logo

భగీరథ నీరు వృథా కావల్సిందేనా?

‘మిషన్‌ భగీరథ’ పథకం ద్వారా తాగునీటిని ప్రతి ఇంటికీ సరఫరా చేయాలనే సర్కారు లక్ష్యానికి అనుగుణంగా పట్టణంలోని ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చారు. ఈ పథకం ద్వారా పట్టణంలో 25 కిలోమీటర్ల మేర పైపులైన్‌ పనులు చేపట్టారు.

Published : 24 Mar 2023 05:22 IST

కనెక్షన్లు ఇచ్చి, బిరడాలు మరిచిన వైనం

శిథిలమైన ఇంటికీ కనెక్షన్‌ ఇచ్చిన దృశ్యం.. ఒకటో వార్డులో గొట్టానికి బిరడా బిగించనందున మురుగుకాలువలో కలుస్తున్న తాగునీరు

అమరచింత, న్యూస్‌టుడే  : ‘మిషన్‌ భగీరథ’ పథకం ద్వారా తాగునీటిని ప్రతి ఇంటికీ సరఫరా చేయాలనే సర్కారు లక్ష్యానికి అనుగుణంగా పట్టణంలోని ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చారు. ఈ పథకం ద్వారా పట్టణంలో 25 కిలోమీటర్ల మేర పైపులైన్‌ పనులు చేపట్టారు. వార్డుల్లోని ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలనే నిబంధన ఉండడంతో 2,460 ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వడం పూర్తైంది. ప్రతి ఇంటికీ ప్రతి రోజూ 135 లీటర్ల మేర తాగునీటిని కుళాయిల ద్వారా సరఫరా చేయాల్సి ఉంది. జోగినికాలనీ, గొల్లవీధి, కొత్త ఎస్సీ కాలనీల్లో పైపులైన్‌ కనెక్షన్లు ఇచ్చినా, ‘భగీరథ’ నీటిని సరఫరా చేయడం లేదు. పట్టణంలో గుత్తేదారు కనెక్షన్లు అయితే ఇచ్చేశారు కానీ, వాటికి బిరడాలు, పంపులు బిగించలేదు. ఇక పట్టణంలో దాదాపు 150 ఇళ్ల వరకూ శిథిలమయ్యాయి. కొన్ని పాడుబడ్డాయి. అయితే వీటికీ   కనెక్షన్లు ఇవ్వడం గమనార్హం. బిరడాలు లేనందున నీరు సరఫరా అయినంత సేపూ ఎంతో నీరు వృథా అవుతూనే ఉంది. విలువైన జీవజలం నేల పాలవ్వడమే కాకుండా పంపింగ్‌ చేసేందుకు ఎంతో విద్యుత్తు అవసరమవుతుంది. ఇది కూడా వృథాగానే పరిగణించాల్సి వస్తోంది.

ఒక్కో కనెక్షన్‌ నుంచి రోజూ 135 లీటర్లు..

పట్టణంలో ఆయా వార్డుల్లో ఇచ్చిన ఒక్కో కనెక్షన్‌ ద్వారా రోజూ సుమారు 135 లీటర్ల నీరు వృథా అవుతోందని పరిశీలకులు లెక్క కడుతున్నారు. ఒక్క 7వ వార్డులోనే చూస్తే 94,500 లీటర్ల తాగునీరు నేలపాలవుతోందని వారు పేర్కొంటున్నారు. దాదాపు పట్టణంలోని అన్ని వార్డుల్లోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. వేసవి కాలంలో ప్రతి నీటి చుక్క ఎంతో విలువైందిగా పరిగణించాలని, ఈ గొట్టాలకు బిరడాలు బిగించి, నీటి వృథాకు అడ్డుకట్ట వేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.  


జీవజలం వృథాను అడ్డుకోండి
- కుతుబ్‌, అమరచింత

పట్టణంలో సరఫరా అవుతున్న ఎంతో తాగునీరు వృథా అవుతోంది. ‘మిషన్‌ భగీరథ’ కింద ఏర్పాటుచేసిన కనుక్షన్లకు ఎక్కడా గొట్టాలకు బిరడాలు లేవు. మూడేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ అన్ని వార్డులకు నీటిని సరఫరా చేయడం లేదు. నిర్మించిన ట్యాంకులు దిష్టిబొమ్మలుగా దర్శనమిస్తున్నాయి. తండా వాసులకు పక్షం రోజులకూ నీటిని ఇవ్వడం లేదు. తాగునీరు మురుగు కాలువల పాలవుతోంది. బిరడాలు బిగించి, నీటి వృథాకు అడ్డుకట్ట వేయాలి. జలాన్ని వృథా చేసేవారి కనెక్షన్లు తొలగించాలి.  


బిరడాలు ఏర్పాటు చేస్తాం
- మహమ్మద్‌ ఖాజా, కమిషనర్‌, అమరచింత పురపాలిక

పట్టణంలో ఇచ్చిన నీటి కనెక్షన్‌ గొట్టాలకు వెంటనే పాలిక ఆధ్వర్యంలో బిరడాలు ఏర్పాటు చేస్తాం.   నీటిని వృథాచేసే వారి కనెక్షన్లు తొలగిస్తాం. పాడుబడ్డ ఇళ్ల కనెక్షన్లు కూడా పరిశీలించి, తొలగింపచేస్తాం. ఎక్కడా నీరు వృథా కాకుండా చర్యలు తీసుకుంటాం. అన్ని వార్డులకూ నీరు అందేలా చూస్తాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని