logo

ప్రయాణం మరింత భారం

జాతీయ రహదారులపై టోల్‌గేట్ల ఛార్జీల పెంపు పాలమూరు జిల్లాల్లో సుమారు 57వేల మంది వాహనదారులపై ప్రభావం చూపనుంది.

Published : 31 Mar 2023 05:42 IST

 టోల్‌ఛార్జీల పెంపుతో నెలకు రూ.1.20కోట్ల అదనపు వడ్డన
ఉమ్మడి జిల్లాలో నాలుగు టోల్‌గేట్లు
57వేల వాహనదారులపై ప్రభావం

జాతీయ రహదారి-44పై ఉన్న పుల్లూరు టోల్‌గేటు

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: జాతీయ రహదారులపై టోల్‌గేట్ల ఛార్జీల పెంపు పాలమూరు జిల్లాల్లో సుమారు 57వేల మంది వాహనదారులపై ప్రభావం చూపనుంది. ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారి-44పై రాయికల్‌, శాఖాపూర్‌, పుల్లూరు పరిధిలో మూడు టోల్‌గేట్లు ఉన్నాయి. ఈ జాతీయ రహదారి హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, చెన్నై, తిరుపతితోపాటు ఏపీలో పలు ప్రాంతాలకు నిత్యం వేల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయి. కార్లు, బస్సులు, భారీ, అతి భారీ వాహనాలు అధికంగా తిరుగుతుంటాయి. జాతీయ రహదారి-167పై మిడ్జిల్‌ మండలం మున్ననూరు వద్ద టోల్‌గేటు ఉంది. ఇక్కడి నుంచి నిత్యం సుమారు వెయ్యికిపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఉమ్మడి జిల్లాలోని ఈ నాలుగు టోల్‌గేట్ల వద్ద నుంచి ప్రతి రోజు దాదాపుగా మొత్తం 57,300 వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా సుమారు రూ.80 లక్షల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. ఏప్రిల్‌ నుంచి ప్రభుత్వం 5శాతం టోల్‌ఛార్జీలు పెంచనుండటంతో వాహనదారులపై రోజుకు అదనంగా రూ.4 లక్షలు భారం పడనుంది. నెలకు రూ.1.20 కోట్లు ప్రస్తుత ఛార్జీల కంటే అదనంగా రానున్నాయి.

ఉమ్మడి జిల్లాలో 5.32 లక్షల వాహనాలు..

పాలమూరు జిల్లాలో గత పదేళ్లుగా 5.32 లక్షల వాహనాలు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. అందులో సుమారు 2 లక్షల వాహనాలు రోజూ  టోల్‌గేట్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు రోజు కార్లు, ఇతర వాహనాల్లో వెళ్లి వచ్చేవారు ఎక్కువగా ఉంటారు. ఉమ్మడి జిల్లాలో 96శాతం వాహనాలకు ఫాస్టాగ్‌ పూర్తయింది. కేంద్రం 2019 డిసెంబరు 1 నుంచి ఫాస్టాగ్‌ సేవలను తీసుకొచ్చింది. ప్రారంభంలో పాలమూరు జిల్లాలో స్పందన తక్కువగానే ఉంది. ప్రారంభంలో కేవలం 20 శాతం మంది వాహనదారులే ఫాస్టాగ్‌ను తీసుకున్నారు. ప్రధానంగా జాతీయ రహదారిపైనే మూడు టోల్‌ప్లాజాలు ఉండడం, ఫాస్టాగ్‌ తీసుకున్న వారు నేరుగా వెళ్లిపోతుండటం, నగదు చెల్లించాల్సిన వాహనదారులు గంటల కొద్ది క్యూలైన్లో ఉండటంతో పలువురు ఫాస్టాగ్‌ వైపు మళ్లారు.  2021 జనవరి 1 నుంచి ఫాస్టాగ్‌ను తప్పని సరి చేస్తూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 5.10లక్షల వాహనదారులు ఫ్టాస్టాక్‌ తీసుకున్నారు. వీరంతా తరచూ టోల్‌గేట్‌ కేంద్రాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు.

మార్గదర్శకాల ప్రకారమే..

ఉమ్మడి జిల్లాలో మూడు టోల్‌గేట్లు ఉండగా మిడ్జిల్‌ మండలం మున్ననూరు వద్ద గతేడాది ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి-44పై ఉన్న టోల్‌గేట్లు మాత్రం పదేళ్లకుపైగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం పెంచే పెంపు కొత్తగా ఏర్పాటు చేసిన మున్ననూరు టోల్‌గేట్‌కు మాత్రమే వర్తిస్తుందా? లేక నాలుగు టోల్‌గేట్లకు వర్తిస్తుందా అనేదానిపై ఎలాంటి మార్గదర్శకాలు రాలేదు. సాధారణంగా టోల్‌గేట్ల నిర్వాహకులు ఏటా సెప్టెంబరులో టోల్‌ ఛార్జీలు పెంచుతామని, మళ్లీ సెప్టెంబరులోనే పెంచాల్సి ఉంటుందని, ప్రభుత్వం తీసుకొచ్చిన పెంపుపై ఎలాంటి మార్గదర్శకాలు ఉన్నాయనే దానిపై పూర్తిస్థాయి సమాచారం రావాల్సి ఉందని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని