4 రోజులు గడువు.. 40 శాతమే పని పూర్తి!
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా జూన్ మొదటి వారంలో కొత్త ఏకరూప దుస్తులు పంపిణీ చేయాలి.
ఏకరూప దుస్తులను పరిశీలిస్తున్న అధికారులు
ధరూరు, న్యూస్‌టుడే : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏటా జూన్ మొదటి వారంలో కొత్త ఏకరూప దుస్తులు పంపిణీ చేయాలి. అయితే, ఈసారి పూర్తి స్థాయిలో విద్యార్థులకు సకాలంలో అందే పరిస్థితి కనిపించడం లేదు. డిజైన్‌లో మార్పు చేయడం వల్ల ఎక్కువ సమయం పడుతోందని, ప్రభుత్వం ఇచ్చే కుట్టుకూలి గిట్టుబాటు కావడం లేదని దర్జీలు చెబుతున్నారు. మార్కెట్‌లో టైలర్లు ఒక జత కుడితే కనీసం రూ.400 నుంచి రూ.850 వరకు తీసుకుంటారని, తాము రూ.50తో ఎలా కుట్టాలని ప్రశ్నిస్తున్నారు. చేసుకున్న ఒప్పందాన్ని వదులుకోలేక.. అటు దుస్తులు కుట్టలేక అడకత్తెరలో పోకచెక్కలా పరిస్థితి ఉందని వాపోతున్నారు.
డిజైన్ మార్పుతో ఎక్కువ సమయం : ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,177 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 3.20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కొక్కరికి రెండు జతలు జూన్ ఒకటో తేదీ నాటికి కుట్టించి ప్రధానోపాధ్యాయులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 16.03 లక్షల మీటర్ల వస్త్రాన్ని ఇప్పటికే ఆయా పాఠశాలల ఎస్‌ఎంసీ కమిటీల తీర్మానం మేరకు దర్జీల (ఏజెన్సీలు)కు అందజేశారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు 40 శాతం వరకు దుస్తులు కుట్టడం పూర్తయినట్లు సమాచారం. మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది. అంతలోపు మిగతా 60 శాతం దుస్తులు కుట్టి పంపిణీ చేయాల్సి ఉంది. అమ్మాయిలకు, చిన్నారులకు షర్టు గౌను పట్టీలు పెట్టి చక్కగా కుట్టటం, పెద్దవారికి కాలర్‌పట్టీలు, కోట్ చొక్కా, జేబులు, భుజాలపై క్లాపులు, చేతి భాగంలో క్లిప్పులు చుట్టాల్సి ఉంటుంది. డిజైన్ మార్పు చేసిన కారణంగా సమయం ఎక్కువగా తీసుకోవడంతో దినసరిగా కుట్టటానికి వచ్చే కూలీలు రేటు ఎక్కువగా అడగటం వల్ల పని ముందుకు సాగటం లేదని, కనీసం రూ.200 ఇస్తే తప్ప కుట్టుకూలి గిట్టుబాటు కాదని ఒప్పందం తీసుకున్న ఏజెన్సీ మహిళలు అంటున్నారు.
సమస్య ఉంది
పాఠశాలల పరిధిలో ఎస్‌ఎంసీ కమిటీల నిర్ణయం మేరకు దర్జీలకు అప్పగించాం. జూన్ ఒకటో తేదీ నాటికి కుట్టిన దుస్తులు పాఠశాలకు చేర్చాల్సి ఉంటుంది. కుట్టుకూలి గిట్టుబాటు కావటం లేదని దర్జీలు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదించాం. ఆయా దర్జీలతో దుస్తులు కుట్టే ప్రక్రియ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ సూచనలు ఇస్తున్నాం.
సిరాజుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి, జోగులాంబ గద్వాల
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Household debt: కుటుంబాల పొదుపులు సగానికి తగ్గాయ్.. అప్పులు రెండింతలు పెరిగాయ్!
-
NIA: అమెరికాలోని భారత కాన్సులేట్‌పై దాడి ఘటన.. నిందితుల ఫొటోలు విడుదల
-
Chandrababu Arrest: చంద్రబాబు సీఐడీ ‘కస్టడీ’ పిటిషన్‌పై తీర్పు వాయిదా
-
IND vs AUS: నేను సిద్ధం.. వారిద్దరూ భారత్‌తో తొలి వన్డే ఆడరు: ఆసీస్ కెప్టెన్ కమిన్స్
-
Pakistan Elections: జనవరిలో పాకిస్థాన్ ఎన్నికలు: ఈసీ ప్రకటన
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు