logo

అందరూ స్పందిస్తేనే ఆర్‌ఆర్‌ఆర్‌ హిట్‌

పట్టణాలను స్వచ్ఛంగా మార్చటంతో పాటు వ్యర్థాల నుంచి సంపద సృష్టించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘మేరీ లైఫ్‌.. మేరా క్లీన్‌ సిటీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Published : 29 May 2023 05:20 IST

పట్టణాల్లో పాత వస్తువుల సేకరణ కేంద్రాల ఏర్పాటు

భూత్పూర్‌లోని ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రంలో పాతవస్తువులు సేకరిస్తున్న పుర సిబ్బంది

న్యూస్‌టుడే, భూత్పూర్‌: పట్టణాలను స్వచ్ఛంగా మార్చటంతో పాటు వ్యర్థాల నుంచి సంపద సృష్టించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘మేరీ లైఫ్‌.. మేరా క్లీన్‌ సిటీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పురపాలికల్లో ఆర్‌ఆర్‌ఆర్‌(తగ్గించు - పునర్వినియోగించు - పునరుత్పత్తికి వాడు) కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇళ్లల్లో ఉండే పాత వస్తువులు, సామగ్రిని సేకరించటం, అవసరమైన వ్యక్తులకు దుస్తులు, వస్తువులు అందించి పునర్వినియోగానికి ప్రోత్సహించటం, ఇంకా మిగిలిన వాటిని రీసైక్లింగ్‌కు విక్రయించటం ద్వారా ఆదాయం సమకూర్చుకోవటం ఈ కేంద్రాల లక్ష్యం. జిల్లాలోని మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, భూత్పూర్‌ పురపాలికల్లో ఈ నెల 20 నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పురపాలక అధికారులు వార్డుల వారీగా పట్టణ ప్రజలకు అవగాహన కల్పిస్తూ వారి నుంచి పాత వస్తువులు సేకరిస్తున్నారు. ఇందుకు మహిళా సంఘాల ఆర్పీల సహకారం తీసుకుంటున్నారు. చక్కని లక్ష్యంతో ప్రారంభించిన ఈ కేంద్రాలు ప్రజలంతా స్పందించి భాగస్వాములైతేనే విజయవంతమవుతాయి. ఈ దిశగా అందరినీ సమాయత్తం చేయాల్సిన అవసరముంది.
ఏయే వస్తువులు ఇవ్వొచ్చు..? : ఇళ్లలో వృథా గా పడి ఉన్న పాత పేపర్లు, పుస్తకాలు, నోట్‌బుక్స్‌, ప్లాస్టిక్‌ వస్తువులు, దుస్తులు, చెప్పులు, బూట్లు, బొమ్మలు, క్రీడా సామగ్రి.. ఇలా వస్తువులేవైనా ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రాలకు అప్పగించవచ్చు.
ఎక్కడెక్కడ ఉన్నాయంటే : మహబూబ్‌నగర్‌ పట్టణం వేంకటేశ్వరకాలనీ ఐసీడీఎస్‌ కార్యాలయం వద్ద శాశ్వత కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా ప్రతి వార్డులోని కమ్యూనిటీ భవనాల వద్ద కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల నుంచి పాత వస్తువులు సేకరిస్తున్నారు. జడ్చర్ల పురపాలికలో ప్రైవేటు భాగస్వామ్యంతో 15 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ రోజుకు సుమారు 600 కేజీల వరకు పాత వస్తువులు కేంద్రాల్లో జమవుతున్నాయి. భూత్పూర్‌లో అయిదు కేంద్రాలు ఏర్పాటు చేసి వస్తువులు సేకరిస్తున్నారు. అమిస్తాపూర్‌లోని తహసీల్దార్‌ కార్యాలయంలో శాశ్వత కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.


పురాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ :

స్వచ్ఛ భారత్‌ అభియాన్‌లో భాగంగా ‘మేరీ లైఫ్‌ మేరా క్లీన్‌ సిటీ’ కార్యక్రమాన్ని పురపాలికలో అమలుచేస్తున్నాం. వార్డుల వారీగా ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలను పాత వస్తువులు సేకరిస్తున్నాం. పట్టణాన్ని స్వచ్ఛంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలి.

నూరల్‌ నజీబ్‌, పుర కమిషనర్‌, భూత్పూర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని