logo

సాగునీటి రంగంలో అద్భుత విజయాలు

జిల్లా సాగునీటి రంగంలో అద్భుత విజయాలు సాధించామని, ఫలితంగా వేసవిలోనూ చెరువులు జలకళను సంతరించుకున్నాయని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు.

Published : 03 Jun 2023 04:25 IST

రాష్ట్ర అవతరణ దినోత్సవంలో ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు

వేదికపై కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌, విప్‌ గువ్వల బాలరాజు, ఎస్పీ మనోహర్‌, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, జడ్పీ ఛైర్‌ పర్సన్‌ శాంతకుమారి

నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే : జిల్లా సాగునీటి రంగంలో అద్భుత విజయాలు సాధించామని, ఫలితంగా వేసవిలోనూ చెరువులు జలకళను సంతరించుకున్నాయని ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని పోలీస్‌ కవాతు మైదానం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా అమరవీరులకు నివాళి అర్పించారు. జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం నిర్వహించిన సభలో జిల్లా అభివృద్ధి, సాధించిన విజయాలను వివరించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది 37.35 టీఎంసీ నీటిని ఎత్తిపోయటం జరిగిందన్నారు. అచ్చంపేట, ఉప్పునుంతల మండలాల్లో 15 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు పులిజాల నుంచి చంద్రసాగర్‌ చెరువు వరకు 15 కిలోమీటర్లు బ్రాంచి కాలువ నిర్మాణం కోసం రూ.107.20 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతి వచ్చిందన్నారు. అచ్చంపేట, బల్మూరు మండలాల్లో 70 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఐదు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఉమామహేశ్వరం, చెన్నకేశవ జలశయాలను  రూ. 1,534 కోట్లతో నిర్మిస్తామన్నారు. స్టేజ్‌-2 కింద 14,400 ఎకరాలకు నీరందించేందుకు రూ.687 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు పంపించామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 90 టీఎంసీల నీటిని తీసుకునేందుకు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. బిజనేపల్లి మండలంలో మార్కండేయ ఎత్తిపోతల పథకంకు రూ.76.95 కోట్లతో చేపట్టిన పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. మిషన్‌ కాకతీయ కింద చెరువులు బాగుపడటంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగిందన్నారు. జిల్లాలో రైతు బంధు పథకంలో 2.88 లక్షల మందికి రూ. 3,236 కోట్లు వారి ఖాతాలలో జమ చేశామన్నారు. 4,323 మంది రైతులకు బీమా పరిహారం రూ.216.15 కోట్లు చెల్లించామన్నారు. బిజినేపల్లి మండలంలోని పాలెంలో వ్యవసాయ డిగ్రీ కళాశాలను 2015లో ఏర్పాటు చేయగా రూ.29కోట్లతో భవనం నిర్మించామన్నారు. రూ.63కోట్లతో 107500 మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థం గల 26 గోదాంలను సిద్ధం చేశామన్నారు.

వన్యమృగాల సంఖ్య పెరిగింది.. : హరితహారం తొమ్మిదో విడతలో రూ.45లక్షలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాం. అడవుల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యల కారణంగా వన్యమృగాల సంఖ్య పెరిగింది. పులుల గణన ప్రకారం 24 అతి పెద్ద పులులు, 118 చిరుత పులులు, రెండు వందల రకాల పక్షులను గుర్తించటం జరిగింది. మన్ననూర్‌ జంగల్‌ రిసార్ట్స్‌లో భాగంగా టైగర్‌ స్టే ప్యాకేజీని ఏర్పాటు చేశారు. ఫరహబాద్‌ జంగల్‌ సఫారీను నిర్వహిస్తున్నాం.

అందుబాటులో అధునాత వైద్యం : వైద్య సేవలు మరింత విస్తరించాలనే ఉద్దేశ్యంతో నాగర్‌కర్నూల్‌ జిల్లాకు వైద్య కళాశాలను మంజూరు చేసింది. 150 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించింది. జిల్లాకు 124 పల్లె దవాఖానాలు వచ్చాయి. నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, జిల్లా పరిషత్తు ఛైర్‌ పర్సన్‌ శాంతకుమారి, జిల్లా కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌, ఎస్పీ మనోహర్‌, అదనపు కలెక్టర్లు మోతిలాల్‌, మనూచౌదరి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

భగీరథ అద్భుతం.. : మిషన్‌ భగీరథ కింద జిల్లాలో 726 అవాసాలకు ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తున్నాం. 2024 కిలో మీటర్ల పైపు లైన్లు వేసి 601 గ్రామ ట్యాంకులను నిర్మించాం. 1.92 లక్షల నల్లా కనెక్షన్లు ఇచ్చాం. పట్టణ ప్రాంతాలలో ప్రతి వ్యక్తికి రోజుకు 135 లీటర్లు, గ్రామీణా ప్రాంతాలలో వంద లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నాం.

చారగొండ పైలట్‌ మండలంలో.. : దళిత బంధు పథకం కింద రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. జిల్లాలో చారగొండ మండలాన్ని పైలట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి 1,407 కుటుంబాలకు రూ.140 కోట్లు సాయం చేశాం. నాలుగు నియోజకవర్గాల్లో 301 మంది లబ్ధిదారులకు రూ.30.10 కోట్లు మంజూరు చేశామన్నారు.

 

వందేమాతరం ఫౌండేషన్‌ విద్యార్థుల కోలాట ప్రదర్శన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని