logo

కస్తూర్బాల్లో అటకెక్కిన వైద్య శిబిరాలు

జిల్లాలోని కస్తూర్బాల్లో వైద్య శిబిరాల నిర్వహణ అటకెక్కింది. దీంతో ప్రస్తుతం పలువురు విద్యార్థినులు  అనారోగ్యాల బారిన పడుతూ పరీక్షల సమయంలో ఇబ్బందులకు గురవుతున్నారు.

Published : 24 Mar 2023 05:22 IST

నాచారం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం

న్యూస్‌టుడే, కోస్గి న్యూటౌన్‌, మరికల్‌: జిల్లాలోని కస్తూర్బాల్లో వైద్య శిబిరాల నిర్వహణ అటకెక్కింది. దీంతో ప్రస్తుతం పలువురు విద్యార్థినులు  అనారోగ్యాల బారిన పడుతూ పరీక్షల సమయంలో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల కోస్గి మండలం నాచారం కేజీబీవీలో వారం రోజుల వ్యవధిలో 17 మంది బాలికలు జలుబు, జ్వరంతో బాధపడుతూ ఇంటిబాట పట్టారు. వీరితో పాటు ఇద్దరు బోధనా సిబ్బంది సైతం అనారోగ్యం బారినపడ్డారు. కస్తూర్బా ఆవరణలోని బోరునీరు తాగడంతోనే విద్యార్థినులు అనారోగ్యం బారిన పడినట్లు తెలుస్తోంది. ఇంత మంది అనారోగ్యానికి గురైతే ఏఎన్‌ఎంతోనే వైద్య పరీక్షలు చేయించి చేతులు దులుపుకోవడంతో విద్యార్థినుల  తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సమస్యలతో సతమతం.. : మరికల్‌ కస్తూర్బాలో 180 మంది బాలికలు చదువుకుంటున్నారు. ఇక్కడ విద్యార్థినులు సమస్యలతో సతమతం అవుతున్నారు. సొంత భవనం లేకపోవడంతో ధన్వాడ మండల కేంద్రంలోని కస్తూర్బా భవనంలోనే దీన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థినులకు సరిపడా గదులు లేవు. సామగ్రిని సైతం స్థలం కొరత కారణంగా వరండాలోనే పెట్టుకుంటున్నారు. మరుగుదొడ్లు చాలక ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల వంటగది పక్కన ప్రహరీ లోపల మురుగు నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో దోమలు ప్రబలి విద్యార్థునులు జ్వరాల బారిన పడుతున్నారు.

పరీక్ష ఫలితాలపై ప్రభావం.. : జిల్లాల్లో 11 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. వీటిలో సుమారు 3,250 మంది  విద్యనభ్యసిస్తున్నారు. వారికి తగిన పౌష్టికాహారం అందిస్తే ఆరోగ్యంగా ఉంటారు. అలాంటిది పలు కస్తూర్బాల్లో బాలికలకు సరైన పౌష్టికాహారం కూడా ఇవ్వడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగానే వారిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి.. తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ ప్రభావం పరీక్ష ఫలితాలపై పడే అవకాశం ఉండటంతో విద్యార్థినులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు