logo

ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ

అన్ని రంగాల్లో పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించి.. ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ యావత్తు దేశాన్ని ఆకట్టుకుంటోందని శాసనసభ ఉప సభాపతి పద్మారావుగౌడ్‌ పేర్కొన్నారు.

Published : 03 Jun 2023 04:25 IST

శాసనసభ ఉపసభాపతి పద్మారావుగౌడ్‌

ప్రసంగిస్తున్న శాసనసభ ఉపసభాపతి పద్మారావుగౌడ్‌

గద్వాల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : అన్ని రంగాల్లో పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించి.. ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ యావత్తు దేశాన్ని ఆకట్టుకుంటోందని శాసనసభ ఉప సభాపతి పద్మారావుగౌడ్‌ పేర్కొన్నారు. శుక్రవారం గద్వాలలోని పరేడ్‌  గ్రౌండ్‌లో కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన జిల్లాలోని 32 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 82 అంశాలపై దశాబ్ది సందేశాన్ని చదివి వినిపించారు. 2014 నుంచి ఇప్పటి వరకు వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని గణాంకాలతో వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిస్తూ బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఈ తొమ్మిదేళ్లలో బలమైన అడుగులు వేశామన్నారు. తెలంగాణ ప్రజల సంక్షేమానికి ప్రవేశ పెట్టిన ప్రణాళికలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. తెలంగాణలో వివిధ వర్గాల అభ్యున్నతికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలు దృష్టి సారించి, వాటిని ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేందుకు అధికారులు అధ్యయనం చేసేందుకు ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కుటుంబాలకు చెందిన ఐదుగురిని ఆయన సన్మానించారు. బాలభవన్‌, ప్రగతి విద్యామందిర్‌ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. సీఎం కప్‌ క్రీడల్లో భాగంగా రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన జిల్లా జట్టు క్రీడాకారులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ సరిత, ఎస్పీ సృజన, అదనపు కలెక్టర్‌ అపూర్వ్‌ చౌహాన్‌, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్యేలు అబ్రహం, కృష్ణమోహన్‌రెడ్డి, పుర ఛైర్మన్‌ కేశవ్‌, ఆర్డీవో రాములు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ రామన్‌గౌడ, మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ శ్రీధర్‌గౌడ్‌, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఉపసభాపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు కొన్ని..

* జిల్లాలో రైతుబంధు పథకం కింద పది విడతల్లో రూ.1942.61 కోట్లు రైతుల వ్యక్తిగత ఖాతాల్లో జమ. రైతు బీమా కింద 2572 మందికి రూ.128.60 కోట్లు పంపిణీ.

* తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకంలో ఆర్డీఎస్‌ చివరి ఆయకట్టులో డీ/24, నుంచి డీ/40 వరకు ఉన్న 55,600 ఎకరాలకు సాగునీరు అందించడానికి రూ.783 కోట్లతో పనులు. మొదటి దశ నిర్మాణం రూ.397 కోట్లతో పరిపాలన అనుమతులు పొంది రూ.159 కోట్లతో పనులు పూర్తి.

* జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలైన గట్టు, కేటీదొడ్డి, ధరూర్‌, మల్దకల్‌ మండలాల్లో సాగునీరు అందించేందుకు నలసోమనాద్రి (గట్టు) ఎత్తి పోతల పథకం నిర్మాణ పనులను రూ.581.06 కోట్లతో పరిపాలన అనుమతులు తీసుకుని రూ.487.3 కోట్ల విలువైన పనులు.

* మిషన్‌ భగీరథ పథకం కింద జిల్లాలో 319 గ్రామాల్లో ప్రతి మనిషికి రోజుకు వెయ్యి లీటర్లు, పట్టణాలలో 135 లీటర్ల తాగునీటి సరఫరా. 1,41,529 గృహాలకు నల్లా కనెక్షన్లు.

* జిల్లాలో వైద్య రంగంలో మార్పులకు శ్రీకారం. ఈ ప్రాంతంలో రూ.26.18 కోట్లతో నర్సింగ్‌కళాశాల, 57 ఉప కేంద్రాలకు రూ.2.79 కోట్లు మంజూరు. అలంపూర్‌ చౌరస్తాలో రూ.21 కోట్ల అంచనా వ్యయంతో 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణం. కంటి వెలుగు కింద 2,83,216 మందికి కంటి పరీక్షలు.

* జిల్లాలో రూ.472.63 కోట్లతో 6 భవనాల నిర్మాణం. ఇప్పటి వరకు రూ.253.95 కోట్లతో 3 భవనాల నిర్మాణ పనులు పూర్తి.

* జిల్లాలో 2014-15లో ఖరీఫ్‌, రబీ సీజన్‌లో సాగు విస్తీర్ణం 4,27,397 ఎకరాలు, కాగా 2022-23 నాటికి రెండు సీజన్లలో 5,56,335 ఎకరాల్లో సాగు.

* జిల్లాలో తొలివిడతగా 206 సంఘాల్లో ఉన్న 13,277 మందికి గొర్రెల పంపిణీకి రూ.165.96 కోట్లు ఖర్చు. ఈ ఏడాది ‘సి’ జాబితాలో ఉన్న 33,416 మందిని గుర్తించి వారికి రూ.584.77 కోట్లు వ్యయంతో గొర్రెల పంపిణీకి ప్రతిపాదనలు.

* జిల్లాలో 2470 రెండు పడకల గదుల నిర్మాణాలకు పంచాయతీ రాజ్‌ శాఖకు అనుమతులు. ఇప్పటి వరకు 605 ఇళ్ల నిర్మాణం పూర్తి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని