logo

క్రికెట్‌ మైదానానికి మెరుగులు

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం(హెచ్‌సీఏ)కు ఉప్పల్‌ స్టేడియం తర్వాత తెలంగాణ జిల్లాల్లో ఉన్న ఏకైక మైదానం మహబూబ్‌నగర్‌ జిల్లా క్రికెట్‌ సంఘం స్టేడియ(ఎండీసీఏ)మే.

Published : 21 Mar 2023 02:11 IST

నిర్మాణం పూర్తయిన వేదిక, టర్ఫ్‌ వికెట్‌ పిచ్‌లు
న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ క్రీడలు

మైదానంలో నిర్మాణం పూర్తయిన వేదిక

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం(హెచ్‌సీఏ)కు ఉప్పల్‌ స్టేడియం తర్వాత తెలంగాణ జిల్లాల్లో ఉన్న ఏకైక మైదానం మహబూబ్‌నగర్‌ జిల్లా క్రికెట్‌ సంఘం స్టేడియ(ఎండీసీఏ)మే. ఆరేళ్ల క్రితం ఈ మైదానం అందుబాటులోకి వచ్చినా మౌలిక సదుపాయాలు లేక క్రీడాకారులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. జిల్లా క్రికెట్‌ సంఘం సభ్యుల కృషితో మైదానం రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటికే టర్ఫ్‌, యాస్ట్రో టర్ఫ్‌ పిచ్‌లు, క్రీడా వేదిక, బౌలింగ్‌ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. గదుల నిర్మాణం పూర్తయితే క్రీడాకారుల ఇబ్బందులు తొలగనున్నాయి.

రంజీ మ్యాచ్‌లకు అనువుగా.. : ఎండీసీఏ మైదానంలో రూ. 12.50 లక్షలతో చేపట్టిన క్రీడాకారులు దుస్తులు మార్చుకునే గది(డ్రెస్సింగ్‌ రూం) పనులు కొనసాగుతున్నాయి. దీనికి ఆనుకునే మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మిస్తున్నారు. రెండు నెలల్లో క్రీడాకారులకు ఈ డ్రెస్సింగ్‌ రూం అందుబాటులోకి రానుంది. గతంలోనూ మట్టి వేయించడంతో మైదానానికి ఓ రూపం వచ్చింది. ఈ మైదానం మధ్యలో త్వరలో క్రీడాకారులు మ్యాచ్‌లు ఆడుకునే వీలుగా టర్ఫ్‌ వికెట్‌ పిచ్‌ ఏర్పాటు చేసేందుకు ఎండీసీఏ ప్రతినిధులు కృషిచేస్తున్నారు. మైదానాన్ని చదును చేసి పచ్చగడ్డి పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే రాష్ట్ర, రంజీ స్థాయి మ్యాచ్‌లు కూడా ఇక్కడ నిర్వహిచేందుకు అవకాశం ఉంటుంది.

దాతల సాయంతో నిర్మాణాలు.. : టోర్నీల సమయంలో షామియానాల ఏర్పాటుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి స్పందించి తన ఎంపీ ల్యాడ్‌ నిధులు రూ. 5 లక్షలు కేటాయించగా మైదానంలో వేదిక నిర్మించారు. దాతల సాయంతో మైదానంలో క్రీడాకారుల సాధనకు రెండు టర్ఫ్‌ వికెట్లు, మరో రెండు యాస్ట్రో టర్ఫ్‌ వికెట్‌ పిచ్‌లను నిర్మించారు. క్రీడాకారులు బౌలింగ్‌ సాధనకు దాతల సాయంతో రూ. 8 లక్షల విలువైన రెండు బౌలింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేశారు. మైదానంలో టర్ఫ్‌, యాస్ట్రో టర్ఫ్‌, బౌలింగ్‌ యంత్రాలు, వేదికలు రూపుదిద్దుకున్నాయి. డ్రెస్సింగ్‌ రూం నిర్మాణం కూడా పూర్తయితే క్రీడాకారులు నిత్యం ఉదయం, సాయంత్రం మైదానానికి వస్తూ సాధన చేసే అవకాశం ఉంటుంది. రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించే సమయంలో ఇతర జిల్లాల క్రీడాకారులు రాత్రి ఇక్కడే వసతి పొందేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.


పచ్చదనం పెంపునకు కృషి : దాతల సాయంతో ఎండీసీఏ మైదానంలో పచ్చిక పెంచటంతో పాటు టర్ఫ్‌ వికెట్‌ పిచ్‌లు తయారుచేస్తున్నాం. మంత్రి కృషితో డ్రెస్సింగ్‌రూం, ఎంపీ సాయంతో వేదిక అందుబాటులోకి వస్తుండటం ఆనందంగా ఉంది. టర్ఫ్‌ పిచ్‌ పూర్తయితే రాష్ట్ర, రంజీ స్థాయి మ్యాచ్‌లను కూడా నిర్వహించుకోవచ్చు.

ఎం.రాజశేఖర్‌, ఎండీసీఏ కార్యదర్శి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని