logo

పేదల బియ్యం పక్కదారి

పేదల ఆకలి తీర్చాల్సిన ప్రజా పంపిణీ బియ్యం జిల్లాలో పక్కదారి పడుతోంది. అక్రమార్కుల జేబులు నింపుతోంది.

Published : 21 Mar 2023 02:11 IST

న్యూస్‌టుడే, కోస్గి, కోస్గి గ్రామీణం

కోస్గిలో పట్టుబడిన రేషన్‌ బియ్యం (పాతచిత్రం)

పేదల ఆకలి తీర్చాల్సిన ప్రజా పంపిణీ బియ్యం జిల్లాలో పక్కదారి పడుతోంది. అక్రమార్కుల జేబులు నింపుతోంది. ప్రభుత్వం రూ.కోట్లు రాయితీ భరిస్తూ చౌక ధరల దుకాణాల ద్వారా వాటిని పేదల కోసం పంపిణీ చేస్తుంటే.. లబ్ధిదారులకు డబ్బు ఆశ చూపుతూ కొందరు తక్కువ ధరకు ఆ బియ్యాన్ని కొనుగోలు చేసి, మిల్లుల్లో మర ఆడించి సన్నబియ్యంగా మార్చి ఇతర ప్రాంతాలకు తరలించి అక్రమార్కులు రూ.కోట్లు గడిస్తున్నారు. మరికొందరు మిల్లర్లే ఆ బియ్యాన్ని వ్యాపారుల ద్వారా కొనుగోలు చేసి, ప్రభుత్వానికి సీఎంఆర్‌గా అందిస్తూ.. మిల్లుకు కేటాయించిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసినా ఈ దందాకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. జిల్లాలో అక్రమార్కులు ఓ ముఠాగా ఏర్పడి ఈ దందాను సాగిస్తున్నారు. మద్దూరు, వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌, పరిగిలకు చెందిన బడా వ్యాపారులు వాటిని కొనుగోలు చేసి, కర్ణాటక, మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నారు. ఏడాది కాలంలోనే బియ్యం అక్రమ తరలింపుపై 60కి పైగా కేసులు నమోదు కాగా, రెండు వేల క్వింటాళ్లకు పైగా బియాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారంటే దందా ఏతీరుగా సాగుతుందో అర్థమవుతోంది. దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా, పీˆడీ యాక్టు వంటి కఠిన చర్యలు లేకపోవడంతో అక్రమార్కులు ఏమాత్రం జంకడం లేదు. ఈ అక్రమ వ్యాపారంలో బడా వ్యాపారుల నుంచి కొందరు అధికారులకు పెద్ద మొత్తంలో మామూళ్లు ముడుతున్నాయన్నది బహిరంగ రహస్యమే.

అక్రమాలు ఇలా..

* ఈ ఏడాది జనవరి మాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేసి కోస్గిలోని ఓ వ్యాపారి నుంచి 64 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేయించారు.  
* ఫిబ్రవరి 13న కోస్గిలోని రెండు దుకాణాల్లో 13 కింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఇటీవల పట్టణంలోని ఇద్దరు వ్యాపారులు, అమ్లికుంట్ల గ్రామంలో మరో వ్యాపారి ఇంట్లో డీఎస్‌వో శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేసి, ఏకంగా 153 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. పుర విలీన గ్రామం సంపల్లి శివారులోని ఓ తోటలో వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌కు చెందిన ఓ బడా వ్యాపారి గోదాంను అద్దెకు తీసుకొని రేషన్‌ బియ్యం తరలిస్తుండగా యువకులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దాడిచేసి, రెండు డీ…సీఎంలలో 124 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్న విషయం విధితమే. బొల్వాన్‌పల్లిలో ఓ రైతు పొలంలో 45 క్వింటాళ్ల నిల్వ చేసిన రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
* ఈ ఏడాది ఫిబ్రవరి 17న మాగనూరు మండలం ఓబుళాపురం గ్రామస్టేజీ వద్ద 480 బస్తాల బియ్యాన్ని అధికారులు పట్టుకొని ఎంఎల్‌ఎస్‌ పాయింటుకు తరలించారు.
* మక్తల్‌ పట్టణంలో కొందరు ఆటోల్లో బియ్యం తరలిస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు.
* నారాయణపేట నుంచి కర్ణాటకకు తరలిస్తున్న 20 కింటాళ్లు, మరో వాహనంలో 14 క్వింటాళ్లు, పట్టణంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వఉంచిన 20 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు.
* ధన్వాడ మండలం కొండాపూర్‌ గ్రామంలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 10 క్వింటాళ్లు, మరికల్‌ మండలం అప్పంపల్లి వద్ద వాహనంలో తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్‌ బియాన్ని పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసారు.
* దామరగిద్ద మండల కేంద్రంలోనూ మూడు కేసులు నమోదు అయ్యాయి.

కార్డు రద్దు చేస్తాం.. : ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ బియ్యాన్ని లబ్ధిదారులే వినియోగించుకోవాలి. ఎవరైనా అక్రమంగా కొనుగోలు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తాం. జిల్లాలో ఇప్పటికే పలు చోట్ల దాడులు చేసి పలువురిపై కేసులు నమోదు చేశాం. వారు మళ్లీ బియ్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే పీడీ యాక్టు కేసులు పెడతాం. రేషన్‌ బియ్యం అమ్మిన వారి వివరాలు తెలిపితే వారి కార్డు రద్దు చేస్తాం.

శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని