logo

పత్తి విత్తనం.. ఇక భారం!

సాధారణ పత్తి సాగుకు అవసరమయ్యే సర్టిఫైడ్‌ విత్తనాల ప్యాకెట్‌ ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 27 Mar 2023 04:49 IST

ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు

ధరూరు మండలంలో సాగైన పత్తి పంట (పాతచిత్రం)

గద్వాల, న్యూస్‌టుడే : సాధారణ పత్తి సాగుకు అవసరమయ్యే సర్టిఫైడ్‌ విత్తనాల ప్యాకెట్‌ ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్యాకెట్‌ ధర రూ.853 నిర్ణయించింది. గతేడాదితో పోల్చితే రూ.43 వరకు పెరిగింది. ఉమ్మడి జిల్లాలో రైతులపై రూ.కోట్లలో భారం పడనుంది. గతంతో పోల్చితే ఎరువులు, మందులు, కూలీల ధరలు పెరగటంతో పెట్టుబడి పెరిగిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మూలిగేనక్కపై తాడిపండు పడ్డట్టు విత్తన ధరలు పెరగటం మరింత భారం కానుందని వాపోతున్నారు.

ప్రైవేటుగా కొనుగోలు : సాధారణ పత్తి సాగుకు విత్తనాల సరఫరాను ప్రభుత్వం ఎప్పుడో నిలిపి వేసింది. రైతులంతా ప్రైవేటు డీలర్ల వద్ద కొనుగోలు చేస్తున్నారు. పలు కంపెనీలు వివిధ రకాల విత్తనాలను మార్కెట్లో ప్రవేశ పెట్టటంతో విత్తన ధరలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధించింది. ఏటా విత్తన తయారీ తదితర ఖర్చులను లెక్కించి ప్రభుత్వం కంపెనీలకు విక్రయ ధర నిర్ణయిస్తోంది. ఆ మేరకు విత్తనాలు విక్రయించాల్సి ఉంటుంది. మార్కెట్‌లో బీటీ-1, బీటీ-2 రకాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు బీటీ-2 సాగుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

రూ.8.50 కోట్ల వరకు పెరుగుదల : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 9.18 లక్షల ఎకరాల వరకు సాధారణ పత్తి సాగు అవుతోంది. మొదటి స్థానంలో నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉండగా రెండో స్థానంలో జోగులాంబ గద్వాల జిల్లా ఉంది. ఏటా 19.50 లక్షల (450 గ్రాములవి) ప్యాకెట్లు అవసరం ఉంటుంది. వందల రకాల పత్తి విత్తనాల కంపెనీలు వివిధ పేర్లతో డీలర్లకు అందించటం.. వారు రైతులకు విక్రయిస్తున్నారు. వీటికి తోడు కొందరు డీలర్లు నకిలీ విత్తనాలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి ప్యాకెట్‌పై క్యూఆర్‌ కోడ్‌ నిబంధనను ప్రభుత్వం అమలు చేస్తోంది. అయినా అన్నదాతలు నాసిరకం విత్తనాలతో డీలర్ల చేతిలో మోసపోతూనే ఉన్నారు. ధర పెరగడం వల్ల రైతులపై రూ.8.50 కోట్ల భారం పడనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు