతుంది. అందువల్ల ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే క్షేత్ర సహాయకులు వాటిని ఇవ్వనున్నాం.

నాగేంద్రం, జిల్లా ఇన్‌ఛార్జి డీఆర్డీవో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని