logo

సంపన్న రాష్ట్రంగా తెలంగాణ

తొమ్మిదేళ్ల వ్యవధిలోనే దేశంలోనే సంపన్న రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా అధికారుల కార్యాలయంలో జాతీయ పతాకం ఎగురవేసి దశాబ్ది ఉత్సవాలు ప్రారంభించారు.

Published : 03 Jun 2023 04:25 IST

దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే : తొమ్మిదేళ్ల వ్యవధిలోనే దేశంలోనే సంపన్న రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందిందని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సమీకృత జిల్లా అధికారుల కార్యాలయంలో జాతీయ పతాకం ఎగురవేసి దశాబ్ది ఉత్సవాలు ప్రారంభించారు. అంతకు ముందు జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌, జిల్లా కలెక్టర్‌ జి.రవినాయక్‌, ఎస్పీ నర్సింహ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, పురపాలక, ముడా ఛైర్మన్లు కేసీ.నర్సింహులు, గంజి వెంకన్న, పట్టణ కౌన్సిలర్లతో కలిసి నివాళి అర్పించారు. అక్కడి నుంచి సమీకృత జిల్లా అధికారుల కార్యాలయానికి చేరుకొని మహాత్మాగాంధీ, డా.బీఆర్‌.అంబేడ్కర్‌, ప్రొ.జయశంకర్‌ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకం ఎగురవేశారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం రెట్టింపు స్థాయిలో ఉందన్నారు. తలసరి విద్యుత్తు వినియోగం, ధాన్యం కొనుగోలులో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, కంటి వెలుగు, కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్‌, అమ్మఒడి, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, ఆసరా పింఛన్లు, గొర్రెల పంపిణీ, దళితబంధు, చేపపిల్లల పంపిణీ వంటి సంక్షేమ పథకాలు, సామాజిక ఆత్మగౌరవ భవనాల నిర్మాణం, సన్న బియ్యంతో విద్యార్థులకు భోజనం, ప్రతి జిల్లాలో మెడికల్‌ కళాశాల మంజూరు వంటి పనులతో ప్రసంశలు అందుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణని పేర్కొన్నారు. ఒకప్పుడు కరవు, వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు ఇప్పుడు పచ్చని పంటలకు నిలయంగా మారిందన్నారు. పాలమూరులో వ్యవసాయ పనులు చేసేందుకు, పరిశ్రమలతో ఉపాధి పొందేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారని గుర్తుచేశారు. వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశ్రమలు, సంక్షేమ రంగాల్లో జిల్లా గడిచిన తొమ్మిదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. రాబోవు రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని కోరారు.

దనపు కలెక్టర్‌ సీతారామారావు, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, డీసీసీబీ ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ వెంకటయ్య, రైతుబంధు సమితి జిల్లా సమన్వయకర్త గోపాల్‌యాదవ్‌, జిల్లా గొర్రెల కాపరుల సంఘం ఛైర్మన్‌ శాంతన్న, పుర, ముడా ఛైర్మన్లు కేసీ.నర్సింహులు, గంజి వెంకన్న పాల్గొన్నారు.

* తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. జానపద, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు నయనానందాన్ని పంచాయి. కళాకారులను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ స్వర్ణమ్మ, ఎమ్మెల్యేలు డా.సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సత్కరించి అభినందించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన జిల్లాకు చెందిన అనిల్‌కుమార్‌రెడ్డి, బి.మల్లేష్‌, బోయ చెన్నయ్య కుటుంబాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పరామర్శించారు. కుటుంబ పరిస్థితులను ఆరా తీసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారిని ఘనంగా సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని