logo

పేరుకే పాలమూరు

ఉమ్మడి పాలమూరు జనాభా 34 లక్షలకుపైనే...వీరందరి అవసరాలు తీరలంటే కనీసం రోజూ కోటి లీటర్లకుపైగా పాలు అవసరం. కానీ ఉమ్మడి జిల్లాలో సరాసరి ఇప్పుడు రోజూ 60 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది.

Updated : 01 Jun 2023 05:58 IST

నేడు ప్రపంచ పాలదినోత్సవం
మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం), న్యూస్‌టుడే

* ఉమ్మడి పాలమూరు జనాభా 34 లక్షలకుపైనే...వీరందరి అవసరాలు తీరలంటే కనీసం రోజూ కోటి లీటర్లకుపైగా పాలు అవసరం. కానీ ఉమ్మడి జిల్లాలో సరాసరి ఇప్పుడు రోజూ 60 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. ఇందులో ఉత్పత్తిదారుల అవసరాలకు 20 లక్షల లీటర్లు పోతున్నాయి. దాదాపు మరో 60 లక్షల లీటర్ల పాల కొరత ఉంది.  దీన్ని అదిగమించేందుకు ఇతర రాష్ట్రలు, రాజధాని నుంచి నిత్యం పాలు వస్తున్నాయి. చిత్తూరు. కర్నూలు, హైదరాబాద్‌ల నుంచి పాలను దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పాల కేంద్రాలకు రోజూ 83 వేల లీటర్లు మాత్రమే వస్తున్నాయి. మిగతావి ఐదు ప్రయివేటు కంపెనీలకు వెళ్తున్నాయి.

* ఉమ్మడి జిల్లాల్లోని ముఖ్య పట్టణాల్లో గంటల్లో పాలు అమ్ముడుపోతున్నాయి. ఉదయం ఐదు గంటల నుంచి ఆరు, ఏడు గంటల మధ్య పాల వ్యాపారం ఊపందుకుంటోంది. మరో గంట ఆలస్యంగా వెళ్తే మంచి పాలు దొరికే పరిస్థితి లేదు.. 1300 కేంద్రాల్లోనే ప్రభుత్వం పాలను సేకరిస్తుంది. ఇతర గ్రామాల్లో ప్రయివేటు డెయిరీలు పాలను సేకరిస్తున్నాయి. వీటిని ఇతర ప్రాంతాలకు పంపి మళ్లీ ప్యాకింగ్‌ చేసిన తర్వాత ఇక్కడికి తీసుకు వచ్చి అమ్మకాలు సాగిస్తున్నాయి. ప్రభుత్వపరంగా రైతులకు ప్రోత్సాహం ఉండటం లేదన్న భావన వ్యక్తమవుతోంది..

* ప్రయివేటు డెయిరీలు లీటరుకు రూ.50కు పైనే చెల్లిస్తున్నాయి. దానికితోడు బ్యాంకుల ద్వాఆ రుణాలను ఇప్పించటంతోపాటు, దాణా, మినరల్‌ మిక్చర్‌ వంటి పోషక పదార్థాలను అందిస్తున్నారు. దీనికి తోడు కమీషన్‌ కాస్త ఎక్కువగా చెల్లించడంతో ప్రైవేటు వైపు మొగ్గు కనిపిస్తోంది. రైతుల పరిస్థితి ఇలా ఉంటే వినియోగదారులకు నాణ్యమైన పాలు అందడం లేదు.

హన్వాడ మండలం సల్లోనిపల్లిలో కేంద్రానికి పాలను పోస్తున్న రైతులు

ఇలా చేస్తే మేలు.

* పాల ఉత్పత్తి పెరగాలంటే ప్రభుత్వ పరంగా కొన్ని ప్రోత్సాహకాలు అందాలని రైతులు కోరుతున్నారు. రాయితీపై పశుగ్రాసాలు అందించాలి. దాణా, మినరల్‌ మిక్చర్‌ ఇవ్వాలి.

* పశుబీమా, వేగంగా పరిహారం చెల్లింపుపై దృష్టిసారించాలి. రైతుకు చెల్లించే డబ్బు విషయంలో జాప్యం ఉండకూడదు.

* పాల ఉత్పత్తులకు అధనపు విలువలు జోడించి, మార్కెట్‌లోకి విడుదల చేయాలి.

పాలు... ఎంతో మేలు

పాలు సంపూర్ణ పోషకాహారం. కండరాలు, ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ప్రోటీన్లను అందుతాయి. ఎక్కువగా కాల్షియం ఉంటుంది.. విటమిన్‌ బి12,  భాస్వరం, పొటాషియం, సోడియం పాలలో ఉంటుంది. పేగుల్లో ఆరోగ్య సహాయక సూక్ష్మజీవుల పెరుగుదలకు దోహదపడతాయి. ఇందులోని విటమిన్‌-ఎ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కీళ్లవాపు, డీహైడ్రేషన్‌ తగ్గి, దంత సంరక్షణకు పాటుపడతాయి. ప్రతి వంద మిల్లీలీటర్లలో 3.33 గ్రాముల ప్రోటీన్లు, 3.33 గ్రాముల కొవ్వు పదార్థాలు, 5 గ్రాముల పిండి పదార్థాలు, 5 గ్రామల చక్కెర పదార్థాలు ఉంటాయి.

డా.మధుసూదన్‌గౌడ్‌, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి

కష్టానికి తగ్గ ఫలితం ఉండటం లేదు

రోజూ 23 లీటర్ల పాలు అమ్ముతున్నాను. ఖర్చు తడిసి మోపెడవుతోంది. లీటరు ఒక్కంటికీ రూ.50 నుంచి 53 వస్తుంది. నెలకు రూ.24 వేల వరకు వస్తున్నాయి. ఇంటిల్లిపాదీ కష్టపడాల్సి వస్తోది. పశుగ్రాసం కొరత, దాణా ఖర్చులు, ఎండలు వంటి కారణాలు ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి.

తర్ల శ్రీనివాసులు సల్లోనిపల్లి. హన్వాడ మండలం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని