logo

ప్రశ్నపత్రాల లీకేజీ ప్రభుత్వ వైఫల్యమే : భాజపా

ప్రభుత్వ వైఫల్యం కారణంగానే కీలకమైన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ జరిగిందని భాజపా రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్‌ అన్నారు.

Published : 21 Mar 2023 02:07 IST

తెలంగాణ కూడలిలో నిరసన దీక్ష చేస్తున్న నేతలు శాంతికుమార్‌,
వీరబ్రహ్మాచారి, ఎన్పీ వెంకటేశ్‌, పద్మజారెడ్డి తదితరులు

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : ప్రభుత్వ వైఫల్యం కారణంగానే కీలకమైన టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ జరిగిందని భాజపా రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్‌ అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీపై జిల్లా కేంద్రంలోని తెలంగాణ కూడలిలో ఆదివారం భాజపా నేతలు చేపట్టిన నిరసన దీక్షలో శాంతికుమార్‌ పాల్గొన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం నుంచి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. లక్షలాది మంది నిరుద్యోగ యువత జీవతాలకు సంబంధించిన ఈ వ్యవహారంపై ఐటీ మంత్రి కేటీఆర్‌ నిర్లక్ష్యంగా మాట్లాడటం వారి వైఖరిని తెలియజేస్తోందన్నారు. టీఎస్‌పీఎస్సీ వ్యవస్థ తీరు నాలుగేళ్లుగా అనేక అనుమానాలకు తావిచ్చిందని, ప్రశ్నపత్రాల లీకేజీతో డొల్లతనం బట్టబయలైందన్నారు. గతేడాది అక్టోబర్‌ నుంచే ప్రశ్నపత్రాల లీకేజీ జరుగుతోందన్నారు. ప్రశ్నపత్రాలను లీకు చేసిన వ్యక్తులు తెరాసకు చెందినవారేనని, ఈ కుంభకోణంలో చాలా మంది పెద్దల హస్తం ఉందని, పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మాచారి, నేతలు ఎన్పీ వెంకటేశ్‌, పద్మజారెడ్డి మాట్లాడుతూ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సీబీఐతో లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీతో రాష్ట్రంలోని నిరుద్యోగుల జీవితాలతో సీఎం కేసీఆర్‌ చెలగాటం ఆడుతున్నారని, యువకులంతా కల్వకుంట్ల కుటుంబానికి రాబోవు ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. నిరసన దీక్షలో భాజపా, బీజేవైఎం నేతలు శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణవర్ధన్‌రెడ్డి, కొండా బుచ్చారెడ్డి, కిష్ట్యానాయక్‌, పాండురంగారెడ్డి, తిరుపతిరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, నారాయణయాదవ్‌, ప్రవీణ్‌కుమార్‌, సరోజ, కౌన్సిలర్లు అంజయ్య, చెన్నవీరయ్య, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని