logo

ప్రయాణ ప్రాంగణంలోకి రాని బస్సులు

హైదరాబాద్‌ నుంచి వచ్చే కర్నూలు, గద్వాల, వనపర్తితో పాటు రాయలసీమ ప్రాంత చాలా డిపోల బస్సులు జాతీయ రహదారి-44పై ఉన్న అడ్డాకులలోని ప్రయాణ ప్రాంగణంలోకి రావటం లేదు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు

Published : 30 Mar 2023 05:58 IST

జాతీయ రహదారిపై ప్రయాణికులకు తరచూ ప్రమాదాలు
న్యూస్‌టుడే, దేవరకద్ర గ్రామీణం, అడ్డాకుల

ప్రయాణికులను జాతీయ రహదారిపై దింపేసి వెళ్తున్న బస్సు.. ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్న ఓ కుటుంబం

హైదరాబాద్‌ నుంచి వచ్చే కర్నూలు, గద్వాల, వనపర్తితో పాటు రాయలసీమ ప్రాంత చాలా డిపోల బస్సులు జాతీయ రహదారి-44పై ఉన్న అడ్డాకులలోని ప్రయాణ ప్రాంగణంలోకి రావటం లేదు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడ్డాకుల మండలంలోని పలు గ్రామాలతో పాటు పెద్దమందడి మండల ప్రజలు ఇటు హైదరాబాద్‌, అటు కర్నూలు వైపు రాకపోకలు సాగించేందుకు అడ్డాకులకు వచ్చి బస్సులు ఎక్కుతారు. హైదరాబాద్‌, కర్నూలు వెళ్లే బస్సులు అడ్డాకుల బస్టాండులోకి రాకుండా జాతీయ రహదారి పైవంతెనపై నుంచి వెళ్తున్నాయి. దీంతో ప్రయాణికులు పైవంతెనకు చివరకు వెళ్లి జాతీయ రహదారిపై వేచి ఉండి బస్సులు ఎక్కాల్సి వస్తుంది. హైదరాబాద్‌, కర్నూలుతో పాటు దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను జాతీయ రహదారిపైనే దింపేసి వెళ్తున్నారు. ప్రయాణికులు ప్రమాదకరంగా జాతీయ రహదారి దాటి అడ్డాకులలోకి వెళ్తున్నారు. జాతీయ రహదారిపై వేగంగా వెళ్లే వాహనాలతో ప్రమాదాల బారినపడుతున్నారు. పండగల సమయంలో పరిసర ప్రాంతాల ప్రజలు స్వగ్రామాలకు వచ్చి వెళ్తుంటారు. ఈక్రమంలో తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. గతంలో సర్వీస్‌రోడ్డు అసంపూర్తిగా ఉన్నపుడు బస్సులు రాలేదు. ఇప్పుడు పైవంతెనకు ఇరువైపులా సర్వీస్‌ రోడ్డు నిర్మించినా బస్సులు ప్రయాణ ప్రాంగణంలోకి రావడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి దూర ప్రాంతాల బస్సులు కనీసం ఉదయం, సాయంత్రం అడ్డాకులలోకి వచ్చి వెళ్లేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని