logo

ఎరువుల దుకాణాలుగా రైతు వేదికలు

సాగులో రైతులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి, సస్యరక్షణ చర్యలు చేపడితే ఆశించిన దిగుబడి సాకారమవుతుంది.

Published : 27 Mar 2023 04:49 IST

ధరూరులోని రైతు వేదిక భవనం

ధరూరు, న్యూస్‌టుడే : సాగులో రైతులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి, సస్యరక్షణ చర్యలు చేపడితే ఆశించిన దిగుబడి సాకారమవుతుంది. నాణ్యమైన పంటకు మద్దతు ధర లభిస్తుంది. ఆమేరకు వారిని చైతన్యం తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకు గాను రైతు వేదికల నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కార్యక్రమాలన్నీ ఇదే వేదిక ద్వారా నిర్వహిస్తోంది. వీటి ద్వారా వ్యవసాయ సేవలను మరింత విస్తరించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. ఆంధ్రప్రదేశ్‌లో రైతు భరోసా కేంద్రాల ద్వారా అమలవుతున్న మరికొన్ని సేవలు ఇక్కడ అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోంది.

ఎరువుల విక్రయం : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంటలకు అవసరమైన ఎరువులు సగం మేర ప్రాథమిక సహకార సంఘాలు, ఆగ్రోస్‌, డీసీఎంస్‌, హాకా సేవా కేంద్రాలు ద్వారా ప్రభుత్వమే నిర్ణీత ధరలకు సరఫరా చేస్తోంది. రైతు వేదికల్లో సౌకర్యం ఉండటం వల్ల ఎరువుల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏ క్లస్టర్‌ పరిధిలోని రైతులకు అదే క్లస్టర్‌ రైతు వేదిక నుంచి ఎరువులు విక్రయించనున్నారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే విత్తనాలు విక్రయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎరువుల నిల్వ భద్రత వేదికల వద్దకు రవాణా తదితర అంశాలపై డీసీఎంఎస్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఇవన్నీ పూర్తయి ఎరువుల విక్రయాలు జరిగితే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటికే ప్రతి ఐదు వేల ఎకరాలకు ఉన్న ఒక రైతు వేదికలో క్లస్టర్‌ రైతులు, సమన్వయ సమితి సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేసి వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా శిక్షణ, అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

విస్తరణ అధికారులకు బాధ్యతలు : ఎరువుల విక్రయ బాధ్యతలు విస్తరణ అధికారులకు అప్పగించనన్నట్లు తెలిసింది. క్లస్టర్ల వారీగా సాగుకు అవసరమయ్యే ఎరువులు రైతు వారీగా ఇప్పటికే విస్తరణ అధికారులు నివేదికల తయారీలో నిమగ్నమయ్యారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి రైతు వేదికల ద్వారా ఎరువుల విక్రయాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని వారంటున్నారు.


ఆదేశాలు వస్తే అమలు చేస్తాం : రైతు వేదికల్లో ఎరువుల విక్రయం డీసీఎంఎస్‌ల ద్వారా చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు, మార్గదర్శకాలు రాలేదు. వస్తే అమలు చేస్తాం. రైతు వేదికల వద్ద విక్రయాల కోసం అవసరమయ్యే ఏర్పాట్లు చేస్తాం.

గోవిందు నాయక్‌, జిల్లా వ్యవసాయ అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని