logo

గిరిజన గురుకులాల్లో ప్రవేశాలకు వేళాయె!

తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.

Published : 03 Jun 2023 04:25 IST

కల్వకుర్తి : బీసీ బాలికల గురుకుల విద్యాలయం

అచ్చంపేట, కల్వకుర్తి, న్యూస్‌టుడే: తెలంగాణ గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. కార్పొరేట్‌ స్థాయి నాణ్యమైన ఉచిత విద్యతోపాటు క్రీడలు, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ, అధునాతన సౌకర్యాలతో పాటు పౌష్టికాహారం అందించనున్నారు. 2023-24 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేరేందుకు ఈ ఏడాది నిర్వహించిన పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే అర్హులు. రాష్ట్రవ్యాప్తంగా 103 కళాశాలలుండగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో బాలికలు ఆరు, బాలురకు మూడు చొప్పున మొత్తం 9 గిరిజన గురుకుల కళాశాలల్లో 680 సీట్లున్నాయి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, హెచ్‌ఈసీ, సీఈసీతో పాటు వృత్తివిద్యా కోర్సుల్లో ఆంగ్ల మాధ్యమంలోనే బోధన నిర్వహించనున్నారు.

పదో తరగతి జీపీఏ ఆధారంగా ఎంపిక.. : తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 15 దరఖాస్తులకు తుది గడువుగా విధించారు. తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 2 లక్షలు మించరాదు. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 17 ఏళ్లలోపు ఉండాలి. ఎస్టీ విద్యార్థులకు రెండేళ్ల గరిష్ఠ వయో పరిమితి అవకాశం ఉంది. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ కోర్సుల్లో ఒక్కో కళాశాలలో 40 సీట్లు ఉంటాయి. ఇందులో ఎస్టీలకు 34, జనరల్‌/ఈబీసీ, బీసీ, ఎస్సీ, అనాథలు, దివ్యాంగులు, క్రీడాకారులకు ఒక్కో సీటును రిజర్వు చేశారు. 30 సీట్లు ఉన్న వృత్తి విద్యా కోర్సుల్లో ఎస్టీలకు 24, ఇతర విభాగాల్లో ఒక్కో సీటు కేటాయించారు. 20 సీట్లు ఉన్న వృత్తి విద్యా కోర్సుల్లో ఎస్సీలకు 14, ఇతర విభాగాలకు ఒక్కో సీటు రిజర్వు చేశారు. పదోతరగతి జీపీఏ ఆధారంగా ఎంపిక చేస్తారు. సందేహాలుంటే ఉమ్మడి జిల్లా గిరిజన గురుకులాల ప్రాంతీయ సమన్వయకర్త నాగార్జున చరవాణి నం. 77803 75773, హెల్ప్‌లైన్‌ నం. 91211 74434 ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని