logo

గుర్రంగడ్డలో ఇసుక రగడ

గద్వాల మండలం గుర్రంగడ్డలో ఆదివారం ఇసుక తరలింపు ఉద్రిక్తతకు దారి తీసింది.

Published : 27 Mar 2023 04:49 IST

ఇరువర్గాలను చెదరగొడుతున్న పెబ్బేరు పోలీసులు

గద్వాల అర్బన్‌, న్యూస్‌టుడే: గద్వాల మండలం గుర్రంగడ్డలో ఆదివారం ఇసుక తరలింపు ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాలు.. గుర్రంగడ్డ గ్రామంలో రూ.12 లక్షలతో చేపట్టాల్సిన సీసీ రోడ్డు పనులకు గ్రామానికి చెందిన ఇసుక గుత్తేదారులు గ్రామ శివారులోని కృష్ణానది తీరం నుంచి ఇసుక తరలించేందుకు పంచాయతీరాజ్‌ శాఖ డీఈఈ రవీందర్‌ నుంచి అనుమతి తీసుకున్నారు. మార్చి 26, 27వ తేదీలో ఇసుక తరలించేందుకు ఆయన అనుమతి లేఖ ఇచ్చారు. ఆదివారం గుత్తేదారులు రోడ్డు పనులు ప్రారంభించేందుకు కృష్ణానది నుంచి ట్రాక్టర్‌ ద్వారా ఇసుకను తరలిస్తుండగా సమాచారం అందుకున్న సరిహద్దు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రామాపురం గ్రామానికి చెందిన కొందరు ఇసుక గుత్తేదారులు అడ్డుకుని, పెబ్బేరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ ప్రాంతం ( రామాపురం పరిధిలోని నదీతీరం) నుంచి ఎలా తరలిస్తారని గుర్రంగడ్డ గుత్తేదారులతో వాదనకు దిగారు. తరలింపు ప్రాంతం తమదని, అనుమతి మేరకు ఇసుక తీసుకెళ్తున్నామని చెప్పినా వినలేదు. విషయం తెలుసుకున్న గుర్రంగడ్డ గ్రామస్థులు కొందరు అక్కడికి చేరుకుని తమ గ్రామ అభివృద్ధి పనులకు అధికారికంగా ఇసుక తరలిస్తుంటే అడ్డుకోవడం తగదని ఎదురు తిరిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదే సమయంలో అక్కడికి చేరుకున్న పెబ్బేరు పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఎవరి పరిధి అనేది ఇరు జిల్లాల అధికారులు నిర్ధారిస్తారని, సంయమనం పాటించాలని నచ్చజెప్పారు. ఈ విషయాన్ని గద్వాల గ్రామీణ ఎస్సై ఆనంద్‌తో ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా తమ దృష్టికి రాలేదన్నారు. తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు వివరణ కోరగా రెవెన్యూ నక్షా మేరకు వాస్తవ సరిహద్దుపై మరోసారి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.


మంత్రి దృష్టికి పంచాయితీ

పెబ్బేరు, న్యూస్‌టుడే: వనపర్తి- జోగులాంబ గద్వాల జిల్లాల సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న ఇసుక పంచాయితీ ఆదివారం సాయంత్రం మంత్రి నిరంజన్‌రెడ్డి దృష్టికి వెళ్లింది. పెబ్బేరులో జరిగిన ఓ ఫంక్షన్‌కు మంత్రి హాజరయ్యారు. రామాపురం గ్రామ ట్రాక్టర్ల యజమానులు ఇసుక పంచాయితీని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు