logo

చల్లని కబురు

ఆర్టీసీ కార్మికులకు వేసవిలో మజ్జిగ పంపిణీ చేసేందుకు సంస్థ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 13 నుంచి రాష్ట్రంలోని అన్ని డిపోలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Published : 21 Mar 2023 02:07 IST

ఆర్టీసీ ఉద్యోగులకు మజ్జిగ పంపిణీ
బస్టాండ్లలో ప్రయాణికులకు వాటర్‌ కూలర్లు
న్యూస్‌టుడే, నాగర్‌కర్నూల్‌

నాగర్‌కర్నూల్‌ డిపోలో ఏర్పాటు చేసిన మజ్జిగ కేంద్రం

ఆర్టీసీ కార్మికులకు వేసవిలో మజ్జిగ పంపిణీ చేసేందుకు సంస్థ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 13 నుంచి రాష్ట్రంలోని అన్ని డిపోలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని చాలా డిపోల్లో ఈ కేంద్రాలను ప్రారంభించారు. విధుల్లో ఉండే ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగు గంటల మధ్య మజ్జిగను అందిస్తారు. ఎండలకు విధులు నిర్వహించి కార్మికులు ఇబ్బందులు పడుతుంటారు. కొన్నిచోట్ల తాగునీరు లేక ఇబ్బంది పడ్డ పరిస్థితులున్నాయి. ఉమ్మడి జిల్లాలో 10 డిపోల్లో 3,500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. నిత్యం డిపో పరిధిలో మజ్జిగను తయారు చేసి అందుబాటులో ఉంచుతారు.

ప్రయాణికులకు వాటర్‌ కూలింగ్‌ యంత్రాలు : ప్రయాణికులకు తాగునీరు అందించేందుకు వాటర్‌ కూలింగ్‌ యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 10 డిపోలకు రెండు చొప్పున వీటిని అందించనున్నారు. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేస్తారు. ప్రయాణికులకు వేసవిలో చల్లని తాగునీరు అందించేందుకు వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఆర్టీసీలో రాకపోకలు సాగించే ప్రయాణికులు ఏటా బస్టాండ్లలో తాగునీటికి నానా అవస్థలు పడుతుంటారు. స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే చలివేంద్రాలపైనే ప్రయాణికులు ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈసారి ఆర్టీసీ ప్రత్యేకంగా ప్రతి డిపోకి రెండు కూలింగ్‌ యంత్రాలను అందించాలని నిర్ణయించింది. వారం రోజుల్లో వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేయనున్నారు.

* వేసవిలో మధ్యాహ్నం ఉద్యోగులు విధుల్లో ఇబ్బందులు పడుతుంటారు. వారి ఆరోగ్య రక్షణకు మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రయాణికులకు చల్లని తాగునీరు అందించేలా నాగర్‌కర్నూల్‌, బిజినేపల్లి బస్టాండ్లలో కూలింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేస్తాం. ఉద్యోగులకు, ప్రయాణికులకు ఉపయోగపడేలా సంస్థ నిర్ణయాలు తీసుకోవడం శుభపరిణామం.

ధరంసింగ్‌, డీఎం, నాగర్‌కర్నూల్‌ డిపో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని