logo

భయాందోళనలో చిన్నోనిపల్లి గ్రామస్థులు

జోగులాంబ గద్వాల జిల్లా నెట్టెంపాడు పోత్తిపోతల పథకం పరిధిలోని గట్టు మండలం చిన్నోనిపల్లి ముంపు గ్రామ ప్రజలు భయాందోళనల మధ్య బతుకీడుస్తున్నారు.

Published : 21 Mar 2023 02:07 IST

చిన్నోనిపల్లి గ్రామంలోకి వెళ్లకుండా పహారా కాస్తున్న పోలీసులు

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌, గట్టు, న్యూస్‌టుడే: జోగులాంబ గద్వాల జిల్లా నెట్టెంపాడు పోత్తిపోతల పథకం పరిధిలోని గట్టు మండలం చిన్నోనిపల్లి ముంపు గ్రామ ప్రజలు భయాందోళనల మధ్య బతుకీడుస్తున్నారు. చిన్నోనిపల్లి జలాశయం రద్దు కోరుతూ 423 రోజుల నుంచి ఆందోళన చేస్తున్న ముంపు బాధితులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రెండు రోజులుగా 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. గ్రామం చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు. ఈ ప్రాంతానికి ఇతరులను ఎవరినీ రానీయడం లేదు. అధికారులు జలాశయం పరిధిలోని కట్ట, గండి పూడ్చే పనులను చేపడుతున్నారు. పనులు పూర్తయితే గ్రామంలోకి నీరొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలాగైనా గ్రామ ప్రజలు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్తారని అధికారులు భావిస్తున్నారు. 2006లోనే చిన్నోనిపల్లిని ముంపు గ్రామంగా ప్రకటించినప్పటికీ జలాశయం పనులను పూర్తి చేయకుండా నిలిపివేశారు. ముంపు గ్రామప్రజలకు అప్పట్లోనే ఎకరాకు రూ.75 వేలు వరకు పరిహారం ఇచ్చారు. వీరికి గట్టు మండలంలోని ఎర్రగుట్ట వద్ద ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో భాగంగా పునరావాసం కల్పించాల్సి ఉంది. ఐదేళ్ల కిందట నిధులు మంజూరైనా ఇప్పటికీ పనులు పూర్తి చేయలేదు. దీంతో చిన్నోనిపల్లి గ్రామస్థులు తామంతా ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో ఇచ్చిన పరిహారం తమకు సరిపోలేదని కొందరు, అసలు జలాశయం పనులను పూర్తిగా ఉపసంహరించుకోని మరికొందరు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీస్తోంది.

అధికారుల పరిశీలన

జలాశయం పనులను సోమవారం ఆర్డీవో రాములు, డీఎస్పీ రంగస్వామి పరిశీలించారు. ఆదివారం గ్రామానికి చెందిన కొందరు మహిళలు అడ్డుకునేందుకు యత్నించగా.. పోలీసులు, అధికారులు వారికి నచ్చజెప్పడంతో వెనుదిరిగారు. సోమవారం పనులు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. వారి వెంట సీఐ చంద్రశేఖర్‌, వివిధ ఠాణాల ఎస్సైలు, ఇటిక్యాల, గట్టు తహసీల్దార్లు సుబ్రహ్మణ్యం, జుబేదార్‌ మహ్మద్‌ తదితరులు ఉన్నారు.

పోలీసుల అదుపులో 17 మంది

జలాశయం రద్దు కోరుతూ నిర్వాసితులు దీక్షలు చేస్తున్న 23 మందిని పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆరుగురిని ఆదివారం రాత్రి విడుదల చేసినట్లు డీఎస్పీ రంగస్వామి తెలిపారు. 60 ఏళ్లకు పైబడిన రైతులను విడుదల చేశామని చెప్పారు. మిగతావారిని త్వరలో విడుదల చేస్తామని, వారిపై ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. మరో 17 మంది పోలీసుల అదుపులో ఉండటంతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని