logo

మెమూ రైలుతో తప్పని పాట్లు

దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌లోని కర్నూలు తర్వాత పెద్ద స్టేషను మహబూబ్‌నగర్‌. ఇప్పటికే ఇక్కటి నుంచి విశాఖపట్నానికి వారంతపు రైలు నడుస్తోంది.

Published : 20 May 2023 03:22 IST

పాలమూరు జిల్లాల్లో ఆగని కర్ణాటక సంపర్క్‌
కేంద్ర మంత్రి పర్యటనపై ప్రయాణికుల ఆశలు

మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషను..

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ పట్టణం : దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌లోని కర్నూలు తర్వాత పెద్ద స్టేషను మహబూబ్‌నగర్‌. ఇప్పటికే ఇక్కటి నుంచి విశాఖపట్నానికి వారంతపు రైలు నడుస్తోంది. రోజు నడిచేలా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు పట్టుబట్టడంతో కేంద్రం విశాఖ - కాచిగూడ రైలును మహబూబ్‌నగర్‌ వరకు పొడిగించింది. 12862 మహబూబ్‌నగర్‌ - విశాఖపట్నం రైలును శనివారం సాయంత్రం 4.10 గంటలకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో జెండాఊపి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో రైల్వే సేవలపరంగా నెలకొన్న సమస్యలపై దృష్టిసారించాల్సిన అవసరముంది. వివిధ ప్రాంతాల్లోని స్టేషన్లలో పరిస్థితులపై ‘న్యూస్‌టుడే’ కథనం.
రోజూ ఉదయం 6.40 గంటలకు మహబూబ్‌నగర్‌ - కాచిగూడ ప్యాసింజరు రైలు ఆరేళ్ల పాటు నడిచింది. దాని స్థానంలో గతేడాది అక్టోబరు నుంచి శౌచాలయాలు లేని మెమూ రైలును నడపటంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. గతేడాది నవంబరు 19న ‘శౌచాలయాలు లేని రైలు’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితం కావటంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పందించారు. ఈ ఏడాది జనవరి నుంచి డెమూ రైలును పునరుద్ధరించారు. పది రోజులుగా మళ్లీ మెమూ రైలునే నడుపుతున్నారు. ఉదయం 6.40 గంటలకు బయలుదేరే ఈ రైలు కాచిగూడకు చేరుకునేసరికి దాదాపు మూడు గంటల సమయం పడుతుంది. మూత్రశాలలు లేక ఇబ్బందులు పడాల్సి వస్తున్నందున డెమూ నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

* కర్ణాటక సంపర్క్‌ క్రాంతి వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ రైలును కర్నూలులో నిలుపుతున్నారు. ఈ రైలును జిల్లా కేంద్రాల్లోనూ ఆపాలని ప్రయాణికులతో పాటు ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి ద.మ.రైల్వే జీఎం, కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. బెంగళూరు నుంచి దిల్లీ వరకు రాకపోకలు సాగించే ఈ రైలుకు మహబూబ్‌నగర్‌లో హాల్ట్‌ ఇస్తే సౌకర్యంగా ఉంటుంది.

* సికింద్రాబాద్‌ నుంచి కర్నూలు, రాయచూరు వయా మహబూబ్‌నగర్‌ విద్యుదీకరణ పూర్తయ్యింది. హైదరాబాద్‌లో నడిచే ఎంఎంటీఎస్‌ రైళ్లను మహబూబ్‌నగర్‌ వరకు పొడిగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఎంఎంటీఎస్‌ అందుబాటులోకి వస్తే నిత్యం హైదరాబాద్‌కు రాకపోకలు సాగించే వేలాది ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలు, విద్యార్థులకు మేలు జరుగుతుంది.

* 17435 కాచిగూడ - కర్నూలు సిటీ రైలు రాత్రి 8 గంటలకు మహబూబ్‌నగర్‌కు వస్తుంది. ఆ సమయంలో ప్రయాణికులు లేక ఖాళీగా వెళ్తోంది. ఈ రైలు వేళలను మార్పు చేయాల్సిన అవసరముంది. కాచిగూడ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరుకుంటే కర్నూలు వైపు వెళ్లే ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటుంది. రాత్రి 9.30 గంటలకు ఈ రైలు మదనాపురం చేరుకుంటోంది. పలు దూరప్రాంతాలు, గ్రామాల వ్యాపారులు ఇక్కడి నుంచి రైలు దిగి ఆ సమయంలో ఆటోల్లో పల్లెలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రైలుకు శ్రీరాంనగర్‌ స్టేషన్‌లో హాల్టు ఇస్తే దాదాపు 8 గ్రామాల ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.

పేరుకే జోగులాంబ హాల్టు

అలంపూర్‌ దేవాలయాలను సందర్శించే యాత్రికుల కోసం ఏర్పాటుచేసిన జోగులాంబ హాల్టు రైల్వే స్టేషన్‌లో సమస్యలు తిష్ఠవేశాయి. ప్లాట్‌ఫాం ఎత్తు తక్కువగా ఉండటంతో మహిళలు, వృద్ధులు పిల్లలు, సామగ్రితో దిగేందుకు, ఎక్కేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ గుంతకల్‌ - కాచిగూడ, సికింద్రాబాద్‌ - కర్నూలు సిటీ తుంగభద్ర, కర్నూలు సిటీ - హైదరాబాద్‌ హంద్రీ ఎక్స్‌ప్రెస్‌లు మాత్రమే నిలుపుతున్నారు. రైల్వే గేటు వద్ద ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి జోగులాంబ హాల్టు వద్ద ఆర్వోబీ నిర్మించాలని ఇక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. స్టేషనులో సిబ్బంది కొరతతో ఇక్కడి మరుగుదొడ్లకు ఎప్పుడూ తాళాలు వేసి ఉంచుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని