పత్రాలు సరే.. స్థలమేది మరి?
పురపాలికల్లో కేటాయించిన ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు స్వాధీనపరచడంలేదు. దీంతో వారు తమకిచ్చిన ధ్రువీకరణ పత్రాలను పెట్టెల్లోనే భద్రపర్చుకుంటున్నారు.
పురపాలికల్లో ప్రహసనంగా పట్టాల పంపిణీ
ధ్రువీకరణ పత్రంతో లబ్ధిదారు
పురపాలికల్లో అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాల పంపిణీ ప్రహసనంగా మారింది. ప్రభుత్వ పరంగా ఇళ్ల నిర్మాణానికి స్థలాలను సమకూర్చే ప్రక్రియ అభాసుపాలవుతోంది. ఏళ్ల కిందట కేటాయించిన భూముల్లో ఇళ్ల స్థలాల పట్టా ధ్రువీకరణ పత్రాలను జారీ చేసినా ఇప్పటికీ లబ్ధిదారులకు స్థలాలను స్వాధీనపర్చని దుస్థితి కొనసాగుతోంది.
న్యూస్‌టుడే, ఆత్మకూర్
అమరచింతలో కేటాయించిన భూమిలో గుడిసె వద్ద బీడీ కార్మికులు
పురపాలికల్లో కేటాయించిన ఇళ్ల స్థలాలను లబ్ధిదారులకు స్వాధీనపరచడంలేదు. దీంతో వారు తమకిచ్చిన ధ్రువీకరణ పత్రాలను పెట్టెల్లోనే భద్రపర్చుకుంటున్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపు, కేటాయించిన స్థలాల స్వాధీనం కోసం అడపాదడపా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు నిర్వహించే ఆందోళనల సందర్భంగా లబ్ధిదారులు వాటిని బయటకు తీసి అధికారులకు సమర్పించడం పరిపాటిగా మారింది. ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా ఇళ్ల స్థలాల కేటాయింపునకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను సేకరించడం, ఇళ్ల స్థలాలు అవసరమైన లబ్ధిదారుల గుర్తింపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పత్రాలను పొంది, ఇళ్ల స్థలాలు సమకూరని లబ్ధిదారులు ముందుగా తమకు కేటాయించాలని ఆందోళన కార్యక్రమాలకు సమాయత్తమవుతున్నారు.
గతంలో కేటాయింపు ఇలా..
వనపర్తి: జిల్లా కేంద్రంలో సర్వే నం.974, 143, 145లలో ఉన్న భూములను నిరుపేదలకు ఇళ్ల స్థలాలను సమకూర్చేందుకు కేటాయించారు. 2008లో అప్రాయిపల్లి, చిట్యాల, మబ్బుగుట్ట, పీర్లగుట్ట ప్రాంతాల్లో ఈ ప్రభుత్వ భూములను గుర్తించి, 685 మంది అర్హులైన లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను జారీచేశారు. 6.85 ఎకరాల స్థలాన్ని కేటాయించినా ఇప్పటికీ వారికి స్వాధీపరచని పరిస్థితి ఉంది. ఇటీవల ప్రభుత్వం చిట్యాల వద్ద రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసింది. ఇదే స్థలంలో తమకు ఇళ్ల స్థలాల ధ్రువీకరణ పత్రాలను గతంలో జారీ చేసిన క్రమంలో రెండు పడక గదులను తమకు సైతం కేటాయించాలని వీరు కోరుతున్నారు.
అమరచింత: పురపాలిక శివారులోని సర్వే నం.586, 587లో విస్తరించిన 14.37 ఎకరాల దుబ్బాయికుంట స్థలాన్ని గతంలో ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు. 306 మంది అర్హులైన లబ్ధిదారులను ఎంపికచేసి, 1997లో పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఇదే స్థలంలో తాగునీటి పంప్‌హౌస్‌ను నిర్మించారు. ఇటీవల పోలీస్ ఠాణాకు, సమీకృత మార్కెట్ నిర్మాణానికి 6.50 ఎకరాల స్థలాన్ని పురపాలిక స్వాధీనపర్చుకొంది. ప్రస్తుతం 8.50 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. ఇందులోనైనా ఇళ్ల స్థలాలను స్వాధీనపర్చాలని సీపీఎం ఆధ్వర్యంలో గుడిసెలను ఏర్పాటు చేశారు. ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఆత్మకూరు: పురపాలిక శివారులో పీజేపీ ప్రధాన కాలువ నిర్మాణం సందర్భంగా భూసేకరణ చేశారు. సర్వే నం.284, 285, 286, 287, 288, 282ల్లోని 18 ఎకరాల స్థలాన్ని అప్పట్లో సేకరించి పరిహారం చెల్లించారు. అనంతరం ఈ పొలాలను ఇళ్ల స్థలాలకు కేటాయిస్తూ 2002లో అర్హులను ఎంపిక చేసి పత్రాలు జారీచేశారు. తెదేపా, కాంగ్రెస్ పార్టీల హయాంలో పోటాపోటీగా 1,200 మందికి పత్రాలను పంపిణీ చేశారు. స్థలాలను మాత్రం స్వాధీనపర్చలేకపోయారు. ఇటీవల పురపాలిక శ్మశానవాటిక, డంపింగ్‌యార్డు కోసం ఆరు ఎకరాల భూమిని తీసేసుకుంది. మిగిలిన భూమిని పరిసర రైతులు ఆక్రమించుకుంటున్నారు.
కొత్తకోట: 2004, 2008 సంవత్సరాల్లో బ్రహ్మంగారి గుట్ట ప్రదేశాన్ని ఇళ్ల స్థలాలకు కేటాయించారు. ఈ స్థలానికి రహదారి లేకపోవడం, హైటెన్షన్ విద్యుత్ తీగలు ఉండటంతో అప్పట్లో లబ్ధిదారులు ఆసక్తి చూపలేదు. పత్రాలు పొందిన 120 మంది ఇటీవల ఇంటి స్థలాలను స్వాధీనపర్చాలని ఆందోళనలు చేపట్టిన పరిస్థితుల్లో స్థలం పరిమాణాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. దీన్ని లబ్ధిదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయినా కేటాయించిన ఇళ్ల స్థలాలను స్వాధీపర్చే ప్రక్రియ మాత్రం కొలిక్కిరావడం లేదు.
అందుబాటులో ఉన్న స్థలాలను పరిశీలిస్తున్నాం
పురపాలికతో పాటు మండలం పరిధిలో ఇళ్ల స్థలాల కేటాయింపునకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తిస్తున్నాం. గతంలో ఇళ్ల స్థలాల కేటాయింపు, స్వాధీనపర్చకపోవడం వంటి సమస్యలనూ పరిశీలిస్తున్నాం. ఆత్మకూరు పట్టణ శివారులో పత్రాలను పొందిన 1,200 మందికి పంపిణీ చేసేందుకు అవసరమైన ప్రభుత్వ స్థలం అందుబాటులో లేదు. పట్టణానికి సమీపంలో పరిహారం చెల్లించి ప్రభుత్వం సేకరించిన ఇతర స్థలాల వివరాలను సేకరించి, ఉన్నతాధికారులకు నివేదించనున్నాం.
ఎన్.సింధూజ, తహసీల్దార్, ఆత్మకూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rupert Murdoch: ‘ఫాక్స్’ ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలిగిన రూపర్ట్ మర్దోక్
-
Stomach Pain: కడుపు నొప్పితో ఆస్పత్రికి.. ‘ఎక్స్-రే’ చూస్తే షాక్!
-
World Cup: ఆ ఇద్దరూ ఉండటం వల్లే సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదు: హర్భజన్ సింగ్
-
TDP: వైకాపా దౌర్జన్యాలను ఎలా ఎదుర్కొందాం? టీడీఎల్పీలో చర్చ
-
Flipkart: మరోసారి బిగ్ బిలియన్ డేస్ సేల్.. వాటిపై భారీ డిస్కౌంట్!
-
LEO Movie: పోస్టర్లతోనే ‘లియో’ కథను హింట్ ఇచ్చారా? ఆ జాబితాలోనూ నెం.1