logo

లోతట్టుపై ముందుచూపు!

ఏటా భారీ వర్షాలకు పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ప్రతి ఏడాది ఈ సమస్య ఎదురవుతోంది. లోతట్టు ప్రాంతాలు మునకకు గురికాకుండా భద్రతా చర్యలు చేపట్టాలని సీడీఎంఏ కార్యాలయం నుంచి ఉమ్మడి జిల్లాలోని 19 పురపాలికల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలొచ్చాయి.

Published : 03 Jun 2023 04:25 IST

అయిజలో మురుగు కాలువలో పూడిక తీస్తున్న పుర సిబ్బంది

అయిజ, న్యూస్‌టుడే : ఏటా భారీ వర్షాలకు పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ప్రతి ఏడాది ఈ సమస్య ఎదురవుతోంది. లోతట్టు ప్రాంతాలు మునకకు గురికాకుండా భద్రతా చర్యలు చేపట్టాలని సీడీఎంఏ కార్యాలయం నుంచి ఉమ్మడి జిల్లాలోని 19 పురపాలికల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలొచ్చాయి. మహబూబ్‌నగర్‌, గద్వాల, వనపర్తి, నారాయణపేట, జడ్చర్ల, అయిజ, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, అచ్చంపేట, కల్వకుర్తి పాత పురపాలికలు కాగా భూత్పూర్‌, కోస్గి, మక్తల్‌, పెబ్బేరు, కొత్తకోట, అమరచింత, ఆత్మకూరు, అలంపూర్‌, వడ్డేపల్లి కొత్త బల్దియాలుగా అవతరించాయి. ఓమోస్తారు వర్షాలు కురిసినా ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. కొత్త పురాల్లో సమస్య అంత తీవ్రంగా లేకపోయినా వరద నీరు సవ్యంగా ముందుకెళ్లే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

వర్షాలు కురిసినప్పుడే హడావిడి : పట్టణాధికారులు, పాలకవర్గాలు వర్షాలు కురిసినప్పుడు హడావిడి సృష్టించి తాత్కాలిక చర్యలు చేపట్టి చేతులు దులుపుకొంటున్నారు. ఈసారి రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో వరద నుంచి ఉపశమనం కలుగుతుందో లేదో చూడాలి. ప్రధాన మురుగుకాలువలు, లోతట్టు ప్రాంతాల్లోని గుంతల్లో నీరు చేరకుండా నీటిని మళ్లించే చర్యలు, అంతర్గత కాలనీల్లో మురుగు కాలువల్లో పూడికతీత తదితర చర్యలు చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇవన్నీ పురాల్లో చేపడితే కనీసం కొంతలోకొంతైనా వరద ప్రమాదం నుంచి గట్టెక్కవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం పుర అధికారులు మురుగు కాలువల్లో పూడికతీత చర్యలు చేపట్టారు. ప్రధానంగా వరద ముంపునకు కారణమయ్యే ప్రాంతాల్లో ఈ పనులు వందశాతం చేపట్టాలని కసరత్తు చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి నేరుగా లోతట్టుకు నీరు రాకుండా మళ్లించే చర్యలు ఇంకా చేపట్టలేదు. చెరువులు, వాగులు, వంకలు ఆక్రమణకు గురైన ప్రాంతాల్లో వరద ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అలాంటి ప్రాంతాల్లో చర్యలు ప్రారంభించాల్సి ఉంది. ప్రస్తుతం మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తి చేయకపోతే ఈసారి ముప్పు తప్పదని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు.

చర్యలు చేపడుతున్నాం : సీడీఎంఏ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలను పాటిస్తాం. ఏటా వరద ప్రాంతాల్లో చర్యలు చేపడుతన్నాం. ఈసారి ముందస్తుగా అయిజలో మురుగు కాలువల్లో పూడిక తీయిస్తున్నాం. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టిపెట్టి అక్కడ పనులకు ఉపక్రమించాం. పెద్దవాగు పరివాహక ప్రాంతాల్లో వరద నీరు రాకుండా చర్యలు తీసుకుంటాం.

నర్సయ్య, అయిజ పుర కమిషనర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు