logo

ఇక సర్కారు బడిబాట

పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు పాఠశాలలతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రమాదంలో పడింది. ఈ క్రమంలో సర్కారు పాఠశాలలను కాపాడుకోవడం విద్యాశాఖకు కత్తిమీద సాములా మారింది.

Published : 01 Jun 2023 04:00 IST

న్యూస్‌టుడే, కొత్తకోట

మదనాపురం : బడిబాట నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు (పాతచిత్రం)

పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు పాఠశాలలతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ప్రమాదంలో పడింది. ఈ క్రమంలో సర్కారు పాఠశాలలను కాపాడుకోవడం విద్యాశాఖకు కత్తిమీద సాములా మారింది. అందుకని పాఠశాలల్లో విద్యార్థులను ఆకర్శించడం కోసం ప్రభుత్వం ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ‘ఆచార్య జయశంకర్‌ బడిబాట’ కార్యక్రమానికి పూనుకుంటోంది. అందులో భాగంగా ఈ ఏడాది జూన్‌ 1న ఉపాధ్యాయులు సన్నాహక సమావేశం నిర్వహించుకొని, 3 నుంచి 17 వరకు రోజుకో కార్యక్రమంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కలవనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు, నిష్ణాతులైన ఉపాధ్యాయులచే బోధన, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ తదితర సౌకర్యాలను వివరిస్తూ పిల్లలను చేర్చాలని అవగాహన కల్పించనున్నారు. ఉపాధ్యాయులు ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ.. మధ్యలో చదువు మానేసిన వారిని, బాల కార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించేందుకు కృషి చేయనున్నారు. దీంతోపాటు అయిదేళ్లలోపు చిన్నారులను అంగన్‌వాడీ కేంద్రాల్లో చేర్పించడానికి ప్రత్యేక కృషి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య పెంచాలన్న లక్ష్యంతో 15 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

విస్తృత ప్రచారానికి సన్నాహాలు..

గత కొన్నేళ్లుగా విద్యార్థులను చేర్పించేందుకు బడిబాట కార్యక్రమం చేపడుతున్నా ఉమ్మడి జిల్లాలో సత్ఫలితాలు కనిపించలేదు. ప్రస్తుతం ప్రభుత్వం ‘మన ఊరు- మనబడి, మన పట్టణం - మనబడి’ కార్యక్రమం ద్వారా పాఠశాలలను బలోపేతం చేయడం, మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి సదుపాయాలు కల్పిస్తున్నారు. విద్యార్థులు చేరి వీటిని సద్వినియోగం చేసుకునేలా ఉపాధ్యాయులు బడి బాట కార్యక్రమం ద్వారా విస్తృత ప్రచారం కల్పించనున్నారు. దీనికి సంబంధించి కరపత్రాలు సిద్ధం చేశారు.

రోజువారీ కార్యక్రమాలు ఇలా...

* పాఠశాల స్థాయిలో 1న సన్నాహక సమావేశాల నిర్వహణ.

* 3 నుంచి 9వ తేదీ వరకు గ్రామాలు, ఆవాస ప్రాంతాల్లో ప్రత్యేక నమోదు కార్యక్రమం.

* 12న మన ఊరు మన బడి, మన బస్తి మన బడి కార్యక్రమాన్ని నిర్వహించాలి. పాఠశాలను మామిడి తోరణాలు, ముగ్గులతో అలంకరించి పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి సమావేశాన్ని నిర్వహించాలి.

* 13న తొలిమెట్టు కార్యక్రమంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. తరగతులు, సబ్జెక్టుల వారీగా అభ్యసన ఫలితాల గోడ పత్రికలను ప్రదర్శించాలి. విద్యార్థుల అభ్యసన స్థాయిని తల్లిదండ్రులకు వివరించాలి.

* 14న విద్యార్థులతో సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించాలి. ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి బాలసభలు నిర్వహించి విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలి. పాఠశాల స్థాయి పిల్లల కమిటీలు, క్లబ్‌లు ఏర్పాటు చేయాలి. బోధనాభ్యసన సామగ్రితో ప్రదర్శన ఏర్పాటు చేయాలి.

* 15న ప్రత్యేక అవసరాల పిల్లల నమోదుపై దృష్టి పెట్టాలి. గ్రామాల్లో వివిధ వైకల్యాలతో బాధపడుతున్న పిల్లలను గుర్తించి పాఠశాలలు, భవిత కేంద్రాల్లో చేర్పించాలి.

* 16న ఆంగ్ల మాధ్యమ తరగతుల నిర్వహణపై తల్లిదండ్రులు, విద్యార్థులకు అవగాహన కల్పించాలి.

* 17న బాలికా విద్య ప్రాముఖ్యత, ఉన్నత చదువుల ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలి. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులను ఆహ్వానించి తరువాత వారు ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ సౌకర్యాలపై అవగాహన కల్పించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని