logo

ఇన్నోవేషన్‌ పోటీలకు తొమ్మిది పాఠశాలలు

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు టీఎస్‌ఐసీ (తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌) వారు యూనిసెఫ్‌, ఐఎన్‌క్యూయూఐ, ఎల్‌ఏబీ సంస్థల సహకారంతో ‘స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌’ పోటీలను ఏటా నిర్వహిస్తున్నారు.

Published : 03 Jun 2023 04:25 IST

మొక్కజొన్న వ్యర్థం నుంచి హార్డ్‌బోర్డ్‌ తయారీలో అమరవాయి ఉన్నత పాఠశాల విద్యార్థులు (పాతచిత్రం)

గద్వాల న్యూటౌన్‌, న్యూస్‌టుడే : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు టీఎస్‌ఐసీ (తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌) వారు యూనిసెఫ్‌, ఐఎన్‌క్యూయూఐ, ఎల్‌ఏబీ సంస్థల సహకారంతో ‘స్కూల్‌ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌’ పోటీలను ఏటా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే 2022-23 విద్యా సంవత్సరానికి ఆగస్టులో దరఖాస్తులు ఆహ్వానించగా, విద్యార్థులు బృందాలుగా ఏర్పడి ఆలోచనలు ఇచ్చారు. తాజాగా సృజనాత్మకత ఉన్నవాటిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70 ప్రాజెక్టులు ఎంపిక చేయగా.. ఇందులో 9 ప్రాజెక్టులు ఉమ్మడి జిల్లా నుంచి ఎంపికయ్యాయి. ఉమ్మడి పాలమూరులోని అయిదు జిల్లాల నుంచి 2022 ఆగస్టులో దరఖాస్తులు స్వీకరించారు. ఇన్‌ఛార్జి ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు తమకు వచ్చిన ఆలోచనలను ఇచ్చారు. వీటికి సాధారణంగా మార్చిలో ఎంపికలు చేయాల్సి ఉండగా, అనివార్య కారణాలతో ప్రస్తుతం ఎంపిక చేశారు. ఎంపికైన వాటికి ఈనెల 5 నుంచి 15వ తేదీ వరకు బూట్‌ క్యాంప్‌ నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక బృందం వారు వచ్చి వారి ఆలోచనలకు, మరింత సృజనాత్మకతను జోడించేలా విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. వీరంతా రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతగాలు నిలిస్తే నగదు పురస్కారాలతో పాటు అంకుర సంస్థల ఆవిర్భావానికి తోడ్పాటు అందిస్తారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు వేదిక కల్పిస్తారు.

జిల్లాల వారీగా ఎంపికైన ప్రాజెక్టులు

జోగులాంబ గద్వాల జిల్లాలోని మల్దకల్‌ మండలం అమరవాయి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. వీరు గింజలు తీసిన మొక్కజొన్న వ్యర్థాలతో హార్డ్‌బోర్డ్‌ తయారు చేసే ప్రాజెక్ట్‌ చేపడుతున్నారు. గద్వాలలోని బురదపేటలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ‘ఇంటీరియల్‌ గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అవగాహన’ కల్పించడం అనే అంశం ఎంపికైంది.

* మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బోయినపల్లి గురుకుల పాఠశాల విద్యార్థుల ఐబీఏ క్రియేషన్స్‌, ఇదే పాఠశాలకు చెందిన మరో బృందం వారు ఎత్తైన చెట్లను ఎక్కే బూట్ల ప్రాజెక్టు ఎంపికైంది.

* రాజాపూర్‌ ఉన్నత పాఠశాల విద్యార్థుల ఫ్లోర్‌ను శుభ్రం చేసే సైకిల్‌ ప్రాజెక్టు ఎంపికైంది.

* నారాయణపేట జిల్లాలోని చిన్నపర్ల ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్లాస్టిక్‌ ఏటీఎమ్‌ యంత్రం ప్రాజెక్ట్‌ ఎంపికైంది.

* నాగర్‌కర్నూల్‌ జిల్లా మాదారం జడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థుల ఇచ్చిన నీటి ప్రవాహంలో ప్లాస్టిక్‌ చెత్త తొలగించే విధానం ఎంపికైంది.

* వనపర్తి జిల్లా అమరచింత ఉన్నత పాఠశాల విద్యార్థులు గతేడాది చేసిన సూపర్‌ డ్రైనేజ్‌ క్లీనర్‌ ప్రాజెక్టు ఎంపికవగా, ఈ సారి ఇదే పాఠశాల నుంచి సూపర్‌ కాటన్‌ ప్లకింగ్‌ టూల్స్‌ అనే ప్రాజెక్టు ఎంపికైంది. పెబ్బేరు ఆదర్శ పాఠశాల విద్యార్థులు తాత, అవ్వలకు సహాయపడే యంత్రాన్ని రూపొందించారు. ఎంపికైన వారంతా ఈనెల 20 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని