logo

ఒక్క సీటులోనూ భాజపాను గెలవనివ్వం

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఒక్క సీటులోనూ ఆ పార్టీ అభ్యర్థి గెలవకుండా అడ్డుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జాన్‌ వెస్లీ పేర్కొన్నారు.

Published : 27 Mar 2023 04:49 IST

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌ వెస్లీ

సంఘీభావం తెలుపుతున్న సీపీఎం, భారాస నాయకులు

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే : కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఒక్క సీటులోనూ ఆ పార్టీ అభ్యర్థి గెలవకుండా అడ్డుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జాన్‌ వెస్లీ పేర్కొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్ర ఆదివారం రాత్రి మహబూబ్‌నగర్‌కు చేరుకుంది. పట్టణంలోని పురపాలిక టౌన్‌హాల్‌ ఎదుట ఏర్పాటుచేసిన బహిరంగ సభలో జాన్‌ వెస్లీ మాట్లాడారు. భాజపాను ఓడించడానికే భారాసతో కలిసి వెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ దేశ సంపద కార్పొరేట్ల కోసమేనా. పేదల కోసం కాదా? అని ప్రశ్నించారు. భాజపా కార్పొరేట్ల పక్షమో.. ప్రజా పక్షమో తేల్చుకోవాలన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు నవోదయ విద్యా సంస్థను తీసుకురావడంలో భాజపా విఫలమైందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ హోదా కల్పించలేదని విమర్శించారు. తమను గెలిపిస్తే పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను తగ్గిస్తామని 2014లో భాజపా చెప్పిందని, అందరూ నమ్మి గెలిపిస్తే ధరలు రెండింతలు పెంచిందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన భాజపా స్వామినాథన్‌ సిఫారసుల ప్రకారం రైతులకు రుణమాఫీ చేయాలని, మద్దతు ధర కల్పించాలని, పంట కొనుగోలుకు గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బడ్జెట్‌లో విద్య, వైద్యానికి కేంద్రం కేటాయింపులు తగ్గించిందని విమర్శించారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ దేశాన్ని విడదీస్తోందన్నారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు టి.సాగర్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకట్‌రాములు, రమణ, రమ, ధర్మానాయక్‌, పద్మ, సోమన్న, విజయ్‌, జిల్లా కార్యదర్శి రాములు, కిల్లెగోపాల్‌, జిల్లా నాయకులు చంద్రకాంత్‌, కురుమూర్తి, రాజ్‌కుమార్‌, భరత్‌, కడియాల మోహన్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు