logo

పరీక్షకు మళ్లీ సన్నద్ధమెలా?

చాలా ఏళ్ల తర్వాత ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు జారీ చేయటంతో ఉన్నత విద్యావంతులైన యువతీ యువకులు, నిరుద్యోగులు ఎంతో సంతోషించారు.

Published : 27 Mar 2023 04:49 IST

పేపర్‌ లీకేజీతో ఉద్యోగార్థుల్లో ఆందోళన
పేద కుటుంబాలపై ఆర్థిక భారం

మహబూబ్‌నగర్‌ : బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ పొందుతున్న యువత

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌ - న్యూస్‌టుడే, పాలమూరు: చాలా ఏళ్ల తర్వాత ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు జారీ చేయటంతో ఉన్నత విద్యావంతులైన యువతీ యువకులు, నిరుద్యోగులు ఎంతో సంతోషించారు. పల్లెల నుంచి హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాలకు వెళ్లి గదులు అద్దెకు తీసుకుని రాత్రింబవళ్లు చదివారు. కొందరు కోచింగ్‌ తీసుకున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమినరీ, ఏఈ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీతో  పరీక్షలు రద్దు చేసి మళ్లీ రాయాలని ప్రకటించటంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది అక్టోబరులో జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు ఉమ్మడి జిల్లాలో 28,609 మంది దరఖాస్తు చేసుకున్నారు. 23,679 మంది పరీక్ష రాశారు. 25 శాతం మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. మళ్లీ పరీక్ష రాయాల్సి రావటంతో వారంతా సందిగ్ధంలో పడ్డారు.

ఇతర పరీక్షల పరిస్థితేంటి? : మహబూబ్‌నగర్‌లో 40,419, నాగర్‌కర్నూల్‌లో 20,779, జోగులాంబ గద్వాలలో 9,507, నారాయణపేటలో 10,217, వనపర్తిలో 14,865 మంది నిరుద్యోగులు ఉన్నారు. మహబూబ్‌నగర్‌లో 1,213, నాగర్‌కర్నూల్‌లో 1,257, జోగులాంబ గద్వాలలో 662, నారాయణపేటలో 741, వనపర్తిలో 556 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మల్టీ జోనల్‌ వ్యవస్థ పరిధి గ్రూప్‌-1లో 503, గ్రూప్‌-2లో 783, గ్రూప్‌-3లో 1,365, గ్రూప్‌-4లో 8,039 ఉన్నాయి. వారి స్థాయిని బట్టి వివిధ ప్రాంతాల్లో కోచింగ్‌ తీసుకున్నారు. గ్రూపు-1, ఏఈ, ఏఈఈ పరీక్షల తర్వాత ఇతర పోటీ పరీక్షలను ఇంట్లో సన్నద్ధం కావొచ్చని భావించారు. పేపర్‌ లీకేజీతో అంతా మారింది. జూన్‌లోనే గ్రూప్‌-1 ప్రిలిమినరీ, గ్రూప్‌-4 పరీక్ష ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

తిరిగి పూర్వ ఉద్యోగాలకు.. : గ్రూప్‌-1 కోసం ఎస్సైలు, కానిస్టేబుళ్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల్లోని ఉద్యోగులు కూడా పోటీ పడ్డారు. లాస్‌ ఆఫ్‌ పే కింద ఉద్యోగాలకు సెలవులు పెట్టి కోచింగ్‌ తీసుకున్నారు. మెయిన్స్‌కు అర్హత సాధించారు. పేపర్‌ లీకేజీతో వారంతా నిరుత్సాహానికి గురై తిరిగి ఉద్యోగాల్లో చేరుతున్నారు.


యువతి పేరు అనురాధ. కోయిలకొండ మండలం కేశవపూర్‌ స్వగ్రామం. రెండేళ్లుగా మహబూబ్‌నగర్‌లోని అద్దె ఇంట్లో ఉంటూ గ్రూప్‌-1కు సన్నద్ధమై మెయిన్స్‌కు అర్హత సాధించారు. కూలీలైన తల్లిదండ్రులు కష్టపడి కుమార్తె ఖర్చులకు డబ్బులు పంపించారు. మళ్లీ సన్నద్ధం కావటం ఆర్థికంగా భారమని ఆమె ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


యువకుడి పేరు గజలప్ప. మక్తల్‌ మండలం జక్లేర్‌ స్వగ్రామం. మహబూబ్‌నగర్‌ వెంకటేశ్వర కాలనీలో ఏడాదిగా గదిని అద్దెకు తీసుకొని ఏఈ, ఏఈఈ పరీక్షలు రాశారు. పేపరు లీకేజీ జరగటంతో పరీక్షకు మళ్లీ సన్నద్ధమవుతున్నారు. తల్లిదండ్రులు వృద్ధులని, ఖర్చులను ఎలా సమకూర్చుకోవాలో అర్థం కావడం లేదని గజలప్ప ఆందోళన వ్యక్తంచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు