logo

ఆగని ఇసుక రవాణా

ఇసుక దందా కొంతమందికి కాసులు కురిపిస్తోంది. అర్ధరాత్రి అయ్యిందంటే చాలు గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా గుర్లపల్లి వాగు నుంచి తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

Published : 01 Jun 2023 04:00 IST

చోద్యం చూస్తున్న యంత్రాంగం
న్యూస్‌టుడే, మక్తల్‌ పట్టణం

ఇసుక రీచ్‌ వద్ద వాహనాలు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ర్యాంప్‌

ఇసుక దందా కొంతమందికి కాసులు కురిపిస్తోంది. అర్ధరాత్రి అయ్యిందంటే చాలు గుట్టుచప్పుడు కాకుండా ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా గుర్లపల్లి వాగు నుంచి తోడేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాల పేరిట అర్ధరాత్రి పూట ఇసుక తవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తే అధికారులు నీళ్లు నములుతున్నారు. అరకిలోమీటరు దూరం వరకు గుండ్లపల్లి ఇసుక రీచ్‌ను తవ్వి భూగర్భజలాలు అడుగంటిపోయేలా వ్యాపారం సాగిస్తున్నారు. ఒకప్పుడు ఉపరితలంలో వాగు ద్వారా నీటిని పంట పొలాలకు వాడే వాళ్లమని, గత రెండేళ్ల నుంచి వాగులో విచ్చలవిడిగా ఇసుక తవ్వడం వల్ల బోర్లపై ఆధారపడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇసుక రవాణా కోసం రెండు కిలోమీటర్ల మేర మట్టిరోడ్డు నిర్మించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇసుకను తరలించే క్రమంలో అక్కడక్కడ తమ అనుచరులను కూర్చోబెట్టి మరీ దందా సాగిస్తున్నారు. పొలాల వద్ద సైతం విపరీతంగా ఇసుక తోడేయడంతో రాళ్లు, మట్టిదిబ్బలు, గడ్డి మొలచి ప్రమాదభరితంగా మారాయి. గత ఏడాది ఈతకు వెళ్లిన విద్యార్థి ఈ గోతుల్లోనే పడి మృతిచెందాడు. ఎండలతో బోర్లు మొరాయిస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పనుల పేరు చెప్పి తీసుకున్న అనుమతికి మరిన్ని రెట్ల ఇసుకను దొంగతనంగా తరలిస్తున్నారు.

ఇసుక తోడేయడంతో వాగులో మొలిచిన దుబ్బుగడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని