logo

రోప్‌వే నిర్మాణంతో భక్తులకు కొత్త అనుభూతి

మన్యంకొండపై రోప్‌వే నిర్మాణంతో భక్తులకు కొత్త అనుభూతి కలగనుందని రాష్ట్ర పర్యాటక శాఖ ఎండీ మనోహర్‌ పేర్కొన్నారు.

Published : 27 Mar 2023 04:49 IST

రోప్‌వే నిర్మించే ప్రదేశాన్ని పరిశీలిస్తున్న పర్యాటక శాఖ ఎండీ మనోహర్‌,
చిత్రంలో దేవస్థానం ఛైర్మన్‌ మధుసూదన్‌కుమార్‌

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : మన్యంకొండపై రోప్‌వే నిర్మాణంతో భక్తులకు కొత్త అనుభూతి కలగనుందని రాష్ట్ర పర్యాటక శాఖ ఎండీ మనోహర్‌ పేర్కొన్నారు. ఆదివారం ఆయన దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త, ఛైర్మన్‌ అలహరి మధుసూదన్‌ కుమార్‌తో కలిసి రోప్‌వే నిర్మాణం పనులు చేపట్టే ప్రదేశాలను పరిశీలించారు. టెండరు ప్రక్రియ ప్రగతిలో ఉందని, ఇది పూర్తికాగానే రోప్‌వే ఏర్పాటు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. రోప్‌వే నిర్మాణంతో మన్యంకొండ శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు కొత్త అనుభూతి కలుగుతుందన్నారు. అన్నదాన సత్రం సమీపంలో రూ.50 కోట్ల వ్యయంతో మూడంస్తుల భవనం నిర్మించబోయే ఖాళీ స్థలాన్ని కూడా పర్యటక శాఖ ఎండీ మనోహర్‌ పరిశీలించారు. భవనం మొదటి అంతస్తులో భక్తులు తలనీలాల సమర్పణకు అనువుగా నీటి సౌలభ్యంతో కల్యాణకట్ట ఏర్పాటు చేస్తామని, రెండో అంతస్తులో ఒకేసారి వెయ్యి మంది భక్తులకు అన్నదానం చేసేలా సదుపాయాలు కల్పిస్తామని, మూడో అంతస్తులను రోప్‌వేలో కొండపైకి చేరుకునే భక్తుల కోసం నిర్మించి హనుమద్దాల మండపం వద్ద క్యూలైన్‌తో అనుసంధానం చేస్తామని వివరించారు. దేవస్థానం ఛైర్మన్‌ అలహరి మధుసూదన్‌కుమార్‌ మాట్లాడుతూ మన్యంకొండ త్వరలోనే ప్రముఖ దేవస్థానాల జాబితాలో చేరుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని