logo

సర్కారు కళాశాలకు రారండోయ్‌

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకులు ప్రచారం చేపట్టారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రథమ సంవత్సరం విద్యార్థులు ప్రవేశాలు నమోదు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు.

Published : 29 May 2023 05:20 IST

ప్రవేశాల పెంపునకు ఇంటింటా ప్రచారం

తిమ్మాజిపేట మండలం గొరిట గ్రామంలో అవగాహన కల్పిస్తున్న అధ్యాపకులు

కందనూలు, న్యూస్‌టుడే : జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకులు ప్రచారం చేపట్టారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రథమ సంవత్సరం విద్యార్థులు ప్రవేశాలు నమోదు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఈనెల 12 నుంచి ప్రవేశాలు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26 నుంచి ప్రవేశాలు పొందిన విద్యార్థుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. దీంతో గ్రామాల వారీగా పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల వివరాలు సేకరించి ప్రభుత్వ అధ్యాపకులు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. సర్కారు కళాశాలల్లో వసతులు, అధ్యాపకుల అనుభవం, బోధనా వసతులను వివరిస్తున్నారు. ప్రైవేట్‌ కళాశాలల్లో కాకుండా ప్రభుత్వ కళాశాల్లో చేర్పించాలని సూచిస్తున్నారు. జిల్లాలోని అన్ని కళాశాలల్లో కలిపి ఇప్పటి వరకు 316 మంది ప్రవేశాలు పొందారు.

మెరుగైన వసతులు.. : జిల్లాలో మొత్తం 15 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి మండల కేంద్రాల్లో కొత్త కళాశాలలు ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు పంపించినా ఉన్నతాధికారులు ఇంకా ఆమోదించలేదు. రెండు మండల కేంద్రాల్లో ఈ విద్యా సంవత్సరంలో కళాశాలలు ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని 15 కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, వృత్తి విద్యా కోర్సులు తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఉచిత పాఠ్య పుస్తకాలు అందజేస్తున్నారు. సర్కారు కళాశాలలో చదవుతున్న వారు ఏటా వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. జిల్లాలో గత విద్యా సంవత్సరం ప్రథమ సంవత్సరంలో 2,250 మంది విద్యార్థులు ప్రవేశాలు నమోదు చేసుకున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ సంఖ్యను మరింత పెంచడానికి సర్కారు కళాశాలల అధ్యాపకులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నివాసాలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లోని వసతులను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారి వెంకటరమణ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని