logo

పరిశ్రమ ఏర్పాటుపై అభ్యంతరం

అమరరాజా బ్యాటరీల పరిశ్రమ ఏర్పాటుపై మహబూబ్‌నగర్‌ మండలం ఎదిర గ్రామంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.

Published : 27 Mar 2023 04:49 IST

రెండు వర్గాలుగా విడిపోయి ఎదిర గ్రామస్థుల వాగ్వాదం

పాలమూరు పురపాలకం, న్యూస్‌టుడే : అమరరాజా బ్యాటరీల పరిశ్రమ ఏర్పాటుపై మహబూబ్‌నగర్‌ మండలం ఎదిర గ్రామంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఇటీవల తిరుపతికి వెళ్లి అక్కడి అమరరాజా పరిశ్రమను సందర్శించి వచ్చిన భారాస నాయకుల బృందం ఆదివారం వార్డు కార్యాలయం ముందు ఏర్పాటుచేసిన సమావేశం రసాభాసగా మారింది. సమావేశానికి హాజరైన యువజన సంఘాల యువకులు, ఐటీ పార్కు చుట్టూ పొలాలు కలిగిన రైతులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్థులు బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని ముక్తకంఠంతో వ్యతిరేకించారు. తిరుపతి సమీపంలోని అమరరాజా పరిశ్రమ వద్ద పరిస్థితిని భారాస నాయకులు చిన్న హన్మంతు, అల్లి ఎల్లయ్య, పెద్ద కృష్ణ, వెంకటయ్యగౌడ్‌ తదితరుల బృందం గ్రామస్థులకు వివరించే ప్రయత్నం చేసింది. అభ్యంతరం తెలిపిన యువకులు, గ్రామస్థులు ఎట్టి పరిస్థితిలో బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని స్పష్టంచేశారు. గతంలో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరిశ్రమ వల్ల జరిగిన నష్టం చాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ క్రమంలో భారాస నాయకుల బృందానికి, గ్రామ యువకులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లినంత పనిచేశారు. కొంత మంది భారాస నాయకులు మాత్రమే తిరుపతికి వెళ్లి అక్కడి పరిశ్రమను సందర్శించి వచ్చి గ్రామస్థులు, రైతులను సంతృప్తిపరిచే ప్రయత్నం చేయటం సరికాదని, తమను మంత్రి వద్దకు తీసుకెళ్తే పరిశ్రమ విషయంలో తమ అభిప్రాయాలను వెలిబుచ్చే వారిమని గ్రామస్థులు, యువకులు పేర్కొన్నారు. తిరుపతి వద్ద అమరరాజా పరిశ్రమ సందర్శనకు పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ రమ్మని చెప్పినా సమయానికి రాలేకపోయారని, ఇప్పుడు తమను తప్పుపట్టడం ఎంతవరకు సమంజసమని చిన్న హన్మంతు ప్రశ్నించారు. తాము పరిశ్రమ ఎలా ఉందో చూసి అక్కడి పరిస్థితులను తెలిపామే తప్పా ఇక్కడ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేయడం లేదని స్పష్టం చేశారు. చిన్న హన్మంతు వివరణతో ఏకీభవించని గ్రామస్థులు, యువకులు తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, బ్యాటరీ పరిశ్రమను మాత్రమే వద్దంటున్నామని పేర్కొన్నారు. మంత్రిని కలిసి పరిశ్రమ వద్దని ముక్తకంఠంతో చెబుదామని, తిరుపతి వెళ్లిన నాయకుల బృందం కూడా తమతో కలిసి రావాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. రెండు గంటల పాటు గ్రామంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అమరరాజా పరిశ్రమ ఏర్పాటు విషయంలో ప్రజలు రెండుగా చీలిపోయి ఆగ్రహావేశాలకు దిగడంపై విచారం వ్యక్తమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని