logo

దశాబ్ది ఉత్సవాలు రేపటి తరానికి స్ఫూర్తి

రేపటి తరానికి స్ఫూర్తి నింపటానికి తెలంగాణ ప్రభుత్వం జూన్‌ 2 నుంచి 22వ తేదీ వరకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందని, ప్రతి ఒక్కరూ తెలంగాణ అభివృద్ధికి పునరంకితం కావాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 01 Jun 2023 04:00 IST

మంత్రి నిరంజన్‌రెడ్డి

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

గద్వాల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : రేపటి తరానికి స్ఫూర్తి నింపటానికి తెలంగాణ ప్రభుత్వం జూన్‌ 2 నుంచి 22వ తేదీ వరకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తోందని, ప్రతి ఒక్కరూ తెలంగాణ అభివృద్ధికి పునరంకితం కావాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం గద్వాల సమీపంలో ఓ ఫంక్షన్‌ హల్లో కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అధ్యక్షతన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జరిగే దశాబ్ది ఉత్సవాల్లో అన్నివర్గాల వారు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. జూన్‌ 3న జరిగే వ్యవసాయ దినోత్సవ కార్యక్రమాన్ని గ్రామాల్లోని రైతు వేదికల్లో నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు.

అడుగడుగున స్ఫూర్తి నింపాలంటే రైతు దినోత్సవం రోజున భారీగా రైతు సమీకరణ జరగాలన్నారు. డప్పులు, వాయిద్యాలతో ఎండ్లబండ్లపై ర్యాలీగా వెళ్లి జాతీయగీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. రైతులు ఆరుతడి పంటలు కంది, పత్తి సాగు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. మన ప్రాంతంతో సాగునీటికి కొరత లేదని, సమయానుకూలతను బట్టి పంటలు సాగు చేసేలా చైతన్యం చేయాలన్నారు. ఏ రంగంలోనైనా ప్రగతి గతంలో ఎలా ఉంది.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎలా ఉంది అనే అంశాలపై మాట్లాడాలన్నారు. అన్ని శాఖల అధికారులు వారి శాఖ అభివృద్ధి గురించి ఉత్సవాల్లో ప్రజలకు వివరించాలన్నారు. మత్స్యకారులు బతుకమ్మలతో ఊరేగింపుగా వెళ్లి చెరువుల వద్ద కట్ట మైసమ్మ పూజలు చేసి, ఉత్సవాలు జరపుకోవాలన్నారు. జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ సరిత మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర ప్రజలకు పండుగలాంటివని, మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాలను క్యాలెండర్‌ ప్రకారం అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఎస్పీ సృజన, అదనపు కలెక్టర్‌ అపూర్వ్‌ చౌహాన్‌,  అలంపూర్‌, గద్వాల ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల కృష్ణమోహన్‌రెడ్ది, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ సాయిచంద్‌, దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మంద జగన్నాథం, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ రామన్‌ గౌడ, మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ శ్రీధర్‌గౌడ్‌, పుర ఛైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, ఆర్డీవో రాములు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని